హిట్ అండ్ రన్ కేసులో దోషిగా ఐదు సంవత్సరాల జైలు శిక్షను ఎదుర్కొంటున్న బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ భవితవ్యంపై తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతానికి అయితే రెండు రోజులు బెయిలు మీద ఉన్న ఖాన్ తదుపరి ప్రస్థానం ఎలా ఉంటుందనేది అభిమాలను ఆందోళన పరుస్తోంది. శిక్ష ఖాయం కావడంతో సల్మాన్ జైలుకు వెళతాడా.. లేక పై కోర్టుకు అప్పీల్ అంటూ బెయిల్ పై బయటే ఉంటాడా? అనేది ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం.
మరి సల్మాన్ గనుక జైలుకు వెళ్లడం ఖాయం అయితే.. అక్కడ ఆయన తన సన్నిహితుడిని ఒకరిని కలుసుకొంటాడు. ఎరవాడ జైల్లో ఉన్న తన ఆప్తుడు సంజయ్ దత్ కు తోడుగా వెళతాడు! శిక్ష ను అనుభవించడానికి సల్మాన్ ను జైల్లోనే పెట్టాల్సి వస్తే.. అతడిని పుణేలోని ఎరవాడ జైలుకి తరలిస్తారని తెలుస్తోంది.
ఈ కేసు నమోదు అయ్యింది… విచారణ జరిగింది మహారాష్ట్ర పరిధిలోనే. కాబట్టి సల్మాన్ తదుపరి గమ్యం కూడా ఈ రాష్ట్ర పరిధిలోని జైలే అవుతుంది. ప్రస్తుతం ముంబై పరిసరాల్లో ఉన్న జైళ్లను పరిశీలిస్తే.. అక్కడ పట్టుబడ్డ ఉగ్రవాదులు.. ఇతర గ్యాంగ్ స్టర్లు ఉంటున్నారు. ఇలాంటి వారి మధ్యన పెట్టలేకే దత్ ను పుణేలోని ఎరవాడ జైల్లో ఉంచారు. ఇదే ప్రకారం సల్మాన్ ను కూడా ఎరవాడ జైలుకే తరలించే అవకాశాలున్నాయని మహారాష్ట్ర జైళ్ల శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
దీంతో బాలీవుడ్ లో సన్నిహితులుగా మెలిగిన దత్, సల్మాన్ లు జైళ్లో ఒకరికి మరొకరు తోడవుతారనమాట!