ఏబీఎన్ డిబేట్లో అవాంఛనీయ ఘటన చోటు చేసుకుంది. ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డిపై అమరావతి జేఏసీ నేత , దళిత నాయకుడు శ్రీనివాసరావు చెప్పుతో దాడి చేశాడు. ఈ ఘటన ప్రేక్షకులను నివ్వెరపరిచింది. అసలు సమస్య ఏంటంటే…
అమరావతిలో అసంపూర్తి భవనాలను నిర్మించేందుకు జగన్ సర్కార్ ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో 50 శాతం, అంతకు మించి పూర్తై ఆగిపోయిన నిర్మాణాలను రూ.3 వేల కోట్లతో పూర్తి చేయాలని జగన్ సర్కార్ ఈ రోజు నిర్వహించిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి మెట్రో రీజయన్ డెవలప్మెంట్ అథారిటీకి ఈ పనులు అప్పగిస్తూ ఏపీ కేబినెట్ తాజాగా నిర్ణయం తీసుకుంది.
ఈ నేపథ్యంలో గ్రాఫిక్స్ పూర్తి చేద్దాం శీర్షికతో చర్చా కార్యక్రమం చేపట్టారు. రాజధాని అమరావతిలో గత టీడీపీ ప్రభుత్వం చెబుతున్నట్టు నిర్మాణాలేవీ లేవని, అంతా గ్రాఫిక్స్‌లో చూపారని అధికార వైసీపీ విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని వ్యంగ్య ధోరణిలో ఏబీఎన్ డిబేట్ చేపట్టడం గమనార్హం.
ఈ చర్చా కార్యక్రమంలో అమరావతి జేఏసీ నాయకుడు శ్రీనివాసరావు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి జీవీరెడ్డి, జనసేన నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ, బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్‌రెడ్డితో పాటు మరొకరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విష్ణువర్ధన్‌రెడ్డి, శ్రీనివాసరావు మధ్య మాటామాటా పెరిగింది.
నాన్ సెన్స్ మాట్లాడ్డం మానేయాలని విష్ణును ఉద్దేశించి చేయి చూపుతూ శ్రీనివాసరావు హెచ్చరించాడు. నువ్వు హద్దులు దాటుతున్నావని శ్రీనివాసరావును ఉద్దేశించి విష్ణు అన్నాడు. నువ్వు తెలుగుదేశం జెండా కప్పుకుని మాట్లాడు అని శ్రీనివాసరావును ఉద్దేశించి విష్ణు అన్నాడు.
ఈ మాట ఒకటికి రెండుమూడు సార్లు అన్నాడు. అలాగే తెలుగుదేశానికి భజన చేసుకోవాలని విష్ణు సూచించాడు. నువ్వు తెలుగుదేశం ఆఫీస్‌కు వెళ్లి పని చేసుకోవాలని సీరియస్‌గా అన్నాడు. ఎవరు నువ్వు నన్ను అడగడానికి గట్టిగా విష్ణు ప్రశ్నించాడు. నీ భజన మేము చేయాలా? అంటూ విష్ణువర్ధన్‌రెడ్డి ప్రశ్నించాడు.
పెయిడ్ ఆర్టిస్ట్ అని తనను అనడంతో శ్రీనివాసరావు మరింత ఆగ్రహానికి గురయ్యాడు. చెప్పుతో కొడతానని హెచ్చరిస్తూ …అన్నట్టుగానే చేతిలోకి చెప్పు తీసుకున్నాడు. అనంతరం విష్ణువర్ధన్‌రెడ్డిపై శ్రీనివాస్‌రావు చెప్పుతో దాడి చేయడం తీవ్ర సంచలనం రేకెత్తించింది. దీంతో ఈ చర్చను చూస్తున్న ప్రేక్షకులు షాక్‌కు గురయ్యారు.