ఇండియాలో వ్యాలెంటైన్స్ డే వ్యాపారం వేల కోట్లలో..!

ప్రేమకు ఒక రోజు ఏమిటి..? ఇదంతా వ్యాపార ఎత్తుగడ అని విమర్శించే వాళ్లకు కొదవలేదు. అయితే యువతలో ప్రేమికుల రోజుకు తగని ఆదరణ ఉంది. ఇలాంటి సందర్భాలు ప్రేమ ప్రతిపాదనకు గొప్ప ఘడియలు అవుతాయనే…

ప్రేమకు ఒక రోజు ఏమిటి..? ఇదంతా వ్యాపార ఎత్తుగడ అని విమర్శించే వాళ్లకు కొదవలేదు. అయితే యువతలో ప్రేమికుల రోజుకు తగని ఆదరణ ఉంది. ఇలాంటి సందర్భాలు ప్రేమ ప్రతిపాదనకు గొప్ప ఘడియలు అవుతాయనే విశ్వాసంతో కనిపిస్తారంతా. మరి ప్రేమికుల రోజంటే.. ఇది పూలు, గిఫ్ట్ లు అమ్ముకొనే వారికి పండగ అని అనే వారి విశ్లేషణలూ నిజమనిపిస్తున్నాయిప్పుడు. ఈ రోజున ప్రేమికుల సంబరం మాట ఎలా ఉన్నా.. వ్యాపారాలకు అయితే.. ఇదిపెద్ద జూమ్ అని తెలుస్తోంది.

అసోచామ్ అంచనా ప్రకారం.. వ్యాలెంటైన్స్ డే సందర్భంగా భారత్ లో 22 వేల కోట్ల రూపాయల వృద్ధి కనిపిస్తోంది! ప్రేమికుల రోజు సందర్భంగా యువతీయువకుల కొనే గ్రీటింగ్ కార్డులు, పూల బొకేలు, గిఫ్ట్ లుగా ఇచ్చుకొనే జ్యువెలరీ , చాక్లెట్లు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, సాఫ్ట్ టాయ్స్ ల కొనుగోలు  ఈ స్థాయిలో ఉందని ఆసోచామ్ అంచనా  వేసింది. ఈ  రోజున ప్రేమలో ఉన్న వారు ప్రత్యేకంగా గడిపేందుకు వెచ్చించే మొత్తాన్ని కూడా ఈ వ్యాపారంలో భాగంగా అనుకోవాలి. స్థూలంగా ప్రేమికుల రోజును బేస్ చేసుకొనే ఈ వ్యాపారం అంతా జరుగుతుందని వివరించింది!

మరి ఒక్క రోజులో 22 వేల కోట్ల రూపాయల వ్యాపారం అంటే మాటలు కాదు. ఇది దేశంలోని ఒక బుల్లి రాష్ట్రం బడ్జెట్ తో సమానం. ఈ అమ్మకాల తీవ్రతను బట్టి దేశంలో వ్యాలెంటైన్స్ డే సంబరాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో సులభంగా అర్థం చేసుకోవచ్చు.మొత్తం దేశ వ్యాపార రంగానికే ఒక ఊపు నిచ్చేలా ఉంది ఈ ఫిబ్రవరి 14. కేవలం నగరాల్లో మాత్రమే కాకుండా.. చిన్న సైజు పట్టణాల్లో కూడా వ్యాలెంటైన్స్ డే కల్చర్ విస్తృతం అవుతున్న నేపథ్యంలో అమ్మకాల్లో ఈ రకమైన ప్రగతి కనిపిస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

వ్యాలెంటైన్స్ డేపై  కన్నెర్ర చేసే సంప్రదాయ వాదులు కూడా ఈ రోజున దేశీయ వ్యాపార రంగాలకు కలుగుతున్న లబ్ధిని చూసి.. ఈ కల్చర్ ను ఇక సమర్థించేయాల్సిందేనేమో!