చంద్రికా కుమారతుంగ తండ్రి సోల్మన్ బండారనాయకేయే 1951లో శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ (ఎస్‌ఎల్‌ఎఫ్‌పి) ని స్థాపించినది! స్వాతంత్య్రానంతరం ప్రధాన భూమిక వహించిన రెండు పార్టీలలో యిది ఒకటి. దీని సిద్ధాంతాలు సోషలిజానికి దగ్గరగా వుండగా దీని ప్రత్యర్థి యునైటెడ్ నేషనల్ పార్టీ (యుఎన్‌పి) సెంటర్-రైటిస్టు పాలసీని అవలంబించేది. సోల్మన్ 1956లో దేశానికి ప్రధానిగా ఎన్నికై మూడేళ్ల తర్వాత హత్యకు గురయ్యాడు. అప్పుడు చంద్రిక తల్లి సిరిమావో పార్టీ పగ్గాలు చేతబట్టి 1960లో ప్రధానమంత్రి అయింది. వామపక్ష, ప్రజా సంక్షేమ విధానాలతో ప్రజలను ఆకట్టుకుంది. తర్వాత అధికార దుర్వినియోగానికి పాల్పడి చెడ్డపేరూ తెచ్చుకుంది. 1977లో పదవీభ్రష్టురాలై జయవర్ధనే చేతిలో ఓడిపోయింది. చంద్రిక పారిస్‌లో చదువుకుంది. 1974లో శ్రీలంకకు తిరిగి వచ్చి పార్టీలో చేరి మహిళా విభాగంలో చురుగ్గా పనిచేసింది. ఒక సినిమా యాక్టరును పెళ్లాడి, తల్లి పార్టీని విడిచి అతని పార్టీలో చేరింది. అయితే అతను కూడా హత్యకు గురి కావడంతో ఇంగ్లండ్ వెళ్లి అక్కడే చాలాకాలం వుంది. 1991లో తిరిగి వచ్చి పార్టీకి పునర్వైభవం కలిగేట్లా చేసింది.
ఆమె తల్లి చాలా కుటిలత్వం ప్రదర్శించింది. కొడుకు అనూరకు, కూతురు చంద్రికకు మధ్య పోటీ పెట్టి పార్టీని తన అదుపులో వుంచుకోవాలని చూసింది. ముగ్గురిలో చంద్రిక తెలివితేటలు ప్రదర్శించి పీపుల్స్ ఎలయన్స్ పేర ఒక కూటమిని కూర్చి యుఎన్‌పి 16 ఏళ్ల పాలనను అంతం చేసి 1994లో అధ్యక్షురాలిగా ఎన్నికైంది. తల్లిని వూరికే వదిలేస్తే ప్రమాదమని 1994లో ప్రధానమంత్రిని చేసింది. ఆమె ఆరేళ్లు ఆ పదవిలోనే వుంది. చంద్రిక తమిళటైగర్లతో సంధియత్నాలు చేసింది, అవి విఫలం కావడంతో వారిపై మిలటరీని ప్రయోగించింది. టైగర్లు 1999 ఎన్నికల సమయంలో చేసిన ఒక దాడిలో ఆమె ఒక కన్ను పోయింది. ఆ ఎన్నికలలో సింపతీ ఓటుతో ఆమె యుఎన్‌పి తరఫు అభ్యర్థి రానిల్ విక్రమసింఘేను ఓడించి మళ్లీ అధ్యక్షురాలైంది. 2001 డిసెంబరులో ఆమె ప్రత్యర్థి రానిల్ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యాడు. అతను టైగర్లతో శాంతి చర్చలు మొదలుపెట్టాడు. ఆ మెతకవైఖరి చంద్రికకు నచ్చలేదు. అతను 2003 నవంబరులో అమెరికా వెళ్లినపుడు పార్లమెంటును ప్రొరోగ్ చేసి అతని అధికారాలు లాక్కుంది. వామపక్ష పార్టీ అయిన జనతా విముక్తి పెరమున, యింకా యితర పార్టీలతో కలిసి యునైటెడ్ పీపుల్స్ ఫ్రీడమ్ ఎలయన్స్ (యుపిఎఫ్‌ఏ) అనే మరింత పెద్ద కూటమిని కూర్చి, దాని ద్వారా రాజపక్షను ప్రధానమంత్రిని చేసింది.
అయితే 2005 కల్లా పెరమున విడిపోయింది. అప్పటితో చంద్రిక అధ్యక్షపదవి కూడా సమాప్తమైంది. ఆవిడ యింకా కొనసాగాలని చూసింది కానీ రాజపక్ష అడ్డుపడ్డాడు. కూటమిలోని 25 పార్టీలు – ఎస్‌ఎల్‌ఎఫ్‌పితో సహా – అతనికి అండగా నిలిచాయి. చంద్రిక సొంత పార్టీలోనే బలహీనపడింది. అధికారంలో వుండగా చంద్రిక తన తల్లి పద్ధతులకు వ్యతిరేకంగా గ్లోబలైజేషన్‌వైపే మొగ్గింది. ఉదార ఆర్థికవిధానాలు అవలంబించి ధనిక, పేద వ్యత్యాసానికి దోహదపడింది. అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి. చంద్రిక స్థానంలో ఆమె సోదరుడు అనూరకు బదులుగా పార్టీ నేతలు రాజపక్షను అధ్యక్ష అభ్యర్థిగా నిలబెట్టారు. అనూర కోపంతో యుఎన్‌పిలో చేరాడు. రాజపక్ష ఎన్నికల్లో నెగ్గి తమిళ టైగర్లను మట్టుపెట్టి తన బలాన్ని పెంచుకున్నాడు. తన నేతృత్వంలోని యుపిఎఫ్‌ఏ కూటమిలో 14 పార్టీలుండడంతో పోనుపోను చంద్రికను లక్ష్యపెట్టడం మానేశాడు.
పరాజయభారంతో కుములుతున్న చంద్రిక రాజపక్షపై కక్ష తీర్చుకోవాలనుకుంది. ఇన్నాళ్లకు అవకాశం రావడంతో ఎవరికీ తెలియకుండా వ్యూహరచన చేసింది. రాజపక్ష మంత్రివర్గంలో అసంతృప్తి రగులుతున్నట్లు కనిపెట్టిందామె. కొత్తగా పార్టీలో చేరి, రాజపక్షకు సన్నిహితులుగా మారి అవినీతికి పాల్పడుతున్నవారిపై చాలాకాలంగా వున్న అతని సహచరులకు అసూయగా వుంది. ఎదిరించి బయటకు వస్తే వేధింపులకు గురవుతామోనని భయపడుతున్నారు. రాజపక్ష సోదరులు యిప్పుడున్నదానితో సంతృప్తి పడకుండా యింకా పెద్దపెద్ద ప్లాన్లు వేస్తున్నారని వారికి తెలుసు, అతని కొడుకు వచ్చేసారి అధ్యక్ష అభ్యర్థి అని తెలుసు. ఇక వారి వంశం శ్రీలంకను ఎల్లకాలం పాలించడానికి సిద్ధపడుతోందని, ఇంకో 8 ఏళ్ల పాటు సాగబోయే పాలనలో తాము మరింతగా నామమాత్రు లవుతామనీ భయపడ్డారు. రాజపక్షకు అడ్డుకట్ట వేసి తీరాల్సిందే, కానీ ఎలా? తమకు బలం చాలదే అని మథన పడుతున్నట్లు చంద్రికకు తెలిసింది.
రాజపక్ష వేలితో అతని కన్నునే పొడవాలనే ప్రణాళికతో అతని పార్టీలోనే అతనికి కుడిభుజంగా, అతని కాబినెట్‌లో ఆరోగ్యమంత్రిగా వున్న మైత్రీపాలను దువ్వింది. అతనికి మద్దతు పలకమని తనకు బద్ధశత్రువుగా వున్న యుఎన్‌పి నాయకుడు రానిల్‌ను కూడా అర్థించింది. ఈ కసరత్తు కొన్ని వారాలపాటు జరిగింది. ఆమె యింట్లోనే ప్రతిపక్ష నాయకులు సమావేశమయ్యేవారు. సమావేశాల గురించి సమాచారం అందించుకోవడానికి మామూలు ఫోన్లు వుపయోగిస్తే ప్రభుత్వ యింటెలిజెన్సు వర్గాలు పసిగడతాయనే భయంతో వారికి చిక్కకుండా వుండేందుకు ఎన్‌క్రిప్టెడ్ శాటిలైట్ ఫోన్లను ఉపయోగించారు. గత ఎన్నికలలో రాజపక్ష చేతిలో ఓడిపోయిన మాజీ ఆర్మీ చీఫ్ శరత్ ఫోనెస్కా వీరికి యిలాటి విషయాల్లో సాయపడ్డాడు. అనేక మంది డమ్మీ కాండిడేట్లను అభ్యర్థులుగా నిలిపి రాజపక్షను కన్‌ఫ్యూజ్ చేసి, అతనికి ఎన్నికలంటే నల్లేరుపై బండి నడక అనే అభిప్రాయం కల్పించారు.
ప్రతిపక్షాల తరఫున ఎవరు సరైన అభ్యర్థి అని గాలిస్తే అనేక పేర్లు చర్చకు వచ్చాయి – చంద్రిక, యుఎన్‌పి సభ్యులు రానిల్ విక్రమసింఘే, కారూ జయసూర్య, నేషనల్ మూవ్‌మెంట్ ఫర్ సోషల్ జస్టిస్ లీడరు జస్టిస్ మధులోలువె సొబితా, చీఫ్ జస్టిస్ శిరాణీ బండార్ నాయకే.. యిలా. చివరకు మైత్రీపాల సరైన అభ్యర్థి అని అందరూ అభిప్రాయపడ్డారు. మైత్రీపాల ఎస్‌ఎల్‌ఎఫ్‌పికి జనరల్ సెక్రటరీ, ఆరోగ్యమంత్రి. తమిళ టైగర్లతో పోరాడిన ఖ్యాతి రాజపక్షకు వున్నట్లే మైత్రీపాలకు కూడా వుంది. అతనిపై 2008లో టైగర్లు దాడి చేస్తే అదృష్టవశాత్తూ తప్పించుకున్నాడు. యుద్ధం అంత్యథలో అంటే 2009లో అతను తాత్కాలికంగా డిఫెన్సు మినిస్టర్‌గా పనిచేశాడు. రాజపక్ష లాగా అతనూ సింహళ బౌద్ధుడు. గ్రామీణ ప్రాంతీయుడు. మధ్యతరగతి రైతు కుటుంబంలో 12 మంది పిల్లల్లో ఒకడిగా పెరిగాడు. స్థానికంగా చదువుకునే రోజుల్లో చైనాకు అనుకూలంగా వుండే కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ సిలోన్‌లో సభ్యుడిగా వున్నాడు. కానీ తర్వాత ఎస్‌ఎల్‌ఎఫ్‌పి యూత్ వింగ్‌లో చేరాడు. 1971 నాటికి యూత్‌వింగ్ మాతృసంస్థపై తిరగబడినపుడు యితను కూడా తిరుగుబాటుదారుల్లో ఒకడు. 15 నెలలపాటు జైలు జీవితం అనుభవించాడు. 1989లో ప్రతిపక్ష సభ్యుడిగా పార్లమెంటులో అడుగుపెట్టాడు. 1994లో అతని పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక, అతన్ని యిరిగేషన్ శాఖలో డిప్యూటీ మినిస్టర్‌గా వేశారు. తర్వాతి రోజుల్లో వ్యవసాయమంత్రిగా, ఆరోగ్యమంత్రిగా కూడా చేశాడు. రాజపక్షలో రాజరికపు పోకడలున్నాయి. వాణిజ్యవర్గాలతో స్నేహం వుంది. అత్యాశ వుంది. మైత్రీపాల పదవుల కోసం పాకులాడ లేదు. పైగా మృదుస్వభావి. మంత్రి అయినా గ్రామీణ పోకడలు విడిచిపెట్టలేదు. ఈ విధంగా రాజపక్ష లాటి నేపథ్యమే కలిగి వుండి, యుఎన్‌పి ఆమోదయోగ్యుడయ్యే అరుదైన వ్యక్తి యితనే అని తేల్చారు. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2015)