వరల్డ్‌ కప్‌.. వణుకు మొదలైంది.!

వరల్డ్‌ కప్‌లో సంచలనాలకు తెరలేపింది ఐర్లాండ్‌. వెస్టిండీస్‌పై ఘనవిజయం సాధించిన ఐర్లాండ్‌, ‘పూల్‌-బి’లో కలకలం సృష్టించింది. ‘పూల్‌-ఎ’ సంగతేంటి.? ఇక్కడా షాక్‌లు తప్పేలా కన్పించడంలేదు. కాస్తలో తప్పిపోయిందిగానీ, లేదంటే న్యూజిలాండ్‌కి స్కాట్‌లాండ్‌ షాక్‌ ఇచ్చేదే.…

వరల్డ్‌ కప్‌లో సంచలనాలకు తెరలేపింది ఐర్లాండ్‌. వెస్టిండీస్‌పై ఘనవిజయం సాధించిన ఐర్లాండ్‌, ‘పూల్‌-బి’లో కలకలం సృష్టించింది. ‘పూల్‌-ఎ’ సంగతేంటి.? ఇక్కడా షాక్‌లు తప్పేలా కన్పించడంలేదు. కాస్తలో తప్పిపోయిందిగానీ, లేదంటే న్యూజిలాండ్‌కి స్కాట్‌లాండ్‌ షాక్‌ ఇచ్చేదే. పెద్ద జట్లు అయినా ఒక్కోసారి చిన్న చిన్న పొరపాట్లు చేయడం సహజం. అలాగే చిన్న జట్లు అయినా, కసితీరా పోరాడటమూ గతంలో చూశాం.

క్రికెట్‌ అంటేనే అంచనాలకు అందనిది. టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగి లీగ్‌ దశ కూడా దాటలేకపోతుంటాయి పెద్ద పెద్ద జట్లు. శ్రీలంక వరల్డ్‌ కప్‌ని సాధించేటప్పుడు ఎవరూ అనుకోలేదు. కపిల్‌ డెవిల్స్‌ వరల్డ్‌ కప్‌ అందుకున్నప్పుడూ అంతే. ధోనీ సేన వరల్డ్‌ కప్‌ 2011లో అందుకుంటుందని ఎంతమందికి నమ్మకం వుండేది.? అదీ క్రికెట్‌ అంటే.

చిన్న జట్లు టైటిల్‌ గెలవకపోయినా, టైటిల్‌ ఫేవరెట్లను ఇంటికి పంపగలవు. గతంలో పెద్ద జట్లు ఇలానే పసికూనల చేతిలో షాక్‌ తిన్నాయి. ఈసారీ అలాంటి అద్భుతాలైతే జరుగుతాయని ఐర్లాండ్‌ నిరూపించింది, స్కాట్‌లాండ్‌ ఆ అద్భుత మ్యాజిక్‌ని తృటిలో మిస్‌ అయ్యింది. ఈసారి టైటిల్‌ ఫేవరెట్‌ ఎవరు? అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌.. అని చాలామంది అనుకున్నారు.

143 పరుగుల లక్ష్యాన్ని ఏడు వికెట్లు కోల్పోయి న్యూజిలాండ్‌ ఛేదించగలిగిందంటే.. న్యూజిలాండ్‌ ఆటగాళ్ళు, స్కాట్‌లాండ్‌ బౌలర్లకు ఎంతగా ఇబ్బంది పడాల్సి వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. భారీ లక్ష్యమైనా వెరవకుండా ఐర్లాండ్‌, వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో తెగువ చూపింది. పూల్‌-ఎ, పూల్‌-బి.. ఈ రెండిట్లోనూ పసి కూనలున్నాయి పంజా విసరడానికి. పసి కూనల పంజా దెబ్బ నుంచి తప్పించుకోడానికి పెద్ద జట్లూ అప్రమత్తంగా వుండాల్సిందే.