తెలంగాణ ప్రజలు, పార్టీలు ఎదురు చూస్తున్న రోజు రానే వస్తోంది. అంతగా ఎదురుచూస్తున్న ముఖ్యమైన రోజు ఏమిటి? అదొక పర్వదినమా? పండుగా? ఎస్…దాదాపు అలాంటిదే. అదే తెలంగాణ రాష్ర్ట తొలి బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు. తెలంగాణ తొలి అసెంబ్లీ సమావేశాలు నవంబరు అయిదో తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. తొలి రోజే బడ్జెట్ ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఏనాడో ప్రవేశపెట్టాల్సిన బడ్జెటును ఇప్పటికైనా ప్రవేశపెడుతున్నందుకు కేసీఆర్‌ను మెచ్చుకోవాలి. మనం మెచ్చుకున్నా, మెచ్చుకోకపోయినా రాజ్యాంగం ప్రకారం తప్పనిసరిగా ప్రవేశపెట్టాలి. ఇన్నాళ్లూ బడ్జెటు ఎందుకు ప్రవేశపెట్టలేదంటే…ఆయన భయపడ్డారనేది ఎక్కువమంది అభిప్రాయం. ఇందులో భయపడటానికేముంది? అని మనం అడగొచ్చు. కాని..కేసీఆర్‌కు ఉండే ఇబ్బందులు ఆయనకు ఉన్నాయి. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానని అదే పనిగా ఊదరగొడుతున్న గులాబీ దళాధిపతి బోలెడు హామీలు ఇచ్చారు కదా…! ఎన్నికలకు ముందు, తరువాత రోజూ ఇచ్చినవి కాకుండా, మంత్రివర్గ సమావేశంలోనే 42 నిర్ణయాలు తీసుకున్నారు. ఇవన్నీ బడ్జెటులో ప్రతిఫలించాలి. వీటికి కేటాయింపులు చేయాలి. అన్ని వర్గాలను సంతృప్తి పరచాలి. ఇదంత సులభమైన పని కాదు కదా…! అందుకే కసరత్తు చేసీ చేసీ ఇప్పుడు ధైర్యం చేశారు. ఈ బడ్జెటు ఎలా ఉండబోతోందనేది ఇప్పుడు ఆసక్తికరమైన అంశం. అయితే ఈ బడ్జెటు ఏడాది బడ్జెట్టా? కాదు. కేవలం నాలుగు నెలలకు సంబంధించిదే. అంటే డిసెంబరు నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు మాత్రమే.
ఆర్థిక మంత్రిని పక్కకు పెట్టి…
ఇది స్వల్ప కాలిక బడ్జెటు అయినప్పటికీ ప్రజలు దీనిపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. కేసీఆర్ కూడా మొదటినుంచీ బడ్జెట్‌పై హైప్ పెంచారు. ఉమ్మడి రాష్ర్టంలో తెలంగాణకు అన్ని రంగాల్లో అన్యాయం జరిగిందని, ఆ అన్యాయలను సరిచేసేవిధంగా అంచనాలు, కేటాయింపులు ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుత అధికారులంతా ఉమ్మడి రాష్ర్టంలో పనిచేసిన వారే కాబట్టి వారి మైండ్‌సెట్ అప్పుడు అనుసరించిన విధానాలేక ఫిక్స్ అయిపోయివుంటుందని, కాబట్టి తెలంగాణ అవసరాలను దృష్టిలో పెట్టుకొని బంగారు తెలంగాణ దిశగా ఆలోచించి అంచనాలు, కేటాయింపులు తయారుచేయాలని అన్నారు. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తయారుచేసిన అంచనాలు, కేటాయింపులన్నీ రద్దు చేసి పారేశారు. ఆయన్ని డమ్మీని చేసి పక్కకు కూర్చోబెట్టి తానే పగ్గాలు తీసుకున్నారు. పద్నాలుగు టాస్క్ఫోర్సులను ఏర్పాటు చేశారు. మళ్లీ కసరత్తు చేయమన్నారు. అధికారులను నానా హైరానా పెట్టారు. సెప్టెంబరు 30 తరువాత ప్రభుత్వ ఖర్చులకుగాను గవర్నర్ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్నారు. బడ్జెటు సమావేశాలపై అనేక తేదీలు ప్రకటించి చివరకు నవంబరు 5 నిర్ణయించారు. బడ్జెటు సమావేశాలు ఆలస్యమవుతున్న కొద్దీ కేసీఆర్‌పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఇచ్చిన వాగ్దానాలకు కేటాయింపులు చేయలేకనే బడ్జెటు సమావేశాలను వాయిదా వేస్తూ పోతున్నారని అన్నాయి. ఎవరేమన్నా కేసీఆర్ పట్టించుకోలేదు.
కలల బడ్జెట్టా? కల్లల బడ్జెట్టా?
ఏ ప్రభుత్వ బడ్జెటునైనా ప్రతిపక్షాలు చీల్చిచెండాడుతుంటాయి. అందులోనూ ఇది స్వల్ప కాలిక బడ్జెటు కాబట్టి ఇందులో పెద్దగా కేటాయింపులు ఉండవనేది ప్రతిపక్షాల అభిప్రాయం. కేసీఆర్ చేసిన వాగ్దానాలన్నీ ఇందులో ప్రతిఫలించే అవకాశాలు లేవని తెలుస్తోంది. ముఖ్యంగా కేసీఆర్ తన కలల ప్రాజెక్టుగా ప్రచారం చేసుకుంటున్న తెలంగాణ వాటర్‌గ్రిడ్ పథకానికి ఎంత కేటాయిస్తారో చూడాలి. నీటిపారుదల ప్రాజెక్టులు, చెరువుల పునరుద్ధరణ, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంటు, కృష్ణా, గోదావరి జలాల వినియోగం..ఇలా చాలా అంశాల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. ముఖ్యంగా సంక్షేమ పథకాలను కేసీఆరే చూస్తున్నారు. కాని ఇవన్నీ గంరగోళంగా తయారయ్యాయి. రేషన్ కార్డులు రద్దు చేసి వాటి స్థానంలో ఆహార భద్రతా కార్డులు ప్రవేశపెట్టారు. అవి ఇంకా ఓ కొలిక్కి రాలేదు. సమగ్ర సర్వే ఓ ప్రహసనంగా తయారైంది. దానిపై స్పష్టత లేదు. దళితులకు మూడెకరాల భూ పంపిణీ అభాసు పాలైంది. రైతులకు రుణ మాఫీ అరకొరగా మిగిలిపోయింది. పేదలకు రెండు బెడ్రూములతో గృహనిర్మాణం ఎలా ఉంటుందో తెలియదు. కొత్తగా టీఆర్ఎస్లో చేరిన టీడీపీ నేత తలసాని శ్రీనివాస యాదవ్ నియోజకవర్గంలో ఇలాంటి ఇళ్ల నిర్మాణం ప్రారంభించామని, ఇది మోడల్ కాలనీగా ఉంటుందని అన్నారు. మరి దీనిపై బడ్జెటులో ఏం చెబుతారో చూడాలి. కేజీ టు పీజీపై స్పష్టత ఇవ్వాలి. గ్రీన్ హౌస్ ఫార్మింగ్, కళ్యాణలక్ష్మి పథకాలకు కూడా నిధులు కేటాయిస్తారని అనుకుంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్టే లక్ష కోట్ల రూపాయలతో భారీగా ఉంది. నాలుగు నెలల బడ్జెట్టే ఇంత భారీగా ఉంటే ఏడాది బడ్జెటు ఇంకెంత భారీగా ఉండాలి? ఈ బడ్జెటులో 60 వేల కోట్లు ప్రణాళికేతర (నాన్ ప్లాన్) వ్యయంగా, 40 వేల కోట్లు ప్రణాళికా (ప్లాన్) వ్యయంగా ఉంటుందని తెలుస్తోంది. ఏప్రిల్ నుంచి చేసిన ఖర్చులను కూడా కలుపుకుంటే ఇంత పెద్ద బడ్జెటు అయిందని తెలుస్తోంది.
విద్యుత్ సమస్యపై నిర్ణయాలు కీలకం
తెలంగాణను పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య విద్యుత్. దీనిపై రెండు తెలుగు రాష్ట్రాలు పొట్టుపొట్టుగా తగాదా పెట్టుకుంటున్నాయి. మూడేళ్లలో విద్యుత్ సమస్య పరిష్కరిస్తామని, మిగులు సాధిస్తామని, ఆంధ్రాకే కరెంటు ఇచ్చే స్థాయికి చేరుకుంటామని చెబుతున్న కేసీఆర్ బడ్జెటులో దానిపై ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తారనేది ఆసక్తికరం. బడ్జెటుకు ముందే ఛత్తీస్గఢ్తతో విద్యుత్ ఒప్పందాలు కుదుర్చుకుంటారని తెలుస్తోంది. స్వయంగా కేసీఆరే ఆ రాష్ట్రానికి వెళుతున్నారు. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో, మణుగూరులో భారీ విద్యుదుత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేయబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. వాటి గురించి బడ్జెటులో చెప్పాల్సి ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి కరెంటు కొనుగోళ్ల గురించి కూడా వివరించాల్సి ఉంది. కరెంటు సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారో బడ్జెటులో వివరిస్తారని అనుకుంటున్నారు.
నిరుద్యోగులకు నిరాశేనా?
సమస్త తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ర్టం కోసం పోరాడింది దేనికి? నిధులు, నీళ్లు, నియామకాలు. నియామకాలంటే ఉద్యోగాలు. తెలంగాణ రాగానే తమ బతుకులు బాగుపడిపోతాయని, వెంటనే ఉద్యోగాలు (సర్కారు కొలువులు) వస్తాయని నిరుద్యోగులు గంపెడాశతో ఉన్నారు. కాని తెలంగాణ తొలి బబ్జెటులో వారికి నిరాశే ఎదురవుతుందని తెలుస్తోంది. బడ్జెటులో కొత్త ఉద్యోగాల కోసం కేటాయింపులు ఉండవని సమాచారం. అంటే వచ్చే ఏడాది మార్చి వరకు ప్రభుత్వ నోటిఫికేషన్లు రావన్నమాట. కాంట్రాక్టు ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేస్తామని ప్రకటించడంతో ఉస్మానియా యూనివర్శిటీ చాలాకాలంగా రగిలిపోతోంది. విద్యార్థులు కేసీఆర్‌పై గుర్రుగా ఉన్నారు. అనేకసార్లు ఆందోళనలు జరిగాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు ఇప్పటివరకు ఓ కొలిక్కి రాలేదు. ఇప్పుడు ఈ బడ్జెట్లోనూ కొత్త ఉద్యోగాల విషయం ప్రస్తావించకపోతే నిరుద్యోగులు ఎలా స్పందిస్తారో చూడాలి. ప్రతి నియోజకవర్గ అభివృద్ధికి కోటిన్నర రూపాయలు కేటాయిస్తానని చెప్పిన కేసీఆర్ ఈ బడ్జెటులో ఆ పని చేయబోతున్నారట.
అసెంబ్లీలో దుమారమే…!
తెలంగాణ తొలి బడ్జెటు సమావేశాలు దాదాపు నెల రోజులు జరగబోతున్నాయి. శనివారాలు కూడా చర్చలు జరుగుతాయని కేసీఆర్ ప్రకటించారు. ఇది అభినందనీయం. బడ్జెటు సమావేశాలకు అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు కూడా అస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి. కొంతకాలంగా సర్కారు విధానాలపై, నిర్ణయాలపై తీవ్ర విమర్శలు చేస్తున్న టీడీపీ, కాంగ్రెసు అసెంబ్లీలో కలసికట్టుగా దాడి చేయబోతున్నాయి. అసెంబ్లీలో టీడపీతో కలిసి, సమన్వయంతో పనిచేస్తామని కాంగ్రెసు నేత డి శ్రీనివాస్ చెప్పారు. కేసీఆర్ వైఫల్యాలను ఎండగడతామని చెబుతున్నారు. కేసీఆర్ బంగారు తెలంగాణ సాధించలేరని ప్రజలకు తెలియచెప్పేందుకు, ప్రజలకు ఆయనపై భ్రమలు తొలగింపచేసేందుకు ప్రతిపక్షాలు శ్రమించే అవకాశముంది. ఇది స్వల్పకాలిక బడ్జెటేనని ప్రభుత్వం సమర్థించుకోవచ్చు. కాని ఇది టీఆర్ఎస్ ప్రభుత్వ భవిష్యత్తుకు ఏవో సంకేతాలు పంపించక తప్పదు. మొత్తం మీద కేసీఆర్ బడ్జెటు అల్లావుద్దీన్ అద్భుత దీపంలా ఉంటుందా? చమురు దీపంలా ఉంటుందా? చూడాలి.
ఎం.నాగేందర్