టెంపర్‌ రివ్యూ : ఎన్టీఆర్‌ నట విశ్వరూపం!

రివ్యూ: టెంపర్‌ రేటింగ్‌: 3.25/5 బ్యానర్‌: పరమేశ్వర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ తారాగణం: ఎన్టీఆర్‌, కాజల్‌ అగర్వాల్‌, పోసాని కృష్ణమురళి, ప్రకాష్‌రాజ్‌, మధురిమ, జయప్రకాష్‌రెడ్డి, సుబ్బరాజు, అలీ, సోనియా అగర్వాల్‌, కోవై సరళ, పవిత్ర లోకేష్‌…

రివ్యూ: టెంపర్‌
రేటింగ్‌: 3.25/5

బ్యానర్‌: పరమేశ్వర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌
తారాగణం: ఎన్టీఆర్‌, కాజల్‌ అగర్వాల్‌, పోసాని కృష్ణమురళి, ప్రకాష్‌రాజ్‌, మధురిమ, జయప్రకాష్‌రెడ్డి, సుబ్బరాజు, అలీ, సోనియా అగర్వాల్‌, కోవై సరళ, పవిత్ర లోకేష్‌ తదితరులు
కథ: వక్కంతం వంశీ
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌
నేపథ్య సంగీతం: మణిశర్మ
కూర్పు: ఎస్‌.ఆర్‌. శేఖర్‌
ఛాయాగ్రహణం: శ్యామ్‌ కె. నాయుడు
నిర్మాత: బండ్ల గణేష్‌
కథనం, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌
విడుదల తేదీ: ఫిబ్రవరి 13, 2015

మామూలుగా ఫాన్స్‌ షోల్లో… ఇంటర్వెల్‌ కార్డ్‌ పడగానే ఆ సినిమా హీరో ఎవరైతే వారికి జిందాబాద్‌లు కొడుతూ స్లోగన్‌లు వినిపిస్తాయి. ‘టెంపర్‌’ ఇంటర్వెల్‌లో ఫాన్స్‌ గప్‌చుప్‌గా బయటకి వెళ్లిపోయారు. చాలా మామూలుగా ఉన్న ఇంటర్వెల్‌ సీన్‌ తర్వాత కూడా ఫాన్స్‌ హంగామా చేస్తారు.. ‘నేనింతే’లో సాయిరామ్‌ శంకర్‌ క్యారెక్టర్‌లా.. అది మాండెటరీ అన్నట్టు! కానీ ‘టెంపర్‌’ ఇంటర్వెల్‌లో ఆ ‘మౌనం’ తీవ్రత ఎలా అనిపించిందంటే… ఆశలన్నీ పటాపంచలైనట్టు, కలలన్నీ చెదిరిపోయినట్టు, స్వప్న సౌధాలు కుప్పకూలినట్టు!! 

ఓ విధంగా ద్వితీయార్థంపై అంచనాల్ని తగ్గించేసి.. ఇంకా చెప్పాలంటే పూర్తిగా ఆశలు వదిలేసుకునేలా చప్పగా సాగిపోయింది ఫస్ట్‌ హాఫు. కానీ చివర్లో టైటిల్స్‌ రోల్‌ అయ్యేసరికి మొత్తం సీన్‌ రివర్స్‌ అయింది. ఆడిటోరియంలో జిందాబాద్‌లు మార్మోగాయి.. ‘కొట్టేసాం’ అన్న విజయ గర్వం పెల్లుబికింది. తెగిపోయిందన్న గాలిపటం దారం మళ్లీ చేతికి దొరికినట్టు, చేజారిందనుకున్న అపురూపమైన వస్తువు ఎవరో తెచ్చిచ్చినట్టు, పోయిందనుకున్న ప్రాణం తిరిగొచ్చినట్టు! తారక్‌ అభిమానులకి రెండు ఎక్స్‌ట్రీమ్స్‌ని రెండు హాఫుల్లో చూపించాడు పూరి జగన్నాథుడు. 

ఫస్ట్‌ హాఫ్‌ పాల పొంగు మీద నీళ్లు చల్లేస్తే… సెకండాఫ్‌ స్టార్టింగే బీరు పొంగిస్తూ మొదలైంది. ప్రథమార్థం ఎంత బేలగా ముగిసిందో… ద్వితీయార్థం అంత కళగా మెరిసింది. ‘ఏంటి… ఇంత పరమ అవినీతిపరుడు ఇట్టే మారిపోయాడా’ అనిపించింది కాస్తా ఇంటర్వెల్‌ అయిన వెంటనే బాగా కవర్‌ చేయడంతో బండి పట్టాలెక్కేసింది. అక్కడక్కడా జోరు తగ్గిన ప్రతిసారీ ఒక కరెక్ట్‌ సీన్‌ పడి గేరు మారిపోయింది. పూరి జగన్నాథ్‌ మొదట్లో మంచి కథలు రాసేవాడు. ‘బద్రి’, ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’, ‘ఇడియట్‌’, ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’.. ఇలా మంచి పాయింట్‌ ఉన్న కథలు ఎంచుకునేవాడు. అందుకే మొదట్లో అతనికి ఉత్తమ కథా రచయితగా నంది అవార్డులు కూడా రెండు, మూడు వచ్చాయి. ‘పోకిరి’ నుంచి పూరి పద్ధతి మారింది. కథ తగ్గించేసి కథనం మీద పడ్డాడు. అది అద్భుతమైన ఫలితాలు ఇవ్వడంతో.. కొన్నాళ్లు అలాగే కంటిన్యూ అయిపోయాడు. ఆ తర్వాత కథనం మీద కూడా ఫోకస్‌ తగ్గించేసి మాటలతో పని కానిచ్చేసాడు. అలా నెమ్మదిగా తనలోని రైటర్‌ బ్యాక్‌ సీట్‌కి వెళ్లిపోవడంతో డైరెక్టర్‌కి ఎటు తీసుకెళ్లాలో తెలీక ఏది తోస్తే అది తీసుకుంటూ పోయాడు. పూరి గత అయిదేళ్లలో తీసిన సినిమాలు చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. తనలో స్పార్కు అయితే పోలేదు… సినిమాల్లో ‘సరుకు’ ఉండట్లేదు అంతే అని. 

Watch NTR Fans Public Talk

ఎందుకు తీసుకున్నాడో, ఎలా జరిగిందో తెలీదు కానీ మొత్తానికి ‘కథ, కథనం, మాటలు, దర్శకత్వం’ అనే స్టాండర్డ్‌ పూరి జగన్నాథ్‌ టైటిల్‌ కార్డులోనుంచి ‘కథ’ వేరే వాళ్ల క్రెడిట్‌కి పోయింది. ఎప్పుడైతే వక్కంతం వంశీ రాసిచ్చిన కథలో కాస్త ‘సరుకు’ ఉందనిపించిందో… పూరి జగన్నాథ్‌లో అలా లీలగా అప్పుడప్పుడూ కనిపిస్తూ వచ్చిన ‘స్పార్కు’ ఈమధ్య కాలంలో ఎప్పుడూ కనిపించనంతగా కనిపించింది. స్టఫ్‌ ఉన్న స్టోరీ లైన్‌ దొరికితే అది ‘స్టాండ్‌’ అయ్యేట్టు చూసే టాలెంట్‌ తనకి ఇంకా ఉందని ప్రూవ్‌ అయింది. ‘టెంపర్‌’లో సీన్‌కీ, సీన్‌కీ సంబంధం లేని సిల్లీ స్క్రీన్‌ప్లే అయితే అస్సల్లేదు. ప్రతి సీన్‌నీ ఇంకో సీన్‌కి ఇంటర్‌లింక్‌ చేస్తూ.. ప్రతి కీ డైలాగ్‌ ఇంకో కీ సీన్‌లో పే ఆఫ్‌గా పని చేస్తూ.. పర్‌ఫెక్ట్‌ సింక్‌లో నడుస్తుంది. దయనీయంగా సాగిందనుకున్న ఫస్ట్‌ హాఫ్‌లోని కొన్ని సీన్లని, డైలాగులని కూడా సెకండ్‌ హాఫ్‌కి కనెక్ట్‌ చేయడం వల్ల ఓవరాల్‌గా ఎనలైజ్‌ చేసుకున్నప్పుడు వాటి వెయిట్‌ కూడా పెరిగింది. 

కథాపరంగా ఇదేమీ కొత్తదీ, మనం చూడనిదీ కాదు. సరిగ్గా ఇరవై రోజుల క్రితమే వచ్చిన ‘పటాస్‌’ లైన్‌ కూడా ఎగ్జాక్ట్‌గా ఇదే. చెడ్డ పోలీస్‌ మంచిగా ఎలా మారతాడు, మారి ఏం చేస్తాడు అనేది కథ. దానిని ట్రీట్‌ చేసిన విధానం మిగిలిన సినిమాలకి భిన్నంగా ఉంది. తారక్‌ కరప్షన్‌ ఎలా చేస్తాడు… వివిధ మార్గాల్లో ఎలా కలెక్షన్‌ వసూలు చేస్తాడు అనే సీన్‌ బ్రహ్మాండంగా తీసి సినిమాకి రైట్‌ మూడ్‌ సెట్‌ అయింది. ప్రకాష్‌రాజ్‌తో డీలింగ్‌తో కథ ముందుకి సాగడానికి అవసరమైన సరంజామా సమకూరింది. అయితే ఒక్కసారి కాజల్‌ ఎంటర్‌ కాగానే పేస్‌ డౌన్‌ అయిపోయింది. ఆ యానిమల్‌ క్రాసింగ్‌ కామెడీ, కుక్కల్ని ఎత్తుకొచ్చే ప్రహసనం చికాకు పెడతాయి. ఒక టైమ్‌కి వచ్చేసరికి తారక్‌ క్యారెక్టర్‌ కూడా లౌడ్‌గా అనిపిస్తుంది. అదే డల్‌నెస్‌ ఇంటర్వెల్‌ వరకు కొనసాగడంతో ఫస్ట్‌ హాఫ్‌ డిజప్పాయింట్‌ చేస్తుంది. 

కానీ అసలు బాణాసంచా అంతా ద్వితీయార్థానికి దాచుకుని పూరి జగన్నాథ్‌ దండయాత్ర అప్పుడు మొదలు పెట్టాడు. ఒకదాని తర్వాత ఒకటిగా సీన్లు బ్రహ్మాండంగా పేలడంతో పాటు బెస్ట్‌ సాంగ్స్‌ అన్నీ సెకండాఫ్‌లోనే ఉండడంతో ఇక రైజ్‌ అయిన టెంపరేచర్‌ డౌన్‌ కాకుండా క్లయిమాక్స్‌ వరకు కంటిన్యూ అయిపోయింది. మామూలుగా పూరి సినిమాల్లో సెకండ్‌ హాఫ్‌ వీక్‌గా ఉంటుంది. కానీ ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యే కంటెంట్‌ ఉంటే… పూరిలో సహజంగా కనిపించే ఫైర్‌కి తగ్గ మెటీరియల్‌ కుదిరితే ఇంపాక్ట్‌ ఎంత ఇంటెన్స్‌గా ఉంటుందో, ఎండ్‌ రిజల్ట్‌ ఇంకెంత ఎఫెక్టివ్‌గా ఉంటుందో ఈ చిత్రంలో తెలుస్తుంది. సినిమాలో ఫ్లాస్‌ ఉన్నాయి కానీ ఎన్టీఆర్‌ పర్‌ఫార్మెన్స్‌లో మాత్రం లోపాలేం లేవు. అవినీతిపరుడిగా పాత్రలోకి ఒదిగిపోయి… దానికి తగ్గ ఆహార్యంతో, వాచకంతో అదరగొట్టేసాడు. ఆ తర్వాత పరివర్తన వచ్చిన పోలీస్‌గా బాధ్యత నిర్వర్తించినపుడు కూడా అంతే గొప్పగా భావోద్వేగాలని చూపించి ఆకట్టుకున్నాడు. కోర్టు సీన్‌లో మొత్తం మాట్లాడేసిన తర్వాత, బోను దిగే ముందు ఒక ఎక్స్‌ప్రెషన్‌ ఇస్తాడు… తల చిన్న పంకిస్తూ. ఎన్టీఆర్‌ ఎంత గొప్ప నటుడనే దానికి నిదర్శనం ఆ చిన్న షాట్‌. 

తారక్‌లాంటి పెద్ద స్టార్‌కి ఇలాంటి పాత్ర చేయడం, అలాంటి క్లయిమాక్స్‌కి ఒప్పుకోవడం చాలా చాలా పెద్ద రిస్క్‌. ఏమాత్రం తేడా జరిగినా కానీ మొత్తంగా సినిమానే తేడా అయిపోయే ప్రమాదముంది. తమపై తమకి ఎంతో నమ్మకం ఉంటే తప్ప అంత సాహసానికి ఎవరూ ఒడికట్టరు. ఆ సాహసం చేయడమే కాదు… దానిని కన్విన్సింగ్‌గా చేసేసి శభాష్‌ అనిపించుకున్నాడు తారక్‌. పూరి జగన్నాథ్‌ ఇంకా పూర్తిగా ఫామ్‌లోకి రాలేదు కానీ ఖచ్చితంగా తన స్థాయికి, బ్రాండ్‌నేమ్‌కి తగ్గ అవుట్‌పుట్‌ ఇచ్చాడు. ముఖ్యంగా జగన్‌ రాసిన సంభాషణలు ఈ చిత్రానికి పెద్ద ప్లస్‌. 

Watch NTR Fans Public Talk

పోసాని కృష్ణమురళి చేసిన ‘ఆర్‌. నారాయణమూర్తి’ క్యారెక్టర్‌కి ఆర్‌. నారాయణమూర్తిని అనుకున్నారట. ఆయన చేసి ఉంటే నిజంగా టైలర్‌మేడ్‌ క్యారెక్టర్‌ అయ్యేది. పోసాని కూడా తనదైన శైలిలో ఈ పాత్రని పండించాడు. ఈ చిత్రానికి హీరో, విలన్‌ రెండూ ఎన్టీఆరే. ఆ రెండు షేడ్స్‌ ఉన్న పాత్రతో ఫ్రెండ్‌షిప్‌ చేసే బ్యాడ్‌ గై క్యారెక్టర్‌లో ప్రకాష్‌రాజ్‌ ఎంటర్‌టైన్‌ చేసాడు. జయప్రకాష్‌రెడ్డి కూడా వినోదానికి హెల్పయ్యాడు. కామెడీ కోసమని పెట్టిన అలీ, సప్తగిరి ట్రాక్‌ పేలకపోగా పేలవంగా తయారైంది. కోవై సరళ, రమాప్రభ సీన్లు కూడా దండగే అనిపిస్తాయి. మధురిమ, పవిత్ర లోకేష్‌, సోనియా అగర్వాల్‌ ఎమోషనల్‌ యాంగిల్‌కి ప్లస్‌ అయ్యారు. 

పూరి జగన్నాథ్‌ సినిమాల్లో ఉండే సిగ్నేచర్‌ ఎడిటింగ్‌ కట్స్‌, సినిమాటోగ్రఫీ ఇందులోను కనిపిస్తాయి. గోవాలో దాదాపుగా బీచ్‌ చుట్టు పక్కలే షూటింగ్‌ చేసేసినా కానీ ఎక్కడా క్వాలిటీ తగ్గలేదు. సినిమా రిచ్‌గానే కనిపిస్తుంది. లాజిక్కుల గురించి వెతికితే చాలా లూప్‌హోల్స్‌ దొరుకుతాయి. టిపికల్‌ కామెడీని కోరుకుంటే నిరాశ మిగుల్తుంది. మసాలా ఎంటర్‌టైన్‌మెంట్‌ కోరుకునే వారిని ఎమోషనల్‌ కంటెంట్‌ నిరుత్సాహ పరుస్తుంది. బలహీనతలు ఉన్నప్పటికీ ఎన్టీఆర్‌ అద్భుతమైన నటన, పూరి జగన్నాథ్‌ సంభాషణలు, కొన్ని క్లాప్స్‌ కొట్టించే సన్నివేశాలు ‘టెంపర్‌’ని చూడదగ్గ చిత్రంగా నిలబెట్టాయి. ఎన్టీఆర్‌ ఈమధ్య కాలంలో చేసిన సినిమాల్లో నిస్సందేహంగా ది బెస్ట్‌ ఇది. కమర్షియల్‌గా ఏ రేంజ్‌కి వెళుతుందనేది అన్ని వర్గాల ప్రేక్షకుల స్పందనపై డిపెండ్‌ అవుతుంది. రిజల్ట్‌ సంగతి అటుంచితే… పూరి జగన్నాథ్‌ చెప్పినట్టు ఈ సినిమా ఇంపాక్ట్‌ మాత్రం తారక్‌ ఫాన్స్‌పై చాలా కాలం ఉంటుంది. 

హైలైట్స్‌:

  • ఎన్టీఆర్‌ టాప్‌ క్వాలిటీ పర్‌ఫార్మెన్స్‌
  • డైలాగ్స్‌
  • పోలీస్‌ స్టేషన్‌, కోర్ట్‌ సీన్స్‌
  • టైటిల్‌ సాంగ్‌లో డాన్స్‌

డ్రాబ్యాక్స్‌:

  • ఎన్టీఆర్‌ – కాజల్‌ లవ్‌ ట్రాక్‌
  • ఫస్ట్‌ హాఫ్‌లో ఫోర్స్‌డ్‌ కామెడీ

బోటమ్‌ లైన్‌: ఎన్టీఆర్‌ నట విశ్వరూపం!

– గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

Video: Temper Movie Making