ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోషల్ ఇంజనీరింగ్‌తో టీడీపీ తన వైఖరి మార్చుకోవాల్సి వస్తోంది. వైసీపీ అధినేత జగన్ మాదిరిగానే కులాలకు టీడీపీ కూడా అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తోంది. లేకపోతే రాజకీయంగా నష్టపోవాల్సి వస్తుందనే ఆందోళన టీడీపీలో ఉంది.
ఈ విషయాన్ని కడప జిల్లా కమలాపురం టీడీపీ ఇన్‌చార్జ్ పుత్తా నరసింహారెడ్డి బహిరంగంగా ప్రకటించడం విశేషం. 2004లో కాంగ్రెస్, ఆ తర్వాత 2009, 2014, 2019లలో టీడీపీ తరపున పుత్తా నరసింహారెడ్డి కమలాపురం నుంచి పోటీ చేస్తున్నప్పటికీ, ఎమ్మెల్యే కావాలనే కల నెరవేరడం లేదు. ఐదోసారి కూడా ఆయన కమలాపురం నుంచి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఈ నేపథ్యంలో జగన్ సామాజిక సమీకరణలపై పుత్తా నరసింహారెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. కమలా పురంలో ఇవాళ టీడీపీ కాపు కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పుత్తా నరసింహారెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్ కాపులకు పెద్దపీట వేస్తున్నారన్నారు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా తాము కూడా కాపులకు ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తోందన్నారు.
కమలాపురం నియోజకవర్గంలో టీడీపీ కాపులకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వడానికి సీఎం వైఎస్ జగన్ కారణమన్నారు. రాజకీయంగా ప్రత్యర్థుల ఎత్తుకు పైఎత్తులు వేసేందుకు అనివార్యంగా కులాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరీ ముఖ్యంగా జగన్ పరిపాలన సంక్షేమ పథకాలు, కుల సమీకరణలు అనేలా తయారైంది.
జగన్‌లా కులాలకు ప్రాధాన్యం ఇవ్వకపోతే రాజకీయంగా నష్టపోతామని భావిస్తున్న ప్రతిపక్షాలు, సీఎం బాటలో నడవడానికి సిద్ధం కావడం విశేషం. కడప జిల్లాలో మొదటి నుంచి కాపులు టీడీపీ వెంట నడుస్తున్నారు. అయితే జగన్ సామాజిక సమీకరణల నేపథ్యంలో కొంత వరకు వైసీపీ వెంట నడుస్తున్నారు. దీంతో కాపుల ఓటు బ్యాంక్‌ను నిలుపుకునేందుకు టీడీపీ దిగిరాక తప్పలేదు.