వెండితెరపై కమెడియన్లు హీరో కావడం చూశాం. కమెడియన్ సునీల్ ఆ మధ్య హీరో అవతారం ఎత్తాడు. అయితే కమెడియన్‌గా రాణించినంతగా హీరోగా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొనలేకపోయారు. పుష్ప సినిమాలో విలన్ అవతారం కూడా ఎత్తారాయన. తాజాగా రాజకీయ తెరపై అందరూ కమెడియన్‌గా భావించే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ రాత్రికి రాత్రే హీరో అయ్యారు. ఆయన్ని హీరోగా చేసిన ఘనత తెలంగాణ అధికార పార్టీకే దక్కింది.
కేఏ పాల్ అంటే కామెడీగా చూసే జనానికి, ఆయనలోని సీరియస్ కోణం కూడా ఉందని టీఆర్ఎస్ పార్టీ నిరూపించింది. సోమవారం ఆయనపై తెలంగాణ అధికార పార్టీ దాడి, ఇవాళ ఆయన హౌస్ అరెస్ట్ …అంతా సినిమాటిక్‌గా జరిగిపోతోంది. వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు సిరిసిల్ల జిల్లాకు వెళుతున్న కేఏ పాల్‌పై అధికార పార్టీ భౌతికదాడికి దిగి, ఆయన్ను సీరియస్ రాజకీయ నాయకుడిగా తయారు చేసింది.
తనను చంపాలని టీఆర్ఎస్ కుట్ర పన్నుతోందని పాల్ ఆరోపించారు. తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కావడం వల్లే సీఎం కేసీఆర్‌కు భయం పట్టుకుందని ఆయన మాటలు విన్నవాళ్లు సరదాగా నవ్వుకుంటున్నారు. ఇదిలా వుండగా తనపై అధికార పార్టీ దాడిపై ఫిర్యాదు చేసేందుకు ఆయన డీసీపీ కార్యాలయానికి వెళ్లాలని భావించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆయనని గృహ నిర్బంధం చేయడం చర్చనీయాంశమైంది.
అసలు తెలంగాణలో ఉనికే లేని కేఏ పాల్‌పై దాడి, హౌస్ అరెస్ట్ తదితర పరిణామాల వెనుక టీఆర్ఎస్ వ్యూహం ఉందా? అనే అనుమానాలు ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయి. మొత్తానికి కేఏ పాల్ వార్తల్లో వ్యక్తిగా నిలవడం విశేషం.