మన దేశంలో నిబంధనలు సామాన్యులకు, పేదలకేగాని ధనికులకు, పారిశ్రామికవేత్తలకు, ముఖ్యంగా రాజకీయ నాయకులకు వర్తించవు. వారు అన్నింటికీ అతీతులు. పారిశ్రామికవేత్తలు కోట్ల రూపాయల పన్ను ఎగ్గొట్టినా ఊరుకుంటారు. కాని సామాన్యుడు కరెంటు బిల్లు సకాలంలో కట్టకపోతే కనెక్షన్ కట్ చేస్తారు. బడా వ్యాపారులకు రాయితీలు ఇస్తారు. సామాన్యులపై పన్నుల భారం మోపుతారు. రాజకీయ నాయకులు ఏ నిబంధనలు ఉల్లంఘించినా అడిగే నాథుడు ఉండడు. కాని సామాన్యులు చిన్న నిబంధన ఉల్లంఘించినా నానా రచ్చ చేస్తారు. మన దేశంలో పెద్దలు ఏం చేసినా చెల్లుతుంది. వారు పెట్టుకున్న నిబంధనలు వారే పాటించరు. వారు చేసే చట్టాలు సామాన్యులు అనుసరించడానికి తప్ప వారికి వర్తించవు. ఇదంతా ఎందుకు చెప్పుకోవల్సి వచ్చిందంటే 401 మంది లోక్‌సభ సభ్యులు ఆస్తులు (అప్పులు కూడా) ప్రకటించలేదట…! నిబంధన ప్రకారం వారు లోక్‌సభకు ఎన్నికైన తొంభై రోజుల్లో ప్రకటించాలి. కాని చాలామంది ఆ పని చేయలేదు. ఎందుకు ప్రకటించలేదయ్యా? ఏమో…కారణాలు తెలియవు. నిన్ననే ప్రధాని నరేంద్ర మోదీ ఎన్‌డిఎ ఎంపీలందరికీ విందు ఇచ్చి ‘మనం ఆదర్శంగా ఉండాలి. భారీగా ఆలోచించాలి. రాజకీయాలకు అతీతంగా ప్రజా సేవ చేయాలి’ అంటూ సూక్తిముక్తావళి వినిపించారు. కాని నిబంధనల ప్రకారం ఆస్తులు, అప్పులు ప్రకటించని వారిలో బీజేపీ ఎంపీలే ఎక్కువగా ఉన్నారు. మరి వీరు ఎక్కువమంది ఎన్నికయ్యారు కదా…!
ఆస్తులు ప్రకటించని బీజేపీ ఎంపీలు 209 మంది ఉంటే, కాంగ్రెసువారు 31 మంది ఉన్నారు. బేజీపీ నేతల్లో పెద్ద తలకాయలు అనేకం ఉన్నాయి. కురువృద్ధుడు ఎల్‌కె అద్వానీ, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా అనేకమంది ఉన్నారు. కాంగ్రెసు ఎంపీల్లో ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ తదితరులు ఉన్నారు. మంత్రులు చాలా మంది ఉన్నారు. సామాన్యులు ఏదైనా ఓ పన్ను కట్టకపోతే కొంత గడువు ఇచ్చి ఫైన్‌తో కట్టాలంటారు. కాని..ఎంపీలు తొంభై రోజులు దాటాక కూడా ఆస్తులు ప్రకటించకపోతే అది ఏమీ తప్పు కాదన్నమాట. అసలు కొందరు ప్రకటించరు కూడా. ఏం చేస్తారు? నిబంధన అంటే తప్పనిసరిగా చేయాల్సిన పని అర్థం. కాని రాజకీయ నాయకులకు అది ఐచ్ఛికం. అంటే ఇష్టముంటే చేయొచ్చు. చేయకపోయినా ఏం కాదు. ఇదీ మన దేశంలో నీతి. ఈ రాజకీయ నాయకులే పొద్దున లేస్తే నీతులు చెబుతుంటారు. రెండు రోజుల కిందట కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ముంబయికి వచ్చి (శివసేనవారితో మాట్లాడటానికి) స్కూటర్ మీద తిరిగారు. ఆయన మంత్రి కదా…! స్కూటర్ మీద తిరగడమేమిటి? ఆయనకు కార్లు, కాన్వాయ్ గట్రా ఉంటాయి కదా అని ఆశ్చర్యపోతున్నారు కదా…! అలా ఆశ్చర్యపోవాలనే అమాత్యులు కొందరు ఇలాంటి పనులు చేస్తుంటారు.
సరే…ఆయన స్కూటర్ మీద తిరిగితే తప్పేమీ కాదు. కొంపలు మునగవు. కాని ఆయన హెల్మెట్ పెట్టుకోకుండా బండి నడిపారట…! ఇది నిబంధన ఉల్లంఘనే కదా…! ఇది సామాన్యులకు చిన్న విషయంగా కనిపించవచ్చు. కాని రాజకీయ నాయకులకు పెద్ద విషయమే. వెంటనే దిగ్విజయ్ అంతటి కాకలు తీరిన కాంగ్రెసు నేత ఘాటు విమర్శలు చేశారు. కారులో తిరిగే మంత్రి మీడియాకు ఫోజులివ్వడం కోసం స్కూటర్‌పై తిరిగుండొచ్చు. అలాంటప్పుడు హెల్మెట్ ఎక్కడి నుంచి తెస్తారు? అనే డౌటు రావొచ్చు. మంత్రి తలచుకుంటే హెల్మెట్లకు కొదవా? స్కూటర్ ఎవరిచ్చారో హెల్మెట్ వారే ఇస్తారు కదా…! కాని ఇక్కడ పాయింటు ఏమిటంటే తాను మంత్రిని కాబట్టి నిబంధనలు పాటించక్కర్లేదని గడ్కరీ అభిప్రాయం. కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్‌లో ఆ దేశ మాజీ హోం మంత్రినే ప్రయాణికులు విమానం నుంచి నెట్టేశారు. ఎందుకు? సమయపాలన కమ్ నిబంధనలు పాటించకుండా వ్యవహరించినందుకు.
విమానంలో దాదాపు మూడొందల మంది ప్రయాణికులున్నారు. వారంతా సమయానికి వచ్చి విమానం ఎక్కారు. కాని విమానం నిర్దేశిత సమయానికి బయలుదేరలేదు. ఆ తరువాత రెండు గంటలైనా కదలకుండా ఉండిపోయింది. కారణం…మాజీ హోం మంత్రి రహ్మాన్ మాలిక్ రావడం ఆలస్యమైంది. అంతే…ప్రయాణికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆయన్ని విమానం నుంచి వెళ్లగొట్టిందాకా వారు శాంతించలేదు. మన దేశంలో కూడా ఇలాంటి చైతన్యం రావాలి. 90 రోజుల తరువాత కూడా ఆస్తులు ప్రకటించని ఎంపీలు ఎవరున్నారంటూ ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద లోక్‌సభ సెక్రటేరియట్‌ను ప్రశ్నిస్తే 401 మంది ప్రకటించలేదని జవాబిచ్చారు. సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం తెలుసుకోవడం తప్ప ఏమీ చేయలేం. ని‘బంధనాలు’ సామాన్యులకు, పేదలకు తప్ప డబ్బున్నవారికి, రాజకీయులకు కాదు.