ఎమ్బీయస్‌ : హోం సెక్రటరీ తొలగింపు

హోం సెక్రటరీ అనిల్‌ గోస్వామి చేత రాజీనామా చేయించడానికి, శారదా స్కాముకి లింకు వుందన్న విషయం బయటకు వచ్చింది. శారదా నిందితుల్లో ఒకరైన మాతంగ్‌ సింహ్‌ అసాం కాంగ్రెసు నాయకుడు. శారదాకు సంబంధించిన టీవీ…

హోం సెక్రటరీ అనిల్‌ గోస్వామి చేత రాజీనామా చేయించడానికి, శారదా స్కాముకి లింకు వుందన్న విషయం బయటకు వచ్చింది. శారదా నిందితుల్లో ఒకరైన మాతంగ్‌ సింహ్‌ అసాం కాంగ్రెసు నాయకుడు. శారదాకు సంబంధించిన టీవీ ఛానెల్‌ కొన్నారు. ఆయన భార్యకు ఒక తెలుగు టీవీ ఛానెల్‌ వుండేది. సిబిఐ మాతంగ్‌ సింగ్‌ను అరెస్టు చేయబోతే అనిల్‌ గోస్వామి ఫోన్‌ చేసి ఆపించారు. మాతంగ్‌ సింహ్‌ పై 2013లోనే కేసుంది. కెనరా బ్యాంకు నుండి ఫోర్జరీ డాక్యుమెంట్లతో అప్పు తీసుకుని ఎగ్గొట్టాడని అభియోగం. తన టీవీ కంపెనీకై వేరే వాళ్ల నుంచి టెక్నాలజీ కొన్నానని, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కొన్నానని దొంగ ఇన్‌వాయిసులూ చూపించి అప్పు తీసుకున్నాడు. చివరకు రూ. 67 కోట్లు బకాయి పడ్డాడని, తీర్చడం లేదని కెనరా బ్యాంకు 2011లో ఫిర్యాదు చేస్తే సిబిఐ 2013లో అరెస్టు చేయబోయింది. కానీ మాతంగ్‌ తనకు మొహమాటం వున్న అనిల్‌ వంటి ఉన్నతాధికారుల సాయంతో తప్పించుకున్నాడు. ఇప్పుడు శారదా స్కాములో పూర్తిగా దొరికిపోయాడు. శారదా స్కాము విచారణలో ముందుకు సాగడానికి సిబిఐకు చాలా అవరోధాలే ఎదురవుతున్నాయి. రాష్ట్ర పోలీసు యిచ్చిన డాక్యుమెంట్లు బహుస్వల్పం. స్కాములో భాగస్వాములు బెంగాల్‌లో యింకా పాలకులుగానే వున్నారు. 2014 నవంబరులో నిందితుడిగా అరెస్టయిన కుణాల్‌ ఘోష్‌ అనే జర్నలిస్టు, తృణమూల్‌ రాజ్యసభ ఎంపీ జైలునుండి సిబిఐను ఉద్దేశించి రాసిన 91 పేజీల లేఖ సిబిఐకు చాలా సమాచారాన్నే యిచ్చింది. ''నేను పనిచేసిన ''సంగ్బాద్‌ ప్రతిదిన్‌'' యజమాని స్వపన్‌ సాధన్‌ బోస్‌, అతని కుమారుడు సృంజయ్‌ బోస్‌ (గురువారమే పార్టీ నుంచి, రాజ్యసభ సభ్యత్వం నుంచి రాజీనామా చేశాడు) నన్ను మాతంగ్‌ సింగ్‌తో లింకు పెట్టుకోమన్నారు'' అని ఆ లేఖలో వుంది. సిబిఐ మాతంగ్‌ సింగ్‌ జోలికి వెళ్లగానే హోం శాఖ కార్యదర్శిగా వున్న అనిల్‌ గోస్వామి అడ్డుకున్నారు. జనవరి 31న మాతంగ్‌ సింగ్‌ అరెస్ట్‌ చేసిన సిబిఐ హోం మంత్రికి ఆ విషయం తెలియపరచడం, ఆయన అనిల్‌ గోస్వామిని పిలిచి అడిగితే ఆయన తప్పు ఒప్పుకోవడం జరిగాయి. అందుకే యీ రాజీనామా! 

కుణాల్‌ మొదట్లో సిపిఎం సానుభూతిపరుడు. 2008లో వారి నుంచి దూరంగా జరిగి సింగూరులో ఉద్యమం నడుపుతున్న మమతా బెనర్జీని సమర్థించసాగాడు. అతను పనిచేసిన పత్రిక మమతాకు పూర్తిగా ప్రచారం కల్పించింది. శారదా గ్రూపు అధినేత సుదీప్త ఆ పత్రికను తీసుకుని, అనుబంధంగా అనేక పత్రికలు, టీవీలు నెలకొల్పి మమతాకు పూర్తి ప్రచారం కల్పించాడు. ఆ మీడియా గ్రూపుకి సిఇఓ కుణాల్‌ కాబట్టి అతనికి అనేక విషయాలు తెలుసు. సుదీప్తకు, తనకు పరిచయమే లేదని, ఎన్నడూ కలవలేదని మమత చేస్తున్న వాదన అబద్ధమని కుణాల్‌ తన లేఖలో స్పష్టం చేశాడు. ''ఆమె తరచుగా సుదీప్తతో మాట్లాడేది. శారదా గ్రూపుకి సంబంధించిన పత్రికలలో, టీవీల్లో తనకు వ్యతిరేకంగా ఏదీ రానిచ్చేది కాదు. ''లేఖలు'' శీర్షికలో విమర్శ వచ్చినా వెంటనే ఫోన్‌ తీసుకుని నన్ను తిట్టేసేది. ఇలాటి కారణాలతోనే మా గ్రూపుకి చెందిన ఇంగ్లీషు పత్రిక ''బెంగాల్‌ పోస్ట్‌''లో న్యూస్‌ కోఆర్డినేటర్‌ను తీయించేసింది.'' అంటాడు కుణాల్‌. ఫోన్లోనే కాదు, ఆమె ప్రత్యక్షంగా కూడా సుదీప్తను కలిసింది అంటాడు. ఆమె ముఖ్యమంత్రి అయిన కొత్తల్లో కలింపాంగ్‌లో సుదీప్తను కలిసిందని, తను కూడా ఆ సమావేశంలో వున్నాననీ అతని ఆరోపణ. తను ప్రధాని కావడానికి మార్గం సుగమం అయ్యేందుకు సుదీప్త ఢిల్లీలో ఒక యింగ్లీషు డైలీ పెట్టి ఆమెను బాగా ప్రొజెక్టు చేయాలని కోరింది. దానికి బదులుగా ఒక టూరిజం ప్రాజెక్టు ఆమెకు కట్టబెడతానంది. ఒక టూరిజం అధికారిని పిలిచి 'ప్రభుత్వం యీయనతో కలిసి ప్రాజెక్టు పెడుతుంది. భూమి ఎలాట్‌ చేయండి' అని చెప్పింది. అయితే ప్రభుత్వభాగస్వామ్యం నచ్చని సుదీప్త ఆ ప్రాజెక్టు వదిలేశాడు.  ఇటీవల ఒక టీవీ యింటర్వ్యూలో మమతను 'మీకు సుదీప్త ఎవరో తెలియదంటున్నారు. కానీ కలింపాంగ్‌లో మీ యిద్దరి మధ్య సమావేశం జరిగిందట కదా' అని అడిగితే ఆమె కోపంతో అర్ధాంతరంగా లేచి వెళ్లిపోయింది. 

సుదీప్త మమత పెయింటింగ్స్‌ ఒక్కోటి రూ. 1.80 కోట్లు పెట్టి కొన్నాడన్న విషయం సువిదితమే. కుణాల్‌ లేఖ ప్రకారం అతను సృంజయ్‌ కోరిక ప్రకారం క్యాష్‌ యిచ్చి కొన్నాడు. దానికి బదులుగా పెయింటింగ్స్‌ తనకు చేరాయో లేదో గుర్తే లేదు. సుదీప్త అంతర్ధానం వెనుక మమత కుడిభుజం ముకుల్‌ రాయ్‌ పాత్ర ఎంతో కూడా లేఖ బహిర్గతం చేసింది. శారదా బండారం బయటపడగానే కుణాల్‌ మమతతో మాట్లాడాడు. ఆమె సుదీప్తతో మాట్లాడి 'అంతా సర్దుకుంటుందిలే' అని చెప్పింది. ఆ తర్వాత 2013 ఏప్రిల్‌ 5 న కలకత్తాలోని నిజాం ప్యాలస్‌లో ముకుల్‌ రాయ్‌ సమావేశం ఏర్పాటు చేసి సుదీప్తను, అప్పట్లో పోలీసు డైరక్టర్‌ జనరల్‌గా వున్న రజత్‌ మజుందార్‌ను పిలిచాడు. కుణాల్‌ కూడా వాళ్లతో బాటు వున్నాడు. ఆ సమావేశం తర్వాత సుదీప్త గాయబ్‌! దానికి గాను రజత్‌కు సుదీప్త నుండి చెక్కు రూపేణా లంచం ముట్టింది. అందుకే సిబిఐ రజత్‌ను 2014 సెప్టెంబరులో అరెస్టు చేసింది. ఇలాటి అనేక విషయాలు రాసిన కుణాల్‌ తనను తాను కూడా నిందించుకున్నాడు. 'వాళ్లు ఎఱ వేసిన నెలకు రూ.15 లక్షల జీతానికి కక్కుర్తి పడి వీటిలో పాలు పంచుకున్నాను' అని వాపోయాడు. మన తెలుగునాట యిప్పుడు అగ్రిగోల్డ్‌ వ్యవహారం నడుస్తోంది. నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల విషయంలో జరుగుతున్న అవకతవకల గురించి మార్గదర్శి సమయంలోనే బయటపడింది. ఉండవల్లి అరుణ్‌కుమార్‌ వాటిని బయటపెట్టిన కారణంగా ఏ ఒక్క డిపాజిటరూ నష్టపోలేదు. ఆ తర్వాతైనా ఫైనాన్సు కంపెనీలు ప్రజల నుంచి తీసుకునే డిపాజిట్లపై నిఘా వేసి వుంచాల్సింది. అగ్రిగోల్డ్‌ యింత పెద్ద యెత్తున గోల్‌మాల్‌ చేసిందంటే దానికి రాజకీయ నాయకుల దన్ను వుండే వుంటుంది. ఈ రోజు దానికున్న ఆస్తులన్నీ రాజధాని ప్రాంతంలో వుండడం దాని పాలిట శాపంగా మారింది. ఆస్తులను అమ్ముకోనిస్తే డిపాజిట్లు వెనక్కి యిచ్చేస్తానని కంపెనీ అంటున్నా వినటం లేదు. ఆస్తులను తక్కువ రేట్లకు స్వాధీనం చేసుకుని కంపెనీని దివాళా తీయించే ప్రయత్నమే సాగుతోంది. ఈ క్రీడలో డిపాజిటర్లు నష్టపోతారు. అగ్రిగోల్డ్‌కు కూడా పత్రిక, టీవీ వున్నాయి. వాటిలో జర్నలిస్టు ఎవరైనా కుణాల్‌ తరహాలో లేఖ రాస్తే అగ్రిగోల్డ్‌ను యిన్నాళ్లూ కాపాడిన రాజకీయ నాయకులెవరో బయటపడుతుంది.

-ఎమ్బీయస్‌ ప్రసాద్

[email protected]