సుయోధనుడి మేనేజిమెంట్ టెక్నిక్స్
భగవద్గీతను మనం పంచమవేదంగా గుర్తిస్తాం. నిజానికి దీనిని మనం ప్రథమ వేదంగా పరిగణించాలి. మనబోటి సామాన్యుల్లో లెక్క తీసినప్పుడు.. వేదాలు నాలుగు ఉన్నాయని గానీ ఆ నాలుగింటి పేర్లు గానీ వాటి విశిష్టత గానీ తెలియని చాలామందికి భగవద్గీత మాత్రం తెలుసు. కనీసం భగవద్గీత అనేది ఒకటి ఉన్నదని.. అందులో స్వజనులను బంధుమిత్రులను చంపడానికి ఇష్టంలేక, ‘యుద్ధమే వద్దు- చేయలేను- రాజ్యమే వద్దు’ అంటూ విషాదంలో పడిన అర్జునుడికి స్ఫూర్తి ఇవ్వడానికి శ్రీకృష్ణ పరమాత్ముడు బోధించిన అనేకమైన అంశాలు ఉంటాయనే సంగతి మనలో చాలా మందికి తెలుసు. కనుక ఆదరణే ప్రామాణికం అయిన మన ప్రజాస్వామిక వ్యవస్థలో భగవద్గీతనే ప్రథమవేదంగా గుర్తిస్తే తప్పు కాకపోవచ్చు. యుద్ధము- ధర్మము- పరమాత్ముడి ప్రవచనం- ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోకపోయినప్పటికీ…. నైరాశ్యం, నిస్పృహల దరిజేరిన ఒక వ్యక్తిలో వాటిని నిర్మూలించి.. కార్యోన్ముఖుడిని చేయడానికి శ్రీకృష్ణభగవానుడు చేసిన కౌన్సెలింగ్ ఈ భగవద్గీత. ప్రపంచంలో ఇప్పటికే చాలా మంది చాలా సందర్భాల్లో.. భగవద్గీతను అతిగొప్ప వ్యక్తిత్వ వికాస పుస్తకంగా పేర్కొన్నారు. శ్రీకృష్ణుడిని అతిగొప్ప పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్‌గా అభివర్ణించిన వారున్నారు.
మనబోటి సామాన్యులకు, ఐహికమైన జీవనంలో ఉన్న వారికి మరో రకమైన భాష్యం అనవసరం. వ్యక్తిత్వ వికాస తరగతుల్లో ఏం తెలుసుకోవాలని, జీవన వికాసానికి ఏం కావాలని అందరూ కోరుకుంటారో.. అలాంటి సమస్తమైన విషయాలూ భగవద్గీతలో మనకు దొరుకుతాయి.
‘యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి నతత్ క్వచిత్’ అంటాడు వ్యాసుడు మహాభారతం విశిష్టతను విశదీకరిస్తూ. అంటే ఇతరత్రా సకల చరాచర సృష్టిలోనూ.. సకలమానవాళి జీవితాలలోనూ ఉండే సమస్త అంశాలూ ఇందులో (భారతంలో) ఉంటాయి. ఇందులో లేనిది.. ప్రపంచంలో మరెక్కడా ఉండదు’ అని! భారతం చివరి ఘట్టాల్లో స్వర్గారోహణ పర్వంలో ఉన్న వాక్యమిది. భారతంలో ఎన్ని రకాల జీవిత వైరుధ్యాలను ప్రస్తావించాడో ఆయన కెరుక గనుక.. ఇందులో లేనిది ప్రపంచంలో మరెక్కడా లేదని చెప్పగల సాధికారత ఆయనకు వచ్చింది.
వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి, వ్యక్తి లాక్షణికతకు సంబంధించి భగవద్గీత కూడా అలాంటి విశిష్టమైన గ్రంథమే! బాహ్యంగా కనిపించినంత వరకు ఈ భగవద్గీత పరమార్థం ‘విరాగి అయిన ఒక వ్యక్తిని యుద్ధోన్ముఖుణ్ని చేయడం’ మాత్రమే! కానీ అంతరాల్లోకి చూడగలిగితే.. కేవలం కర్తవ్యబోధ, స్ఫూర్తి మాత్రమే కాదు… వ్యక్తిత్వ వికాసం, బిజినెస్ మేనేజిమెంట్, సక్సెస్ సూత్ర లాంటి సమస్తం అందులో మనకు దొరకుతాయి.
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిగా భక్తకోటి ఎంచే వేంకటేశ్వర తత్వం గురించి విపులీకరించే అన్నమయ్య కీర్తన మనకు తెలుసు. ‘ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు.. అంతరాంతములెంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లూ’ అనే పంక్తులు చెప్పే సారం అద్భుతమైనది. కొలిచిన వారికి కొలిచినంత దేవుడు. బొట్లు చాలా పెట్టామా… మెడనిండా దేవుళ్ల బొమ్మలున్న గొలుసులు వేసుకున్నామా… దేవుళ్ల బొమ్మలున్న ఉంగరాలు ధరించామా అనేది కొదు.. కొలబద్ధ! ఎంతగా విశ్వసిస్తున్నాం అనేదాన్ని బట్టి.. దేవుడు మనకు స్పందిస్తాడు. నదివద్దకు నీటికోసం మనం ఏ పాత్రతో వెళితే అంత నీళ్లే లభిస్తాయి. గ్లాసుతో వెళితే గ్లాసుడు, బిందెతో వెళితే బిందెడు. దైవత్వం నది లాంటిదే.
భగవద్గీత కూడా అలాంటి గ్రంథమే. ఎంత లోతులకు మనం వెళ్లగలిగితే… అంత నిగూఢమైన జ్ఞానాన్ని మనకు అందిస్తుంది. ఎలాంటి సమస్యతో మనం దాన్ని ఆశ్రయిస్తే దానికి తగిన పరిష్కారాన్నే అది సూచిస్తుంది. ఎంత శ్రద్ధతో దాన్ని అధ్యయనం చేయగలిగితే.. అంత కచ్చితమైన పరిష్కారాన్ని ప్రతిపాదిస్తుంది. వ్యక్తి వికాస గుణ విశేషాలకు సంబంధించి… ఇందులోని సమాచారం సమగ్రం అనిపిస్తుంది. దాన్ని సరైన తీరులో గ్రహించగలిగే స్థాయి మనకుండాలి. మన స్థాయి పెరుగుతున్న కొద్దీ.. అది మనకు అందించే జ్ఞానం కూడా పెరుగుతుంది.
‘విషాదం’..తో ప్రారంభించడం ఏమిటి?
భగవద్గీత ‘అర్జున విషాదయోగం’తో ప్రారంభం అవుతుంది. అయితే మనిషిని కార్యోన్ముఖుడిని చేసే అద్భుత స్ఫూర్తిదాయక సందేశాన్ని ప్రతిపాదిస్తూ.. దాని ప్రారంభానికి విషాదయోగం అని పేరు పెట్టడం ఏవిధంగా సబబు? అనే దానిపై భిన్నాభిప్రాయాలున్నాయి. భక్తి, ధ్యానాది యోగాల్లాగా విషాదం యోగం ఎలా అవుతుందని రకరకాల వివరణలు ఉన్నాయి. విషాదం యోగం ఎలాగో అర్థం చేసుకునే ప్రయత్నం కంటె.. విషాదం నుంచి శ్రీకారానికి ఔచిత్యం ఏమిటో ఆలోచిద్దాం.
అర్జున విషాదం అనేది ఏడుపు (దుఃఖం) కాదు. అది ఒక విరక్తి. వైరాగ్యం, అసంతృప్తి. ఈ స్థితినుంచి మొదలయ్యే ప్రస్థానం సంతృప్తి వైపు సాగుతుంది. మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం. చిన్న ట్రాజెడీ సన్నివేశంతో సినిమా ప్రారంభం అవుతుంది. ఏదో వినోదం కోసం సినిమాకు వస్తే.. ఈ ట్రాజెడీ బిగినింగ్ ఏమిటి అనిపిస్తుంది మనకు. కానీ ప్రారంభం విషాదంలో ఉన్నప్పటికీ దాని నడక మొత్తం సుఖాంతం దిశగా సాగుతుంది. అది ఒక ‘టెక్నిక్’ అనుకోవచ్చు. భగవద్గీత అలాంటి కోవకు చెందినదిగా భావించవచ్చు. ‘అర్జున విషాదం’ పేరిట యుద్ధం పట్ల అతనిలోని అసంతృప్తిని, వైరాగ్యాన్ని, విముఖతను ప్రస్తావిస్తూ.. అక్కడినుంచి స్ఫూర్తి ప్రేరేపణ మొత్తం కార్యోన్ముఖుడిగా తీర్చిదిద్దడం లక్ష్యంగా సాగినదని మనం అర్థం తీసుకోవచ్చు. ఆ రకంగా చూసినప్పుడు… అర్జున విషాద యోగం అనే పేరు తొలి అధ్యాయానికి ఉచితంగానే కనిపిస్తుంది.
సుయోధనుడి మేనేజిమెంట్ చతురత!
భగవద్గీత తొలి అధ్యాయంలో ధృతరాష్ట్రుడు తొలిశ్లోకంలో.. అక్కడ ఏం జరుగుతోందో చెప్పమని అడిగిన తర్వాత.. సంజయుడు చెప్పిన తొలివాక్యం సుయోధన సార్వభౌముడి గురించి. (ఇది సంభాషణలో ఔచిత్యనీతిని బోధించేది. దీన్ని గురించి విడిగా చెప్పుకుందాం). సుయోధన సార్వభౌముడు ఏం చేస్తున్నాడో సంజయుడి మాటల్లో తెలుసుకుంటే.. దాన్ని మనం సరిగ్గా అన్వయించుకోగలిగితే.. నవతరం బిజినెస్ మేనేజిమెంట్ వ్యూహాలు, చాణక్య వ్యూహాలు అన్నీ అందులో ఇమిడి ఉన్నాయని అనిపిస్తుంది.
యుద్ధంలో తొలిరోజు కౌరవసేనలకు భీష్ముడు సేనాని. పాండవసేనలకు ధృష్టద్యుమ్నుడు. కానీ సుయోధనుడు ముందుగా ద్రోణుడి వైపు వెళ్లాడు. భీష్ముడి రథం పక్కనే ద్రోణుడి రథం ఉంది. ద్రోణుడిని ఉద్దేశించి పాండవుల సైన్యం ఎలా మోహరించి ఉన్నదో చూశారా అని అడిగాడు సుయోధనుడు.
నిజానికి తొలి రోజు యుద్ధంలో ధృష్టద్యుమ్నుడు పాండవ సేనలను యుద్ధశాస్త్రంలోని వజ్రం అనే వ్యూహంలో అమర్చినట్లు చెబుతారు. దుర్యోధనుడికి ఆ వ్యూహం ఆశ్చర్యం కలిగించినట్లు చెబుతారు. రాజుకు ప్రత్యర్థి వ్యూహం ఆశ్చర్యం కలిగించవచ్చు గాక.. కానీ ఆ సంగతిని సర్వసైన్యాధ్యక్షుడి స్థానంలో ఉన్న భీష్ముడి వద్దకు వెళ్లి చర్చించడం ప్రాథమిక నీతి. అయితే ఆయన ద్రోణుడి వద్దకు వెళ్లాడు. వెళ్లి తొట్టతొలుతగా కూడా చెప్పిందేమిటో తెలుసా…
వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా
– అంటూ ద్రోణుడికి వివరించే ప్రయత్నం చేశాడు. ‘మీ శిష్యుడు, ధీమంతుడు అయిన ధృష్టద్యుమ్నుడు పాండవసేనలను ఎలా మోహరించారో చూశారా? అని తన తొలిమాటలుగా చెప్పాడు.
దుర్యోధనుడి మేనేజిమెంట్ టెక్నిక్ మొత్తం ఇక్కడే ఉంది. మోహరించిన సేనల్లో మొదటివరుసలో నిల్చున్న తరువాత.. ద్రోణుడు కూడా వైరిపక్షం వ్యూహాన్ని గుర్తించే ఉంటాడు కదా! మళ్లీ సుయోధనుడు ప్రత్యేకంగా వచ్చి చెప్పడం ఎందుకు? ఎవరి గురించి చెబుతూ ఎవరిని రెచ్చగొడుతున్నాడో మనం గమనించాలి. ద్రుపదుడి కొడుకు గురించి ప్రత్యేకంగా చెబుతూ, ద్రుపదుడి బాల్యమిత్రుడైన ద్రోణుడిని రెచ్చగొడుతున్నాడు. ద్రోణ ద్రుపదులు ఒకే గురుకులంలో చదువుకున్నారు. పెద్దయ్యాక సాయం అర్థించవచ్చి ద్రోణుడు అవమానానికి గురైన కథ మనకు తెలుసు. తదనంతర పరిణామాల్లో ద్రోణుడిని సంహరించగల బలవంతుడిని ప్రసాదించమని ద్రుపుదుడు వరప్రసాదంగా ధృష్టద్యుమ్నుడిని కొడుకుగా పొందాడు. అంటే ధృష్టద్యుమ్నుడు- ద్రోణుడిని చంపడానికే పుట్టినవాడన్నమాట. పైగా అతను ద్రోణుడి శిష్యుడు కూడా! తనను చంపడానికే జన్మించిన వాడు.. తనవద్ద విద్యాభ్యాసానికి వచ్చినప్పుడు.. ద్రోణుడు వెరవకుండా నేర్పించాడు. తను విద్య నేర్పకపోయినా.. భగవత్సంకల్పం అలా ఉన్నప్పుడు తనను అతడు చంపక మానడు. అలాంటప్పుడు.. విద్యార్థిని తిరస్కరించిన అపకీర్తి తనకెందుకు అనుకున్నాడు ద్రోణుడు.
ఇప్పుడు సుయోధనుడు అవన్నీ అన్యాపదేశంగా గుర్తు చేస్తున్నాడు. ఇండైరక్టుగా ‘‘నిన్ను చంపడానికి పుట్టిన వాడు, నీవద్ద విద్య నేర్చుకున్నవాడు.. అక్కడ సైన్యాన్ని వ్యూహాత్మకంగా మోహరించి ఉన్నాడు చూశావా’’ అంటున్నాడు. సర్వసైన్యాధ్యక్షుడైన భీష్ముడితో కాకుండా.. వైరిపక్షం వారి యుద్ధవ్యూహం గురించి… ద్రోణుడితో చర్చించడానికి హేతువు అదే. రెచ్చగొట్టడం అన్నమాట.
పైగా భీష్మద్రోణులు పాండవ పక్షపాతిలే అనే అనుమానం రారాజుకు ఉంది. అందుకే భీష్ముడి దగ్గర ముందే మాట తీసుకున్నాడు. పాండవులైదుగురు, శిఖండిని తప్ప… యావత్ శత్రుసైన్యాన్ని నిశ్శేషం చేస్తానని మాట ఇచ్చాడు భీష్ముడు. భీష్ముడి పేరే వాక్పరిపాలనకు పర్యాయపదం. ఆడిన మాట తప్పడు. యుద్ధరంగంలో ఆయన నిలవగలిగినంత వరకు.. పాండవసేనలు శలభాల్లా రాలిపోవాల్సిందే. కాబట్టి.. ఆయనను కొత్తగా రెచ్చగొట్టవలసిన పని లేదు. ఇక ‘రెండో పాండవపక్షపాతి’గా తనకు అనుమానం ఉన్న ద్రోణుడి వద్దకు వచ్చి రెచ్చగొడుతున్నాడు.
ఇందులో టెక్నిక్ ఏంటంటే.. ‘నీ చేతుల్లో ఉంది నువ్వు తలచుకుంటే వాళ్లను ఛిన్నాభిన్నం చేయగలవు’ అంటూ పొగిడి ప్రేరేపించడం లేదు. ‘నిన్ను చంపడానికే పుట్టిన వాడు.. సవాలు విసురుతున్నాడు చూశావా..’ అంటూ తొలి శ్లోకంలోనే ధృష్టద్యుమ్నుడి ప్రస్తావనతో చెబుతున్నాడు. మన సినిమాల్లో చూస్తుంటాం. ‘మీరు నన్ను నాలుగు దెబ్బలు కొట్టేలోగా ఒకటైనా నేను కొడతా’ అంటాడు హీరో. ‘మీరు పదిమంది కలిసి నన్ను చంపేలోగా ఒకడినైనా నేను చంపేస్తా’ అని అంటుంటాడు. అదేసూత్రం ఇక్కడ వాడుతున్నాడు సుయోధనుడు. ఈ మాటల ద్వారా.. ధృష్టద్యుమ్నుడి చేతిలో తన మరణం తథ్యమని తెలిశాక.. ద్రోణుడి అతడిని ఎదుర్కొనే తీరు పూర్తిగా మారపోతుంది కదా. చచ్చేలోగా… సాధ్యమైనంత శత్రువును నష్టపరచాలనే ధోరణే వీరుల్లో ఉంటుంది. పైగా సర్వసైన్యాధ్యక్షుడు ఉండగా రారాజు తనను తొలుత ఆశ్రయిస్తున్నాడనే అంశం కూడా ద్రోణుడిలో ఉత్సాహాన్ని ఉద్దీపింపజేస్తుందని మరో ఆశ. అందుకే ద్రోణుడిని అలాంటి వాక్యాలతో రెచ్చగొట్టి వదిలేస్తే.. ఇక పాండవసేనలను చీల్చి చెండాడుతాడని రారాజు ఆశ.
ఈ ‘మేనేజిమెంట్’ తెలివితేటలు ఆధునికతరానికి అచ్చంగా సరిపోతాయి. బిజినెస్ మేనేజిమెంట్ అనండి. సీఈవోను సంప్రదించకుండా.. కంపెనీ యజమాని.. తర్వాతి హోదాలోని ఒక వ్యక్తికి కీలక బాధ్యత గురించి వివరించాడనుకోండి. ఆ వ్యక్తి మరింతగా యజమానికి తన పట్ల గల నమ్మకాన్ని నిలుపుకోవడానికి పూర్తి శక్తియుక్తులను ఉపయోగించి పనిచేయడం మనకు సంస్థల్లో కనిపిస్తుంది. అంతిమంగా యజమానికి కావాల్సింది పని పూర్తి కావడం. ఇలాంటి చిన్న టెక్నిక్‌తో సెకండ్ లెవెల్ లోని టేలంటెడ్ వారినుంచి యజమాని ‘పనిని పిండుకోవచ్చు’నన్నమాట! ఎంత సింపుల్ టెక్నిక్! పైగా ఒక కంపెనీ నుంచి వెళ్లిన ఉద్యోగి మరో కంపెనీలో చేరాడనుకుందాం. తొలి కంపెనీలో అతడికి ట్రైనింగ్ ఇచ్చిన బాస్‌ను రెచ్చగొడితే ఉండే ఫలితం వేరు. ‘చూశావా నిన్ను ఓడించడానికే.. ఇదే ఫీల్డ్‌లోకి నీవద్ద పని నేర్చుకున్న వాడు వచ్చాడు’ అంటూ అతని ఈగోను రెచ్చగొడితే.. ఇక అవతలి వాడి పతనం చూసే వరకు నిద్రపోకుండా పనిచేస్తాడనేది ఒక వ్యూహం.
సుయోధన సార్వభౌముడు తన తొలిశ్లోకంలోనే బిజినెస్ మేనేజిమెంట్ లోని ఈ మెళకువను మనం గ్రహించాలి.
భగవద్గీత నిండా ఇలాంటి మేనేజిమెంట్ మరియు వ్యక్తిత్వ వికాస విషయాలు పుంఖాను పుంఖాలుగా ఉన్నాయి. లోతులకు వెళ్లి అధ్యయనం చేసేకొద్దీ ఒక్కటొక్కటిగా మనకు బోధపడుతుంటాయి. మన జ్ఞానం అనుమతించిన మేరకు వాటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
-కె.ఎ. మునిసురేష్పిళ్లె