సమయానికి లేని బాజా ఎందుకు అని సామెత..ఎన్నికలకు ప్రచార మాధ్యమాలకు చాలా అవినాభావ సంబంధం వుంది. మీడియా అంటే ఇప్పుడు సినిమా కూడా పరోక్ష భాగమై పోయింది. గతంలో రాజకీయ చిత్రాలు అనేకం వచ్చేవి. ఎన్టీఆర్ అధికారంలో వుండగా కృష్ణ చకచకా సినిమాలు తీసారు. ఆ తరువాత రాజకీయ సినిమాలు పెద్దగా కనిపించకుండా పోయాయి.
తాజగా ఈ వారం 'ఆ అయిదుగురు' అన్న సినిమా విడుదలయింది. చూడగానే జనాలకు ముందుగా వచ్చే అనుమానం ఈ సినిమా జగన్ కోసం తీసారా అని. సినిమాలో యువ ముఖ్యమంత్రి క్యారెక్టర్ ఒకటి వుంది. అది జగన్ ను పోలి వుంటుంది. పైగా సినిమాలో ఓ పాత్ర చేత, ఆ యువ ముఖ్యమంత్రి తండ్రి ప్రస్తావన, 108, ఆరోగ్యశ్రీ, ఫించన్లు వంటి డైలాగులు వున్నాయి. అన్నట్లు హోం మినిస్టర్ పాత్రలో ఓ అమ్మాయి కనిపిస్తుంది. పాత్ర తెరపైకి రాగానే జనం వాసిరెడ్డి పద్మనా అని చమత్కరించడం విశేషం. సినిమా లైన్, వ్యవహారం ఎలా వున్నా, మొత్తం మీద జగన్ ను ప్రజల్లో ప్రమోట్ చేయడానికి ఈ సినిమా ఉద్దేశించినట్లు అనిపిస్తుంది.
ఆఫ్ ది రికార్డుగా టాలీవుడ్ జనాలు చెప్పుకోవడం ఏమిటంటే, ఈ సినిమా జగన్ ప్రమోషన్ కోసమే తీసారని, కానీ కాస్త లేట్ అయి, ఎన్నికల అనంతరం విడుదల చేసారట. మరో వెర్షన్ కూడా వినిపిస్తోంది. వైకాపా టికెట్ ఆశించిన జనాలు ఈ సినిమా వెనుక వున్నారని. ఈ విషయాల్లో నిజా నిజాల సంగతి ఎలా వున్నా, సినిమా చూస్తే మాత్రం తెలిసో, తెలియకో, కావాలనో, మరెందుకో జగన్ ప్రమోషన్ కోసం చేసారని అనిపిస్తుంది. అయితే ఎన్నికల ముందు వచ్చి వుంటే ఉధయతారకంగా వుండి వుండేదేమో?