‘అన్నమో రామచంద్రా..’ అనేది మనం సామెతల్లో వినడమే గానీ.. ప్రజలు అంతగా ఆరాటపడిన సందర్భాలను చూసి ఎరగం. కానీ.. ప్రధాని నరేంద్రమోడీ దెబ్బకు అమెరికాలోని భారతీయులు, ప్రధానంగా తెలుగువారు.. ‘బియ్యమో రామచంద్రా..’ అంటూ వెర్రెత్తిపోతున్నారు.
సూపర్ మార్కెట్ల మీదికి ఎగబడుతున్నారు. సూపర్ మార్కెట్లలో సోనామసూరి బియ్యం ప్యాకెట్ల మీదికి ఎగబడుతున్నారు. చిన్నతనంలో రిలీజ్ రోజు సినిమా టికెట్ల కోసం ఎగబడినట్టు, వీధి కొళాయిల దగ్గర నీళ్ల బిందెల కోసం ఎగబడినట్టు అమెరికాలో తెలుగువారు, భారతీయులు సూపర్ మార్కెట్ల మీదకు సోనామసూరి బియ్యం కోసం ఎగబడుతున్నారు.
హఠాత్తుగా మార్కెట్లలో సోనామసూరి బియ్యం ధరలు రెండింతలు, మూడింతలు అయిపోయాయి. సోనామసూరి బియ్యం కొనుగోలుకు సంబంధించి ఆకర్షణీయమైన ప్యాకేజీ ఆఫర్లు కూడా తయారవుతున్నాయి. ఇంత దారుణమైన రాద్ధాంతం ఎందుకు జరుగుతోందా? అని ఆశ్చర్యపోతున్నారా? అంతా నరేంద్రమోడీ మహిమ!
ప్రధాని నరేంద్రమోడీ బియ్యం ఎగుమతులపై ఒక్కసారిగా నిషేధం విధించారు. బాస్మతి తప్ప అన్ని రకాల బియ్యం ఎగుమతుల మీద నిషేధం అమల్లోకి వచ్చింది. దీంతో ఇక బియ్యం దొరకదేమో అనే భయంతో.. జనం ఎగబడి బియ్యం కొంటున్నారు.
ఆరు నెలల కిందట గోధుమల ఎగుమతులు ఆపేసి, విదేశాలలో ఉత్తరాది వాళ్ళను, ఆహార నియంత్రణ పాటిస్తున్న వాళ్ళను దెబ్బకొట్టిన మోడీ, ఈ సారి బియ్యం ఎగుమతులు నిషేధించి దక్షిణ భారతీయులకు షాక్ ఇచ్చారని అంతా అనుకుంటున్నారు. పొద్దున్న బియ్యం ఎగుమతులపై నిషేధం వార్త బయటకు వచ్చిందో లేదో… అమెరికా లో జనాలు ఇండియన్ స్టోర్ లకు పరుగులు పెట్టారు. అదే సందు అన్నట్టు, స్టోర్ వాళ్ళు నిన్నటి దాకా $20 ఉన్న బాగ్ (10కేజీ),ఈ రోజు $30, కొన్ని చోట్ల $50 కూడా చేసారు. కొన్ని చోట్ల మనిషికి 1 బాగ్ అని లిమిట్ పెడితే, లిమిట్ లేని చోట్ల, రేట్ పెంచని చోట్ల జనాలు ఒక్కొక్కళ్ళు 10 బాగ్ లు వేసుకొని తెచ్చేసుకుంటున్నారు.
ఎందుకిలా?
ప్రధాని నరేంద్రమోడీ సర్కారు ఇప్పుడు హఠాత్తుగా ఎందుకిలా.. బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది.. అనేది ఎవ్వరికీ అర్థం కాని ప్రశ్న. ఈ నిషేధం వచ్చే ఏడాది పార్లమెంటు ఎన్నికల వరకు కొనసాగవచ్చునని కూడా పలువురు అంచనా వేస్తున్నారు. హఠాత్తుగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక.. భారత్ లో ఆహార సంక్షోభం వస్తుందనే భయంలో కేంద్రప్రభుత్వం ఉన్నదనే వాదన ఒకటి వినిపిస్తోంది.
అసలే దేశంలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ప్రత్యేకించి టమోటానే తీసుకుంటే.. అసలు ఊహకందని రీతిలో ధరలు పెరిగిపోయాయి. దేశవ్యాప్తంగా ప్రజలు ప్రభుత్వాలు చేతకానివంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రభుత్వాన్ని వెటకారం చేయడానికి, టమోటా దుకాణాలకు బౌన్సర్లను నియమించడం, అలాంటి దుకాణాదార్ల మీద పోలీసుకేసులు నమోదు చేయడం కూడా జరుగుతోంది. టమోటాతో ప్రారంభమైన ఈ అధికధరల సంక్షోభం .. మొత్తం దేశంలో ఆహార సంక్షోభంగా మారుతుందని ప్రధాని మోడీ భయపడుతున్నట్టుగా తెలుస్తోంది.
అదే జరిగితే గనుక.. ఈ ఏడాదిలో జరిగే అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు, వచ్చే ఏడాది పార్లమెంటు ఎన్నికల్లో కూడా తమ పార్టీకి దారుణమైన ప్రతికూల ప్రభావం చూపిస్తుందని ఆయన భయపడుతున్నట్లుంది. అందుకే ఎగుమతులను నిషేధించారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అమెరికాలో ప్రధానంగా తెలుగువారు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సమస్య మరీ తీవ్రంగా ఉంది. సాధారణంగా వీరంతా సోనామసూరి బియ్యం మీదనే ఆధారపడుతుంటారు. ఒక్కసారిగా సూపర్ మార్కెట్లలో స్టాక్ కూడా అయిపోవడంతో.. సంక్షోభం ఏర్పడే పరిస్థితి ఉంది.
వ్యవసాయ బిల్లులను రూపొందించిన సమయంలో.. అన్నదాతకు విస్తృతమైన వ్యాపార స్వేచ్ఛ ఇవ్వడానికి.. ఏ ప్రాంతం రైతు అయినా.. మరెక్కడైనా సరే.. తనకు నచ్చిన చోట అమ్ముకోవచ్చునని సుద్దులు చెప్పిన ప్రధాని మోడీ.. ఇప్పుడిలా ఏకంగా బియ్యం ఎగుమతుల మీద నిషేధం విధించేయడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.