మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ఉన్నపుట్టమరాజు కండ్రిక గ్రామాన్ని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించేందుకుగాను తన దత్తత గ్రామంలో గ్రామోత్సవం పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించాలని సచిన్ యోచిస్తున్నాడు. ఈ విషయం ఈ దిగ్గజ బ్యాట్స్‌మెన్ మాటల ద్వారా వెల్లడైంది.
కోయంబత్తూర్‌లోని ఒక మారుమూల గ్రామంలో ఇషా గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వాలీబాల్, త్రో బాల్, కబడ్డి, పోల్ క్లైంబింగ్ తదితర ఆటల పోటీలు నిర్వహించారు. వీటిలో గ్రామీణ యువతీ యువకులు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ గ్రామీణ క్రీడా కార్యక్రమం అద్భుత విజయం సాధించడం సచిన్‌ను అబ్బురపరచింది. ముగింపు రోజు ముఖ్య అతిధిగా హాజరైన సచిన్… ఇలాంటి క్రీడా సంబరాలు ప్రతి గ్రామంలో అవసరమన్నాడు. తాను దత్తత తీసుకున్న ఆంధ్రప్రదేశ్ లోని కండ్రిక గ్రామంలోనూ ఈ తరహా ఉత్సవాన్ని ఏర్పాటు చేయాలని ఆయన ఇషా ఫౌండేషన్‌ను కోరాడు. దీన్ని బట్టి త్వరలోనే కండ్రికలో గ్రామీణ ఆటల సంబరాన్ని మనం అంచనా వేయవచ్చు.
జీవితమే ఒక ఆట…
ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ క్రీడలు జీవితానికి చేసే మేలు అమూల్యం అన్నాడు. ఆటలు తనకు ఎన్నో ఇచ్చాయన్నాడు. తాను అడుగు బయట పెట్టిన ప్రతిసారీ విజయం సాధించలేదని, అయితే జీవితంలో ఏ విషయంలోనైనా ఒడిదుడుకులు, గెలుపోటముల్ని తట్టుకుని తిరిగి లేచే తత్వాన్ని క్రీడలు తనకు అలవరచాయన్నాడు. ఆటలు ఓర్పు, ఏకాగ్రత సహా ఎన్నో నేర్పిస్తాయన్నాడు.
సమిష్టిగా ఉండి సమస్యలను ఎదుర్కునే సమర్ధతను క్రీడలు అందిస్తాయన్నాడు. క్రీడలు నేర్పే అంశాలను నిజ జీవితంలో అనుసరిస్తే ఎన్నో సమస్యలకు సమాధానం దొరుకుతుందన్నాడు. ఈ సందర్భంగా తనకు చిన్నప్పుడు వాలీబాల్ అంటే ఇష్టముండేదన్న సచిన్… తమ ఇంట్లోనే డాబా మీద వాలీబాల్ ఆడేవాడ్నని గుర్తు చేసుకున్నాడు.