ఎమ్బీయస్‌: జానపద చిత్రాలు- 9

ఇన్ని లెక్కలు వేసి జమున ఇంట్లో జిప్సీగా ట్రెయిన్‌ అయింది. జిప్సీ అంటే మనభాషలో దొమ్మరిసాని. వాళ్లలాగే సర్కస్‌ చేయడాలూ, ఆటా, పాటా అన్నీ నేర్చింది. ఈ పనిలో ఆమెకు తన సోదరుడు సహాయపడ్డాడు.…

ఇన్ని లెక్కలు వేసి జమున ఇంట్లో జిప్సీగా ట్రెయిన్‌ అయింది. జిప్సీ అంటే మనభాషలో దొమ్మరిసాని. వాళ్లలాగే సర్కస్‌ చేయడాలూ, ఆటా, పాటా అన్నీ నేర్చింది. ఈ పనిలో ఆమెకు తన సోదరుడు సహాయపడ్డాడు. సోదరుడి పాత్ర రేలంగిది. పేరు భజగోవిందం. అతని ప్రియురాలు గిరిజ, ఆమె తండ్రి మోళీ దొర దొమ్మరి ఆట బాగా నేర్చినవారు. జమునను బాగా ట్రెయిన్‌ చేశారు. ఆ తర్వాత కోటలో రాజుగారి కోసం జమున ప్రదర్శన ఏర్పాటు చేశాడు రేలంగి. జమున తన ఆటా, పాటతో రామారావును మెప్పించింది. అతను తన శయ్యాగారానికి పిలిచాడు. ఆ రాత్రి వాళ్లిద్దరి కలయిక ఫలితంగా ఆమె గర్భవతి అయింది. రాజుగారు ఆ దొమ్మరిసానిని తన అంతపురంలో వుంచేసుకుందామని ముచ్చటపడలేదు. ఆ రాత్రి అనుభవంతో ఆమె పని సరి!  అప్పట్లో రాజుల వ్యవహారం యిలాగే వుండేది. వందల సంఖ్యలో వున్న ఉంపుడుగత్తెలు ఎవళ్లు ఎలా వుంటారో, గుర్తుంచుకోవడం, ఎప్పుడు ఏం చేస్తూన్నారో తెలుసుకోవడం రాజుగారికి సాధ్యమయ్యే పని కాదు. ఈ అంత:పురం జనానా.. స్త్రీజనం ఏళ్ల తరబడి రాజు కోసం పడిగాపులు కాయలేక కాపలావాళ్లకు లంచాలు పెట్టి  ప్రియుల దగ్గరకు వెళ్లిపోవడమే లేదా వాళ్లనే ఆడవేషాల్లో తమ వద్దకు రప్పించుకోవడమో చేసేవారు. లేదా సొరంగాలు తవ్వించి బయటకు వెళ్లిపోతూ వుండేవారు. 

సంస్థానాధీశుల వద్ద పనిచేసిన  దివాన్‌ జర్మనీదాస్‌ వాళ్ల ఆంతరంగిక రహస్యాలతో ''మహారాజా'' అనే పుస్తకం రాస్తే అబద్ధాలు, అతిశయోక్తులు రాశాడని ఆయన మీద ఏ రాచకుటుంబంవారు కేసు పెట్టలేదు. అందువల్ల అవి యదార్థాలనే మనం నమ్మవచ్చు. కపూర్‌తలా రాజో, మరోడో ఓ అమ్మాయిని చూసి మోజు పడ్డాడు. ఈ మంగమ్మలాగానే ఆ అమ్మాయి కూడా రాజుగార్ని తిరస్కరించింది. ఆమె కుటుంబం కూడా ఒప్పుకోలేదు. రాజ్యం విడిచి పారిపోదామనుకున్నారు. అప్పుడు రాజు నానా బీభత్సం చేసి, కుటుంబాన్ని హింసలు పెట్టి పంతం కొద్దీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఒక్క రాత్రి అనుభవించాడు. అంతే! మోజు తీరిపోయింది. తర్వాత ఏమయిందో పట్టించుకోలేదు. ఆమె దిక్కుమాలిన చావు చచ్చివుంటుంది. అందువల్ల ఈ సినిమా కథ అభూత కల్పన అయివుండనక్కరలేదు. అలాగే సొరంగాల విషయం – ఓ మహారాజు కూతురు, దివాన్‌తో అక్రమ సంబంధం పెట్టుకుంది. అతని కోసం తన అంత:పురంలోంచి ఓ సొరంగం తవ్వించి బయటకు వచ్చేసి యితనితో రాసలీలలు సాగించేది. వందేళ్ల లోపు చరిత్రే యిలా వున్నపుడు, ఎప్పుడో వేల ఏళ్ల క్రితం జరిగిన కథగా కల్పించినపుడు ఈ సినిమా కథను కొట్టిపారేయనక్కరలేదు. అందువల్లనే జమున సొరంగం ద్వారా పుట్టింటికి వెళ్లి వస్తూన్నా, తన వల్ల గర్భవతి అయి, పురుడు పోసుకుని పిల్లవాణ్ని కని అతన్ని పెంచుతున్నా రాజు కనిపెట్టలేకపోయాడని సినిమాలో చూపిస్తే మనం విస్తుపోనక్కరలేదు. పొయిటిక్‌ లిబర్టీ కూడా జోడించారు కాబట్టి, ఆ పిల్లవాడు మామ, అత్త సంరక్షణలో పెరిగి అచ్చు రామారావులాగానే వున్నట్టు చూపించారు. తల్లి నేచురల్‌గానే పెద్దదయింది. ఇప్పుడు చిన్న రామారావు మంగమ్మను (అనగా జమునను) అమ్మా అనాలి.

మంగమ్మ పాత్ర వేసిన జమున భానుమతి లాగానే పట్టుదల గల స్త్రీ పాత్రలకు పేరు తెచ్చుకున్నారు. సాత్త్వికమైన పాత్రలూ వేశారు, అహంభావి పాత్రలూ వేశారు. రామారావుతో ఢీ కొట్టే పాత్ర వేయడానికి ఆవిడే సరైన కథానాయిక అనుకున్నారు కానీ రెండో రామారావు ఆవిణ్ని అమ్మా అన్నారంటే జనం గొల్లుమంటారని చక్రపాణి డివియస్‌ రాజును హెచ్చరించారు. ఈ ప్రాబ్లెమ్‌ 'మంగళ' సినిమాలో ఎదురు కాలేదా అంటే అక్కడి స్టార్స్‌ వేరు. రంజన్‌ మనవాడు కాడు. భానుమతిని అమ్మా అన్నా ఓహో అనుకుని ఊరుకుంటాం. అప్పట్లో స్టార్‌ యిమేజ్‌ పట్టింపు మరీ అంత లేదు. ఈ సినిమా వచ్చేపాటికి స్టార్స్‌, వాళ్లకి స్టార్‌ ఇమేజ్‌ అనే చట్రమూ వచ్చిపడ్డాయి. రాంగ్‌ కాస్టింగ్‌ వల్ల సినిమాలు దెబ్బతినడమూ ఆరంభమైంది. పైగా జమునకు అప్పటికి పెళ్లి కాలేదు. తల్లి వేషాలు వేయడం లేదు. వయసు కూడా 28 యేళ్లే. ఆ మాటకొస్తే 'మంగళ' వేసేనాటికి భానుమతి గారి వయసు కూడా పాతికేళ్లే! అప్పుడు చెల్లిపోయింది. 'మంగళ'కి 'మంగమ్మ శపథం'కు మధ్య ఓ పుష్కరం వార వుంది. సినిమా తారలపై అభిమానుల పట్టు పెరిగింది. ప్రేక్షకులు యాక్సెప్ట్‌ చేయరేమోనన్న భయం నిర్మాతకు, తారలకు పట్టుకుంది. 

తీవ్రంగా ఆలోచించి చివరకు ధైర్యం చేయడానికే నిశ్చయించుకున్నారు. జమునకు మరో బెరుకూ వుంది. తల్లిగా కనిపించడమొక్కటే కాదు, మారువేషంలో పైట లేకుండా సెడక్టివ్‌గా వేయాలి. దొమ్మరిసాని వేషంలో పైట వేస్తే పాత్ర దెబ్బ తింటుంది. అప్పటిదాకా యిలాటివి వేయకపోయినా, ఈ కన్సెషన్‌ యివ్వకపోతే సినిమాకి అర్థమే లేదు. ఒక స్త్రీ మనోబలంతో, యుక్తితో తనకంటె బలవంతుడు, పై స్థాయిలో వున్న రాజుకి బుద్ధి చెప్పగలిగిందన్న అంశం జమునగారికి విపరీతంగా నచ్చేసింది. పైట లేకుండా కాస్త సెక్సీగానే వేయడానికి సిద్ధపడింది. ఇక తల్లీ కొడుకుల మధ్య సన్నివేశాలు సాధ్యమైనంత తగ్గించారు. వీళ్లు భయపడినట్టుగా ప్రేక్షకులు గోల చేయలేదు. వాళ్లని ఆ పాత్రల్లో ఆమోదించారు. ఈ సినిమా విడుదలైన ఐదారు నెలలకు జమున గారికి పెళ్లయింది. 

ఈ దొమ్మరిసాని వేషంలో ఆవిడ మాటలు వేరేరకంగా వుండేటందుకు జూనియర్‌ సముద్రాల ప్రత్యేక కృషి చేశారు. తవేష్నా.. బరస్‌ ఫరేనా.. హాలియా మస్తా.. అంటూ ఏవేవో మాటలు కాయిన్‌ చేశారు. (బాహుబలిలో వింతభాషలా) మంగమ్మ రాజుగారి వల్ల గర్భవతి అయిందని చెప్పాను కదా. పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు. వాడు నా కొడుకేనని గ్యారంటీ ఏమిటని రాజు గొడవ పెట్టి వుండడానికి అవకాశం వుంది. అప్పట్లో డిఎన్‌ఏ టెస్టులు లేవు కదా! కానీ అదృష్టవశాత్తూ ఆ పిల్లవాడు అచ్చు మహారాజులాగానే వున్నాడు. అందువల్ల మంగమ్మ తన పాతివ్రత్యానికి రుజువులు పట్టుకు రానక్కరలేకపోయింది. ఈ పాయింటు మీదనే డబుల్‌ రోల్‌కి అవకాశం వచ్చింది. ఈ డబుల్‌ రోలే లేకపోతే చిన్నవాడి చేతిలో అవమానం పాలవడానికి పెద్ద రాజు పాత్ర ఏ హీరో వేసేవాడు కాడు. అది రాజనాల లాటి ఏ విలన్‌కో వెళ్లేది. చిన్నవాడు పెరిగి పెద్దవాడయ్యాక తల్లి ద్వారా కథంతా విన్నాడు. తండ్రి మదం విని మండి పడ్డాడు. తల్లి మాట చెల్లిస్తానని మాట యిచ్చాడు. సరాసరి రాజమందిరంలోకి వెళ్లి నిద్రపోతున్న తండ్రి మొహానికి మసి పూశాడు. పొద్దున్న లేచి ఎవడు వాడు, పట్టుకోండి అని కొత్వాల్‌కు ఆర్డరేశాడు మహారాజు. 

ఇక్కణ్నుంచి చిన్నవాడి యుక్తి ప్రారంభమౌతుంది. కొత్వాల్‌, అతని భార్యను బురిడీ కొట్టించాడు. సేనాపతిని భుజబలంతో ఓడించాడు. చివరకు రాజే స్వయంగా రంగంలోకి దిగాడు. చిన్నవాడు తెలివిగా తమిద్దరి మధ్యా వున్న పోలికలను ఆసరా చేసుకుని, రాజుని బంధించి కొరడా దెబ్బల రుచి చూపిస్తాడు. తల్లి శపథం నెరవేరింది. అప్పుడు బయటపడి రాజుకి జరిగిన సంగతి చెప్పింది. రాజు ఆశ్చర్యపడి, తర్వాత ఆనందపడి, ఆ పై పశ్చాత్తాప పడ్డాడు. భార్యను, కొడుకుని ఆదరించాడు. సేనాపతి కుమార్తెతో చిన్నవాడి పెళ్లి అవుతుంది. 1965లో సినిమా రిలీజైంది. బ్రహ్మాండమైన హిట్‌ అయి అయిదు కేంద్రాల్లో శతదినోత్సవాలు చేసుకుంది. డివియస్‌ ప్రొడక్షన్స్‌ నిలబడి 'పిడుగు రాముడు' వంటి అనేక విజయవంతమైన సినిమాలు తీయగలిగింది.(సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఆగస్టు 2015)

[email protected]

Click Here For Archives