క్రికెట్ వరల్డ్ కప్‌కి రంగం సిద్ధమైంది. లాంఛనంగా ప్రారంభోత్సవ వేడుకలు కూడా జరిగిపోయాయి. బరిలో జట్లు తలపడటమే తరువాయి. ఈలోగా ఆయా జట్లపై, ఆయా దేశాల్లోని అభిమానుల అంచనాలు ఆకాశాన్నంటేస్తున్నాయి. చిన్న జట్టు.. పెద్ద జట్టు అన్న తేడా లేకుండా, అన్ని జట్లపైనా ఆయా దేశాల్లో అంచనాలుండడం సహజమే కదా.
లీగ్ దాటితే చాలనుకునే జట్లు.. కప్ కొట్టాలనుకునే జట్లు.. వెరసి, అన్ని జట్లూ మైదానంలో సత్తా చాటుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ఇక బుకీలూ రంగంలోకి దిగారు. ఏ జట్టు కప్‌ని సాధిస్తుంది.? అన్న విషయమై జోరుగా బెట్టింగ్‌లు కూడా షురూ చేశారు. ఏ మ్యాచ్‌లో ఎన్ని సిక్సర్లు, ఎన్ని బౌండరీలు పడతాయి.. మొత్తంగా పడేవి ఎన్ని వికెట్లు.? నమోదయ్యేవి ఎన్ని సెంచరీలు.. టాస్ ఎవరిది.? ఇలా అనేక అంశాల చుట్టూ బెట్టింగ్‌లు జరగనున్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.
మిగతా విషయాలన్నీ పక్కన పడేసి, అసలు హాట్ పేవరెట్స్ ఏ జట్లు.? అన్న దానిపై ఓవరాల్‌గా క్రికెట్ అభిమానుల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ చర్చల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికాల పేర్లు ప్రముఖంగా విన్పిస్తున్నాయి. టీమిండియాని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదుగానీ, వరల్డ్‌కప్ పోటీలకు ముందు ఆస్ట్రేలియా టూర్‌లో వైఫల్యాల పుణ్యమా అని టీమిండియా ‘అండర్ డాగ్’ అయిపోయింది. శ్రీలంక, ఇంగ్లాండ్‌లనూ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. పాకిస్తాన్ సంగతి సరే సరి.
అయినాసరే, ఆస్ట్రేలియా ` న్యూజిలాండ్ జట్ల చుట్టూనే ‘టైటిల్’ గురించిన డిస్కషన్స్ జరుగుతున్నాయట. సౌతాఫ్రికా బలంగానే కనిపిస్తున్నా, వరల్డ్ కప్‌లో స్వయానా మ్యాచ్‌లను చేజార్చుకోవడం అనే వీక్‌నెస్ ఆ జట్టుకు ఇబ్బంది కలిగించే అంశం. అదొక్కటీ మినహాయిస్తే, సౌతాఫ్రికా కంటే బలమైన జట్టు ఇంకేమీ లేదనే అంటారు క్రికెట్ అభిమానులు.
ఒక్కటి మాత్రం నిజం. వెస్టిండీస్ మినహా ప్రధాన జట్లన్నీ టైటిల్‌ని సాధించగలిగేవే. వెస్టిండీస్ కూడా బోర్డుకీ ఆటగాళ్ళకీ మధ్య గొడవల కారణంగా వీక్ అయిపోయింది. లేదంటే సంచనాలు సృష్టించే సత్తా ఆ జట్టుకీ వుంది. ఇప్పటికిప్పుడు కన్పిస్తున్న బలం ఆధారంగా చూస్తే, ఆస్ట్రేలియా టైటిల్‌ని ఎగరేసుకుపోతుందేమో అన్పిస్తోంది. ఆస్ట్రేలియాకి వరల్డ్ కప్ టైటిల్ కొత్త కాదు.
టోర్నమెంట్‌కి ముందు వైఫల్యాలు.. అండర్ డాగ్‌లా ఎంటరయి, సూపర్ పంచ్ ఇచ్చి, కప్‌ని ఇంకోసారి సొంతం చేసుకునే అవకాశాలు టీమిండియాకీ లేకపోలేదు. అయితే, వచ్చిన ఇబ్బందల్లా ఆటగాళ్ళ గాయాలే. సీనియర్లు లేకపోవడం, స్టార్ బ్యాట్స్‌మన్ గాయాల బారిన పడ్డం.. ఇవన్నీ టీమిండియాకి ప్రతిబంధకాలు. భారత క్రికెట్ అభిమానులు మాత్రం, మైదానంలోకి దిగాక, గాయాల కన్నా కప్పు కొట్టాలన్న కసే ఆటగాళ్ళను పరుగులు పెట్టిస్తుందని నమ్ముతున్నారు.
చూద్దాం.. ఈ వరల్డ్ కప్‌లో ఏ జట్టు ఎలాంటి ప్రదర్శన ఇస్తుందో.!