ఆ క్రికెటర్ తొలిసారి డబ్బులో తడుస్తున్నాడు!

హషీం ఆమ్లా… తన మత విశ్వాసాలకు కట్టుబడి ఉండి, ఇంత వరకూ చాలా అవకాశాలను వదులుకొన్నాడు. ఈ సౌతాఫ్రికన్ స్టార్ ప్లేయర్ ఇస్లామ్ మత విశ్వాసాలను తూచా తప్పకుండా కట్టుబడ్డాడు. పెద్దగా పెంచిన గడ్డమే…

హషీం ఆమ్లా… తన మత విశ్వాసాలకు కట్టుబడి ఉండి, ఇంత వరకూ చాలా అవకాశాలను వదులుకొన్నాడు. ఈ సౌతాఫ్రికన్ స్టార్ ప్లేయర్ ఇస్లామ్ మత విశ్వాసాలను తూచా తప్పకుండా కట్టుబడ్డాడు. పెద్దగా పెంచిన గడ్డమే అందుకు ప్రథమమైన రుజువు.

అంతే కాదు.. ఆమ్లా ప్రత్యేకతలెన్నో ఉన్నాయి. ఇతడు మద్యం కంపెనీలకు ఎంబాసిడర్ గా చేయడం లేదు. ఈ విషయంలో వచ్చిన ఆఫర్లను కూడా తిరస్కరిస్తాడట. మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించి డబ్బు సంపాదించుకోవడం తన మత విశ్వాసాలకు విరుద్ధమని ఆమ్లా అంటాడు.

ఈ క్రికెటర్ కు సంబంధించి మరో విశేషం ఏమిటంటే… ఇంత వరకూ ఇతడు ఐపీఎల్ వైపు కన్ను వేయలేదు. ఐపీఎల్ లో చాలా జట్లకు మద్యం కంపెనీలు స్పాన్సర్స్ గా వ్యవహరిస్తున్నాయి. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ యజమానే లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా. అంతే కాదు.. దాదాపు అన్ని ఐపీఎల్ టీమ్ ల జట్ల  జెర్సీలపైనా.. ఏదో ఒక మద్యం కంపెనీ పేరు కనిపిస్తుంటుంది. సదరు సంస్థ ఆ జట్లకు స్పాన్సర్ గా వ్యవహరిస్తూ ఉంటుంది. 

ఇలాంటి నేపథ్యంలో ఆయా ఆటగాళ్లు అంతా ఆ మద్యం కంపెనీకి ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్నట్టే. మరి ఇలాంటి భయంతోనో ఏమో కానీ హషీం ఆమ్లా ఐపీఎల్ కు దూరంగానే ఉంటున్నాడు. ఈయనేం  అంత డ్యాషింగ్ క్రికెటర్ కాకపోయినా.. దక్షిణాఫ్రికా టీ20 టీమ్ లో కూడా సభ్యుడిగా ఉంటున్నాడు. తన సత్తా చాటుతున్నాడు. అయితే ఈ సారి వేలంలో మాత్రం ఆమ్లా పేరు జాబితాలో కనిపించింది.

అయితే వేలంలో ఆమ్లాను ఎవ్వరూ కొనుక్కోలేదు! కానీ.. ఇతడితో ఒక జట్టు ఒప్పందం కుదుర్చుకొనే అవకాశాలున్నాయని తెలుస్తోంది. వేలంలో కాకుండా… ఐపీఎల్ చట్టాలకు లోబడి  అతడితో ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ఒక ప్రాంచైజ్ వాళ్లు ప్రయత్నాల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ డీల్ కుదిరాకా అధికారికంగా వివరాలు బయటకు వస్తాయని తెలుస్తోంది. మొత్తానికి ఇన్ని రోజులూ మత విశ్వాసాలకు కట్టుబడి కాసుల వర్షానికి దూరంగా ఉన్న ఆమ్లా పేరు ఇప్పుడు వేలం వరకూ వచ్చింది అది కూడా విశేషమే కదా!