ఓ పాలగాల్లెరా- నీట ముంచినా, పాల ముంచినా మీదే భారం!

రాయలసీమ సమస్యల పరిష్కారం కోసం యువకులు ఆరాటపడటం, ఆవేశాలకులోనయి ఉద్యమాలు, చర్చపొచర్చలు చేపట్టడం ముదావహం! కాని చిలుక ప్రాణం మంత్రగాడి చేతిలో వున్నట్లు, ఈ ప్రాంత అభివృద్ధి మన పాలగెల్ల చేతిలో వుంది, అది…

రాయలసీమ సమస్యల పరిష్కారం కోసం యువకులు ఆరాటపడటం, ఆవేశాలకులోనయి ఉద్యమాలు, చర్చపొచర్చలు చేపట్టడం ముదావహం! కాని చిలుక ప్రాణం మంత్రగాడి చేతిలో వున్నట్లు, ఈ ప్రాంత అభివృద్ధి మన పాలగెల్ల చేతిలో వుంది, అది వ్యవస్తీక్రుతమై వుంది ..దానికి కుల, మత బేధాలు లేవు. ప్రతి సామాజిక వర్గం ఈ ముఠా నాయకుల చేతిలో బందీగా వుంది.

సాగు, తాగు నీరు కోసం చదువుకొన్న రైతు బిడ్డలు ఉద్యమించడం అభినందనీయం.. మన హక్కుల కోసం పోరాడుతూనే మనల్ని మనం సంస్కరించు కోవాలి. ఒక్కసారి ఈ ఉద్యమ స్వరూపం చూస్తే మనకు కనిపించేది రైతు బిడ్డలే, ఏమి మిగతా సమాజం ఎందుకు స్పందిచడం లేదు? వారికి పరిశ్రమలు వద్దా? లేక వారి వద్ద భూమి లేదా?

ఈ ప్రశ్నకు సమాధానం మన గత చరిత్ర లో వెతకవచ్చు. మన ఘన చరిత్ర ఎంత వున్నా, దుడ్డుకు సైనికులను(మెర్సినరి వ్యవస్థ) పంపి వచ్చిన సొమ్ముని ఒక అయ్య చేతిలో పెడితే, ఆయన పంచితే అతని చల్లని నీడలో ఇంత గంజి త్రాగిన చరిత్ర. పన్నులు వసూలు చెయ్యాలన్నా, పనులు చేయాలన్నా అంత ఆ మోతుబరి, ఆ బలవంతుడి దయాదాక్షిన్యమే. వీరిని అదుపులో పెట్టలేక నిజాము రాజు అప్పనంగా బ్రిటీషు వారికి దత్తతగా ఇస్తే ఇలా తగలబడ్డాము.

చదువుకుంటే మంచాల మీద కుర్చున్టారని స్కూల్ వద్దని తిప్పిపంపిన గడ్డ ఇది, ఏది అన్యాయమని అడగటానికి ఆ పాలేగాడి గంజి ఉదారత, వితరణ అడ్డం వచ్చింది. అడిగితే ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడం, వివక్షకు గురి చెయ్యడం మన ఘన చరిత్ర సాక్షి బూథాలు. ఇక్కడ వెట్టి వుండేది అని కొత్త తరం వారికి తెలియక పోవచ్చు. మన పాలెగాడు అపరిచితుడు, వాడే క్రూరంగా ఉంటాడు కాని ఇంత గంజి పోస్తాడు, బాగా చదివితే అంతో ఇంతో సాయం కూడా చేస్తాడు (తన ఉనికి కి, అధికారానికి ప్రమాదం రానంత వరకు).

ఈ గడ్డ మీద దేవుళ్ళు కూడా పాలగాల్లె.. క్ష్రేత్రాలు, పీఠాలు పెట్టుకొని వారిని సంతృప్తి పరచమంటారే కాని తొంగి చూడరు. సువర్ణ సుశోభిత వేంకటేశ్వరుడు ప్రపంచ ప్రజలకు తన నీడ చూపుతాడు కాని పక్కనే మదనపల్లె టమోటా లు రూపాయికే సలీసు గా అమ్మటం, రైతు బాధతో రోడ్డు మీదే పారబోస్తే చోద్యం చూస్తాడే? కదిరి నరసింహ స్వామి తలుపుల పక్క తాండా లో లంబాడి అమ్మాయిలను బొంబాయి వేశ్యాగృహాలకు అమ్మేస్తుంటే కరుణ చూపడే? మంత్రాయలం లో రాఘవేంద్రుడు అటు కన్నడ వారినా ఇటు సీమ బిడ్డలనా ఇంకా తేల్చుకోలేదు.

శ్రీశైల మల్లన్న అడవిలో ఉంటాడు కాని రాయలసీమ కి జరుగుతున్న అన్యాయానికి ఇసుమంత కూడా సాయం చేయడు. కాలహస్తీశ్వరుడు సువర్ణముఖి నది పక్కన కొలువైనా అది పారుతున్నదో లేదో పరికించడు. అహోబిలం, మహానంది, లేపాక్షి, యాగంటి, పుట్టపర్తి మొదలగు పుణ్య క్షేత్రాలన్నీ ఈ గడ్డ మీదే, కాని ఈ రాతి దేవుళ్ళు నలుదిక్కులా నిలబడి కరువు, క్షామం, దౌర్జన్యం ఈ ప్రాంతం నుండి వెళ్ళిపోకుండా కాపలా కాస్తూ కక్ష తీర్చుకొంటున్నారు.

మన పాలెగాళ్ళు ఆటవిక ముఠా సంస్కృతి నుండి రూపాంతరం చెంది ఆర్థిక ముఠాగా మారినారు. ఎవరైనా పారిశ్రామిక వేత్త ముందుకు వచ్చి సంస్థ స్తాపిస్తే మన వాడు చూపే విశ్వరూపం వర్ణనాతీతం. ప్రతి పెద్ద ఫ్యాక్టరీలలో కార్మిక నాయకుడు మనోడే! ఎందుకంటే ప్రతి సమాస్యా పరిష్కారం, పంచాయితీ మా పాలేగాని వల్లే సాధ్యం. మద్యం అయినా, రోడ్డు, ప్రాజెక్టు కాంట్రాక్టు పనులైనా మనోడి కనుసన్నులలోన.. అంతా సిండికేటు అవడం ఊళ్లకు ఊళ్ళు పంచుకోవడం. వుద్యమమైనా, ఉద్యోగమైనా మాకు అయన చెపితేనే, ఎందుకంటే మాకు ఏమి కావాలో మీరే నిర్ణయించేది. మాకు సొంత ఆలోచనలు వుండవు, వుండినా మేము దౌర్జన్యాలకు, అక్రమాలకూ అడ్డు నిలబడగాలమా!

ఇప్పుడు జరుగుతున్న రాయలసీమ ఉద్యమం మౌలిక సమస్యల పరిష్కారం కోసం పాటు పడుతూనే, పాలెగాళ్ళ బారి నుంచి కాపాడుకోవాలి. నిజంగా రాయలసీమకు ఆర్ధిక పాకేజీ వస్తే ఎన్ని రాబందులు ఎదురు చూస్తున్నాయో మనకు తెలుసు. ఇప్పుడు మాట్లాడుతున్న నాయకులు జిల్లాలు వారిగా విడిపోయి తమ వర్గాలకోసం దౌర్జన్యానికి దిగుతారని జగమేరుగిన సత్యం. ప్రతి రాజకీయ పదవి తన పరిధి లో అధికారం చెలాయించడం ఇక్కడ నిత్య కృత్యం. రైతు సమస్యలతో పాటు పట్టణ మౌలిక సదూపాయాలు, ఆరోగ్యం, చిన్న చిన్న పరిశ్రమలు, మొదలగు వాటిని స్థాపించి వాటికి పరిపుష్టి కలిపించి రాజకీయ జోక్యం నుండి విముక్తి కలిగించాలి.

ఏదో ఒక ఎంపి, ఎమ్యెల్యే మనకు సపోర్టు ఇస్తే సరిపోదు, అన్ని కులాలవారినీ భాగస్వామ్యం చెయ్యాలి అందుకు ఈ పాలేగాల్లకు నా ప్రత్యేక మనవి. మీరు సాగించిన రక్తపు ముఠా పోరు, ఇప్పుడు సాగిస్తున్న ఆర్ధిక దమనకాండ నుండి రాయలసీమను కాపాడండి. మీరు, మీ పూర్వీకులు సాగించిన దమననీతి పాప పరిహారం కోసం మీరు అండగా నిలబడి మీ రక్త చరిత్రను కడిగేసుకోండి.

పాలెగాళ్ళురాకపోతే మాకు గెలుపు సాధిస్తామనే నమ్మకం కలుగదు, కాని వచ్చి విజయం సాధించిన తరువాత తప్పుకోండి మీ పాపాలు కడుక్కోండి. రాయలసీమ పౌరుషం అంటే చంపుకోవడం ఒక్కటే కాదు, ఒక్కటవడం లో కూడా వుంది. చేయి చేయి కలిపి మొత్తం సమాజం వుత్తెజమవ్వాలి, గజ్జె కట్టి ఆడాలి, పాడాలి. మన సంస్కృతి గొప్పదని చాటాలి!

రంగ ఓంకారం