cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : శ్రీలంక అధ్యక్షుడి భారత పర్యటన - 2

ఎమ్బీయస్‌ : శ్రీలంక అధ్యక్షుడి భారత పర్యటన - 2

సామాన్యప్రజలు ఏమనుకున్నా పట్టించుకోనక్కరలేదని, ఎందుకంటే రాజకీయంగా తనతో తలపడగల మొనగాడే లేడని తలపోసిన రాజపక్ష యీ వూపులోనే మూడోసారి కూడా అధ్యక్షుడిగా ఎన్నికయిపోతే ఎప్పటికీ ఎదురు వుండదనుకుని, ముందస్తు ఎన్నికలు ప్రకటించాడు. 2013 జనవరిలో తనకు వ్యతిరేకంగా తీర్పు యిచ్చిన చీఫ్‌ జస్టిస్‌ శిరాణీ బండారునాయకేను రాజపక్ష పదవి నుంచి తొలగించాడు. దాంతో మధులోలువె సొబితా అనే బౌద్ధసన్యాసి నేతృత్వంలో ప్రజాహక్కుల ఉద్యమం మొదలైంది. ఆయన అందరి పట్ల నిష్పక్షపాతంగా వుంటాడన్న పేరు వుంది కాబట్టి ఏడాది తిరిగేసరికి సమాజంలోని అనేక వర్గాలు దానిలో చేరి ఆందోళన చేయసాగాయి. అది బలపడుతూండడం కూడా రాజపక్ష ముందస్తు ఎన్నికలు ప్రకటించడానికి ఒక కారణం అంటారు. 

1987 నాటి భారత-శ్రీలంక ఒప్పందం ప్రకారం ప్రాంతీయ కౌన్సిళ్లకు పోలీసు, భూమిపై అధికారాలు కట్టబెట్టాలి. రాజ్యాంగంలో ఆ విషయమై 13 వ సవరణ చేసినప్పటికి దాన్ని అమలు చేయడంలో విపరీతమైన జాప్యం జరిగింది. తమిళ ప్రాంతాలలో టైగర్ల ప్రాబల్యం వుండగా దాన్ని ఆలస్యం చేయడం సహజమేననుకుని భారత్‌ వేచి వుంది. 2009 తర్వాత పరిస్థితులు చక్కబడ్డాయని శ్రీలంక ప్రభుత్వమే చెపుతున్నపుడు మరి ఆ సవరణ చేయడానికి యింకేమిటి ఆలస్యం? అని ఇండియా ఫీలైంది. తమిళ ప్రాంతాల్లో ఎన్నికలు జరిపినా అక్కడి కౌన్సిళ్లకు అధికారాలు యివ్వకపోవడంతో అవి మునిసిపాలిటీల్లాగే వున్నాయి. యుద్ధం ముగిసిపోయినా అక్కణ్నుంచి మిలటరీని ఉపసంహరించలేదు. యుద్ధసమయంలో ఆక్రమించిన యిళ్లు, పొలాలు మిలటరీ అధీనంలోనే వుండిపోయాయి. పైగా మరి కొన్ని స్థలాలు తీసుకుని కొత్తగా మిలటరీ స్థావరాలు కట్టారు. యుద్ధనేరాలపై విచారణ జరిపిస్తానంటూనే జరిపించకపోవడంతో యునైటెడ్‌ నేషన్స్‌లో హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌ 2012, 2013లో రాజపక్ష ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్మానం చేసినపుడు అమెరికాతో బాటు ఇండియా కూడా దాన్ని సమర్థించింది. అయితే చైనా వీటో చక్రం వేసి రాజపక్షను కాపాడింది. 

అప్పుడు యిండియాలో యుపిఏ ప్రభుత్వం వుంది. డిఎంకె ఒత్తిళ్లకు లొంగి, తన పట్ల అన్యాయంగా ప్రవర్తించిందని, ఎన్‌డిఏ అధికారంలోకి వచ్చిన తర్వాత సంస్కరణలపై పట్టుబట్టదని రాజపక్ష ఆశ పెట్టుకున్నాడు. అయితే రాజపక్షతో జరిగిన తన తొలి సమావేశంలోనే మోదీ 13 వ సవరణ అమలు గురించి ఏమైందని అడగడంతో దిగ్భ్రాంతి చెందాడు. దానికి ఫాలోఅప్‌ అన్నట్లు ఉత్తర ప్రాంతంలో కౌన్సిల్‌ను పాలిస్తున్న తమిళ నేషనల్‌ ఎలయన్స్‌ (టిఎన్‌ఏ) పార్టీ నాయకులు 2014 ఆగస్టులో రాజపక్షను కలిసి అమలు చేయమని కోరారు. రాజపక్షకు కోపం వచ్చింది. నెల తిరక్కుండా చైనీస్‌ సబ్‌మెరైన్లను కొలంబో హార్బర్‌లో డాక్‌ చేయడానికి తొలిసారి అనుమతించాడు. ఆ మరుసటి నెలలో అంటే అక్టోబరులో చైనా అధ్యక్షుడు ఇండియా, శ్రీలంక పర్యటనకు వచ్చినపుడు రెండోసారీ అనుమతించాడు. ఈ వరస చూసి రాజపక్షకు బుద్ధి గరపడానికి శ్రీలంక ఎన్నికలలో ఇండియా ప్రతిపక్షాలకు పరోక్షంగా సహాయం అందించిందని వినికిడి. 

రాజపక్ష  ప్రజలను వర్గాలుగా విడదీసి, కొందర్ని మచ్చిక చేసుకున్నాడు. తను లేకపోతే శ్రీలంక విచ్ఛిన్నమై పోయేదనే భావనను సింహళీయుల్లో కలిగించడానికి మీడియాను వాడాడు. తన గురించి గొప్పగా రాయడానికి, ప్రతిపక్షాలను చీల్చి చెండాడడానికి  ప్రభుత్వం చేతిలో వున్న మీడియాను వుపయోగించుకున్నాడు.   హోటళ్లు, బ్యాంకింగ్‌, పరిశ్రమలు వంటి అనేక రంగాల్లో తన స్నేహితులకు బాగా అవకాశాలు కల్పించి వారి ద్వారా మీడియాను లోబరుచుకోవడానికి, లొంగని చోట బెదిరించడానికి వుపయోగించుకున్నాడు. అనేక ప్రయివేటు మీడియా సంస్థలు ప్రభుత్వ లైసెన్సులకోసం, యాడ్‌లపై ఆదాయం కోసం అమ్ముడుపోయాయి. కొందరు పాత్రికేయులు స్వతంత్రంగా వ్యవహరించబోయారు. వారి ఫోన్లు ట్యాప్‌ చేయించాడు. ఇలాటి వేధింపులు తట్టుకోలేక కొందరు జర్నలిస్టులు విదేశాలకు పారిపోయారు. 

రాజపక్ష చేస్తున్న యీ పనులు పట్టణప్రాంతాల వారు, విద్యావంతులు ఏవగించుకున్నారు. అయినా సింహళ ప్రజలు తన పక్షానే వున్నారని రాజపక్ష గర్వం. ప్రతిపక్ష పార్టీ అయిన యునైటెడ్‌ నేషనల్‌ పార్టీ (యుఎన్‌పి)కి అధ్యక్షుడైన రానిల్‌ విక్రమ్‌సింఘే సింహళ ఓట్లను తననుంచి గుంజుకోలేడని అతనికి తెలుసు. ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని నిలిపి తనను ఓడించే అవకాశం లేదని తెలిసి, యిదే అదనని ముందస్తు ఎన్నికలు ప్రకటించాడు. దానికి నెల ముందు ఓటర్లను ఆకట్టుకోవడానికి అక్టోబరులో ప్రకటించిన బజెట్‌లో సబ్సిడీలు పెంచుతానని, వాటర్‌ సప్లయి ప్రాజెక్టులు, పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టులలో ఎక్కువ పెట్టుబడులు పెడతానని, పన్నులు తగ్గిస్తానని, విద్యుత్‌ చార్జీలు తగ్గిస్తానని హామీలు గుప్పించాడు. పబ్లిక్‌ సెక్టార్‌ ఉద్యోగుల జీతాలు పెంచాడు. ప్రయివేటు సెక్టార్‌ ఉద్యోగులకు యిచ్చే రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ మెరుగుపరిచాడు. పోలీసు అధికారులకు, ఉద్యోగులకు మోటారు సైకిళ్లు, స్కూటర్లు నామమాత్రపు ధరలకు అందించాడు. వరికి, పాల ఉత్పాదనలకు, రబ్బరుకు మద్దతు ధర పెంచాడు. హైస్కూలు విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు, సీనియర్‌ సిటిజన్లకు, వికలాంగులకు, కిడ్నీ రోగులకు, మిలటరీ కుటుంబాలకు అలవెన్సులు పెంచాడు. నీరు, విద్యుత్‌ చార్జీలు, ఆదాయపు పన్ను రేట్లు తగ్గించాడు.

ఇన్ని చిట్కాలు ప్రయోగించినా చివరకు ఓటమి తప్పలేదు. దానికి కారణం - గడ్డిపోచల్లా విడివిడిగా పడి వున్న ప్రతిపక్షాలు వెంటిగా ఏర్పడి రాజపక్ష అనే మత్తగజాన్ని బంధించడమే! వారిని అలా సంఘటితం చేసిన వ్యక్తి రాజపక్ష పార్టీకే చెందిన చంద్రికా కుమారతుంగ! (సశేషం) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2015)

​mbsprasad@gmail.com

Click Here For Part-1