బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌కి ఐదేళ్ళ జైలు శిక్ష పడింది. రెండ్రోజుల తాత్కాలిక బెయిల్‌తో ఊరట లభించినా, ఆ తర్వాత ఆయన జైలుకు వెళ్లక తప్పదన్న ప్రచారం జరుగుతోంది. ఈలోగా పై కోర్టుని, ఆ పై కోర్టునీ ఆశ్రయించి, సల్మాన్‌ఖాన్ శిక్ష నుంచి తప్పించుకునే అవకాశాలున్నాయన్న వాదనలకు కొదవే లేదు.
ఇదిలా వుంటే, సల్మాన్‌ఖాన్ అనుకోకుండా చేసిన తప్పిందానికి ఇంత పెద్ద శిక్ష ఎలా విధిస్తారు.? అన్న చర్చ బాలీవుడ్ వర్గాల్లో షురూ అయ్యింది. మన టాలీవుడ్ ప్రముఖులూ సల్మాన్‌ఖాన్‌కి సంఫీుభావం ప్రకటించేశారు. మామూలుగా అయితే సల్మాన్‌ఖాన్ తెలిసో తెలియకో నేరానికి పాల్పడ్డాడు. తన దురుసు డ్రైవింగ్‌తో ఓ వ్యక్తి మృతికి కారణమైన సల్మాన్‌ఖాన్, శిక్ష నుంచి తప్పించుకోడానికి వేసిన ఎత్తులపై న్యాయస్థానం చాలా సీరియస్ అయ్యింది.
‘నేరాన్ని ఇంకొకరి మీదకు తోసేందుకు ప్రయత్నించావు. న్యాయస్థానం యెదుట అబద్ధాలు చెప్పావు. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే జరిగింది. ఇది జరిగిన ఘటనకన్నా తీవ్రమైన నేరం..’ అనే అభిప్రాయం న్యాయస్థానం వ్యక్తం చేసిందన్న ప్రచారం జరుగుతోంది. ఆ కోణంలోనే సల్మాన్‌ఖాన్‌కి శిక్ష నుంచి తప్పంచుకునే అవకాశాలు తగ్గినట్లు తెలుస్తోంది.
కాగా, ఓ స్టార్ హీరో వున్నపళంగా జైలుకు వెళితే, అతని మీద ఆశలు పెట్టుకున్న నిర్మాతల పరిస్థితి దయనీయంగా మారిపోతుంది. సల్మాన్‌ఖాన్ లాంటి హీరోల డేట్స్ ఏడాదికే కాదు, రెండు మూడేళ్ళకు కూడా కంప్లీట్‌గా ఫిలప్ అయిపోయి వుంటాయి. సో, సల్మాన్ జైలుకు వెళితే సల్మాన్ నిర్మాతలకు కలిగే నష్టం అంతా ఇంతా కాదు. ఈ పరిస్థితుల్లో సల్మాన్‌ఖాన్ శిక్ష నుంచి బయటపడాలని మొత్తం సినీ పరిశ్రమ కోరుకుంటోంది. అందుకే శిక్ష కాస్త తక్కువ పడి వుంటే బాగుండేదన్న అభిప్రాయాలు సినీ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి.