‘భారతీయుడు’ ఓడిపోయాడా?

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో ఘన విజయం సాధించారు. ఇది. తిరుగులేని విజయం. ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసినదానికంటే ఘనమైన విజయం. అవినీతిపరులకు నైతిక స్థైర్యం సమకూర్చే విజయం. ప్రజల…

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో ఘన విజయం సాధించారు. ఇది. తిరుగులేని విజయం. ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసినదానికంటే ఘనమైన విజయం. అవినీతిపరులకు నైతిక స్థైర్యం సమకూర్చే విజయం. ప్రజల సొమ్మును దోచుకునేవారికి ధీమా కలిగించే విజయం. ప్రభుత్వ అవినీతి నిరోధక శాఖ, నిఘా వ్యవస్థల సామర్థ్యాన్ని కించపరిచే విజయం. అవినీతిపై పద్దెనిమిది సంవత్సరాల సుదీర్ఘ పోరాటాన్ని ఐదు నిమిషాల్లో నీరుగార్చిన విజయం. జయలలిత అక్రమాస్తుల కేసును విచారించిన ‘ప్రత్యేక కోర్టు’కు ఏ ప్రత్యేకతా లేదని తెలియచెప్పిన విజయం. అంతిమంగా ‘భారతీయుడి’ని ఓడగొట్టిన విజయం. భారతీయుడు అంటే ఓ వ్యక్తి కాదు. అవినీతిపై పోరాటం చేసేవారని అర్థం. జయ ముఖ్యమంత్రిగా తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమంగా ఆస్తులు సంపాదించారని మొట్టమొదటగా ఫిర్యాదు చేసిన అప్పటి జనతా పార్టీ అధ్యక్షుడు (ఇప్పుడు భాజపా నేత)  డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి భారతీయుడు. ఆయన ఓడిపోయారు. అయితే జయలలిత నిర్దోషిగా బయటకు వచ్చి ఘన విజయం సాధించినట్లు కనబడుతున్నా అది పూర్తిగా నిజం కాదు. భారతీయుడు (డాక్టర్ స్వామి)  సుప్రీం కోర్టుకు వెళతానంటున్నారు కాబట్టి ఆమె అవినీతిని నిర్ధారించడానికి మరో అవకాశం ఉంది. అక్కడా నిర్దోషి అని తేలితే  అవినీతి రహిత ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారు.  

దేశాన్ని దేవుడే రక్షించాలి

అక్రమాస్తుల కేసులో జయలలిత నిర్దోషి అంటూ కర్నాటక హైకోర్టు తీర్పు ఇవ్వగానే సామాజిక మీడియాలో అనేక వ్యంగ్య వ్యాఖ్యానాలు, జోకులు, కామెంట్లు వెల్లువెత్తాయి. ‘ఈ దేశాన్ని దేవుడే రక్షించాలి’ అని అనేకమంది వ్యాఖ్యానించారు. గమ్మత్తయిన కథలు పోస్టు చేశారు. కేవలం సామాన్య జనమే కాదు, పెద్ద పదవుల్లో ఉన్నవారు, పాత్రికేయులు, వివిధ రంగాల్లో నిపుణులు సామాజిక మీడియాలో  కామెంట్లు చేశారు.  న్యాయ వ్యవస్థ మీద అపనమ్మకం వ్యక్తం చేశారు. కోర్టులు ధనికులకు, రాజకీయ పలుకుబడిగలవారికి, పెట్టుబడిదారులకు వత్తాసు పలుకుతున్నాయని అభిప్రాయపడ్డారు. ‘నిన్న భాయ్ (సల్మాన్ ఖాన్), నేడు అమ్మ…తరువాత ఎవరు బాపూ‘ అని ఒకరు వ్యాఖ్యానించారు. ‘ఫుల్ మార్క్స్ టు ఇండియన్ జ్యుడీషియల్ సిస్టం. మేరా భారత్ మహాన్’ అని మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ వ్యాఖ్యానించారు. ‘కర్నాటక హైకోర్టు పన్నీరుశెల్వంను విజయవంతంగా ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించింది’ అని ప్రముఖ పాత్రికేయుడు శేఖర్‌గుప్తా కామెంట్ చేశారు. ఓ నెటిజన్  ‘జయ నిర్దోషి, సల్మాన్‌కు బెయిల్, ఈ దేశంలో బలవంతులు, ధనవంతులు గ్రేట్ అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి’ అని వ్యాఖ్యానించాడు. దేశంలో అనేకమంది సామాన్యులు విచారణ కూడా లేకుండా ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతుండగా, పెద్దవాళ్లు ఘోరమైన నేరాలు చేసి కూడా బెయిల్‌పై ఏళ్ల తరబడి బయటనే ఉంటున్నారు. బలవంతులకు ఓ న్యాయం, బలహీనులకు మరో న్యాయం అనే సంగతి అర్థమవుతూనే ఉంది.. 

హైకోర్టు వ్యవహారశైలిపై అనుమానాలు

జయలలిత కేసులో కర్నాటక హైకోర్టు సరిగానే వ్యవహరించిందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. కొన్ని కీలకమైన ప్రశ్నలకు జవాబులు దొరకడంలేదు. ఈ కేసులో తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి జస్టిస్ కుమారస్వామి వైఖరిపై కొందరు న్యాయవాదులే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన తీర్పులో హేతుబద్ధతను ప్రశ్నిస్తున్నారు. న్యాయమూర్తి తప్పుడు లెక్కలు వేశారని అంటున్నారు. ‘అర్థమేటికల్ ఎర్రర్స్’ జరిగాయని ఈ కేసుకు ఆద్యుడైన ప్రస్తుత భారతీయ జనతా పార్టీ నాయకుడు డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. ఈ కేసులో కీలకమైన విషయమేమిటంటే…స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియమించకముందే న్యాయమూర్తి తీర్పు రిజర్వు చేశారు. అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలు వినిపించే అవకాశం లేకుండాపోయింది. ఇది అన్యాయం కదా అనే ప్రశ్న ఉదయిస్తోంది. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీవీ ఆచార్య ఇదే విషయం చెప్పారు. ‘ఈ కేసులో కోర్టు సరైన రీతిలో వ్యవహరించలేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. తనకు వాదించే అవకాశమే కల్పించలేదన్నారు. అభ్యంతరాల దాఖలుకు ఒక్కరోజు మాత్రమే గడువిచ్చారని చెప్పారు. ఈ చర్య ‘ఆందోళనకర దురభిప్రాయానికి’ (సీరియస్ ప్రిజుడిస్) తావిస్తోంది’ అని సీరియస్‌గా అన్నారు. అంటే కోర్టు జయకు అనుకూలంగా వ్యవహరించిందనే అభిప్రాయం కలగడానికి ఆస్కారం ఉందనేది ఆచార్య వాదన. ఇది వాస్తవమే కదా…! పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకం జరగకముందే తీర్పు రిజర్వు చేయడమంటే అర్ధం ఏమిటి?  అంతకుముందు తనకు అనుకూలుడైన భవానీ సింగ్ అనే ఆయన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమించాలని జయ పట్టుబట్టారు. కాని సుప్రీం కోర్టు పడనివ్వలేదు. మరో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియమించాలని ఆదేశించింది. అంటే ఆయన్ని నియమించాక, ఆయన వాదనలు విన్నాక ఏం తీర్పు ఇవ్వాలనేది నిర్ణయించాలి. కాని ప్రత్యేక పబ్లిక్     ప్రాసిక్యూటర్ నియామకానికి ముందే తీర్పు రిజర్వు చేయడం, ఆయనకు వాదించే అవకాశం లేకుండా చేయడం ఈ కేసులో అనుమానాలకు తావిస్తోంది. కేవలం జయ తరపు న్యాయవాదుల వాదనలు విని తీర్పు ఇచ్చారనుకోవాలా?

ప్రత్యేక కోర్టులకు విలువ లేదా? 

జయలలిత, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కేసుల తీరు చూసిన తరువాత మన దేశ న్యాయ వ్యవస్థపై సామాన్యుల్లో అవిశ్వాసం కలుగుతోంది. దశాబ్దాలుగా కింది కోర్టుల్లో కేసుల విచారణ సాగి అక్కడ నిందితులకు శిక్షలు విధించిన తరువాత హైకోర్టులు ఒక్క కలం పోటుతో ఈ తీర్పులను ‘చెత్త తీర్పు’గా నిర్ధారిస్తున్నాయి. హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్‌పై 13 ఏళ్లపాటు ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. ఆ కోర్టు నాలుగేళ్ల శిక్ష విధించింది. తెల్లవారే హైకోర్టు అతనికి బెయిల్ ఇచ్చేసింది. ప్రత్యేక కోర్టు తీర్పు గాలికి పోయింది. జయ కేసు 1 ఏళ్లపాటు సాగింది. ప్రత్యేక కోర్టు శిక్ష విధించింది. హైకోర్టు ఆమెను నిర్దోషిగా విడుదల చేసింది. ఈ కేసుల్లోని న్యాయపరమైన అంశాలను అలా వుంచితే..ప్రత్యేక కోర్టుల తీర్పులకు విలువ లేకుండా చేయడం సామాన్య జనం హర్షించడంలేదు. అందులోనూ కేసుల విచారణ సుదీర్ఘంగా కొనసాగి కూడా నిందితులు బెయిల్ మీద బయటకు రావడమో, నిర్దోషులుగా విడుదల కావడమో జరుగుతుండటంతో ‘తప్పు చేసినవారికి శిక్ష పడదు’ అనే అభిప్రాయం కలుగుతోంది. సల్మాన్ ఖాన్ తాగి కారు నడిపి ఒక వ్యక్తి మరణానికి కారణమయ్యాడని స్పష్టంగా తేలిన తరువాత హైకోర్టు మళ్లీ ఏం విచారిస్తుంది? ప్రత్యేక కోర్టు విచారణేక 13 ఏళ్లు పట్టిన తరువాత హైకోర్టులో ఇంకా కొన్నేళ్లు పడుతుంది. అక్కడ తీర్పు అతనికి అనుకూలంగా రావొచ్చు. కింది కోర్టులో శిక్ష పడినా హైకోర్టులో కేసు విచారణలో ఉన్నంతకాలం అతను బయటనే ఉండి జల్సాగా గడపొచ్చు. చివరకు ప్రత్యేక కోర్టులకు విలువ లేకుండాపోయింది. సల్మాన్, జయ కేసులను పరిశీలిస్తే చిన్న కేసుల విచారణకు, పెద్ద కేసుల విచారణకు కూడా దశాబ్దాల సమయం పడుతోంది.  

జయ కేసు గణాంకాల గందరగోళం

జయలలిత కేసును పరిశీలిస్తే తేలే విషయం ఏమిటంటే….ఇది పూర్తిగా గణాంకాల గందరగోళం. ప్రత్యేక కోర్టు తప్పుడు లెక్కలు వేసిందని హైకోర్టు న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. కాదు…హైకోర్టే తప్పుడు లెక్కలు వేసిందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆచార్య, డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి తదితరులు చెబుతున్నారు. ‘హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేయడానికి తప్పుడు లెక్కలే ఆయుధంగా ఉపయోగపడతాయి’ అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆచార్య వ్యాఖ్యానించారు. ‘అర్థమేటక్ ఎర్రర్స్’ ఉన్నాయని చెప్పిన డాక్టర్ ఈ తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేస్తామన్నారు. ఈ కేసు సుప్రీంకు వెళ్లాల్సిందేనని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ‘జయ అక్రమాస్తుల కేసు 1 ఏళ్లపాటు సరైన దారిలోనే సాగింది. ఎంతో కష్టపడి ప్రతి ఆరోపణకూ తగిన ఆధారాన్ని కోర్టుకు సమర్పించాం. అందుకే ప్రత్యేక కోర్టు దోషిగా ప్రకటించింది’ అని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పాగా, హైకోర్టు న్యాయమూర్తి ‘ప్రత్యేక కోర్టు తీర్పులో పస లేదు’ అని ఒక్క ముక్కతో తేల్చిపారేశారు. ఇది చాలా పెద్ద, సుదీర్ఘంగా విచారణ జరిగిన కేసు కదా తీర్పు చాలాసేపు చదవుతారని కొందరు అనుకున్నారు. కాని న్యాయమూర్తి కేవలం నాలుగు నిమిషాల్లోనే జయను, మిగిలినవారిని నిర్దోషులుగా ప్రకటించి వెళ్లిపోయారు. 

ఈ తీర్పు అక్రమార్కులకు బలం

అక్రమంగా ఆస్తులు సంపాదించుకునేవారికి, ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నవారికి జయ కేసు తీర్పు కొంత బలాన్ని ఇచ్చిందనే చెప్పొచ్చు. ‘ఆదాయానికి మించి ఆస్తులు 20 శాతం ఎక్కువగా ఉన్నట్లయితే అది అక్రమాస్తి కిందకు రాదు’ అని న్యాయమూర్తి చెప్పిన అంశం ఈ తీర్పులో చాలా కీలకం. అదే జయను నిర్దోషిగా బయటపడేసింది. ఆమె అక్రమాస్తులు పది శాతం కంటే తక్కువగా ఉన్నాయని న్యాయమూర్తి అభిప్రాయ పడ్డారు. అక్రమాస్తులు పది నుంచి ఇరవై శాతం ఎక్కువగా ఉంటే తప్పు కాదని ఆంధ్రప్రదేశ్‌లో (ఉమ్మడి రాష్ర్టం) జీవో ఉందని న్యాయమూర్తి చెప్పారు. ఆస్తుల లెక్కలంటేనే గణాంకాలను తారుమారు చేయడం. విలువలు తక్కువగా చూపించడం. ఈ తీర్పుతో అక్రమాస్తులు ఉన్నవారంతా దాన్ని ఇరవైశాతం మించకుండా మేనేజ్ చేస్తారు. ఇంతకాలం ఈ జీవో ఉన్న సంగతి చాలామందికి తెలియకపోవచ్చు. మరి ఇప్పుడు రాష్ర్టం విడిపోయింది కాబట్టి ఇది చెల్లుతుందో లేదో చెప్పలేం. ఏది ఏమనా జయలలిత కేసులో కర్నాటక హైకోర్టు తీర్పు సంచలనం కలిగించడంతోపాటు అనేక అనుమానాలకూ ఆస్కారం ఇచ్చేలా ఉంది. న్యాయవ్యవస్థను రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు ప్రభావితం చేస్తున్నట్లుగా కనబడుతోందని కొందరు వ్యాఖ్యానించడంలో ఆశ్చర్యంలేదు. జయకు అనుకూలంగా తీర్పు రావడంలో మోదీ సర్కారు పాత్ర ఏమిటన్నదానిపై కూడా చర్చ సాగుతోంది. 

ఎం.నాగేందర్