మధ్య శ్రీలంకలోని కొలంబోనుంచి ఉత్తర ప్రాంతంలోని జాఫ్నాకు రైలు మార్గం వేసి ఈ నెలలోనే రాజపక్స చేతుల మీదుగా ప్రారంభిస్తున్నారు. ఇది కొత్త మార్గం కాదు, పాతికేళ్ల కితం దాకా వున్న మార్గమే. తమిళ టైగర్లు 1990 ప్రాంతంలో దీన్ని తెగ్గొట్టేసి, ఉత్తర ప్రాంతాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. బయటినుంచి ఎవర్నీ రానీయలేదు. ఉత్తర, దక్షిణ ప్రాంతీయుల మధ్య రాకపోకలు తగ్గిపోవడంతో పరస్పర అనుమానాలు పెరిగిపోయాయి. సింహళులు, తమిళుల మధ్య శత్రుత్వం పెరిగింది. ఎల్‌టిటిఇని మట్టుపెట్టాక రాజపక్స ఇలాంటి అభివృద్ధి పనులు చేపట్టి ఉత్తర ప్రాంతంలో బహుళసంఖ్యలో వున్న తమిళులను ఇతర శ్రీలంకవాసుల సామాజిక స్రవంతిలోకి తీసుకువద్దామని ప్రయత్నం చేస్తున్నాడు. హరదారులు వేయడం, ప్రభుత్వ భవనాలు నిర్మించడం వంటి పనులు చురుగ్గా సాగుతూ వచ్చాయి. రైల్వే ట్రాక్ పునరుద్ధరణ వాటిలో ఒక ముఖ్యమైన ఘట్టం. దీనికి భారతప్రభుత్వం సహాయసహకారాలు అందించింది. ఇండియన్ రైల్వేస్ వారి సబ్సిడరీ అయిన ఐఆర్‌సిఓఎన్ ఓమాంతాయ్ నుండి పల్లాయి వరకు ట్రాక్ పని చేపట్టింది. ఈ ప్రాజెక్టుకై భారత ప్రభుత్వం 80 కోట్ల డాలర్ల ఋణం ఇచ్చింది. దీనివలన శ్రీలంక దక్షిణప్రాంతీయులు ఉత్తర కొస దాకా వచ్చేయవచ్చు. అక్కడ ఇండియా సహాయంతో నేవల్ బేస్, పోర్టు కడుతున్నారు. వారు ఇండియాకు వాణిజ్యబంధాలు పెంచుకోవచ్చు. ఉత్తరాన సారవంతమైన భూములున్నాయి, మంచి పంటలు పండుతాయి. అక్కడ తీరాల్లో అపారమైన మత్స్యసంపద లభిస్తుంది. వాటిని వేరే ప్రాంతాలకు రవాణా చేసి లాభసాటిగా అమ్ముకోవడానికి ఇన్నాళ్లూ వున్న అవరోధాలు ఈ రైలు, రోడ్డు మార్గాల ద్వారా తొలగిపోతాయి. అక్కడి ప్రజల ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది.
జాఫ్నాకు తొలి రైలు మార్గం 1905లో వేశారు. 1956లో ‘యాల్ దేవీ ఎక్స్‌ప్రెస్’ పేరుతో వేసిన రైలు శ్రీలంకలోని ఇతర ప్రాంతాల్లో పనిచేస్తూ వారాంతాలకు ఇంటికి వచ్చే జాఫ్నా వాసులకు చాలా అనువుగా వుండేది. దాన్నే ఎల్‌టిటిఇవారు ఆపించేశారు. ట్రాక్ ధ్వంసం చేశారు. ఇన్నాళ్లు పోయాక మళ్లీ రైలు పునఃప్రారంభమవుతోంది. పాతికేళ్లగా ఆ పట్టాల మీద నుంచి రైలేదీ నడవకపోవడంతో చుట్టుపక్కల గ్రామాల వాళ్లు ఆ పట్టాలను పట్టించుకోవడం మానేశారు. అటుగా రైలు వస్తుందన్న ధ్యాసే లేదు. ఇప్పుడు రైలు వేసిన తర్వాత ప్రత్యేకమైన హారన్లు ఏర్పాటు చేసి వాళ్లను హెచ్చరిస్తూ నడపాలని ఇంజనీర్లు నిశ్చయించుకున్నారు. సమాజంలో కొన్ని వర్గాల నిరాదరణకు గురైనప్పుడు కొందరు రాజకీయనాయకులు, తీవ్రవాదులు వాళ్ల పక్కకు చేరి వాళ్లను జనజీవితం నుండి వేరుపరుద్దామని చూస్తారు. అప్పుడే వారిని ప్రభావితం చేయడం, బెదిరించి గుప్పిట్లో తెచ్చుకోవడం వీలుపడుతుంది. అధికారంలో వున్న ప్రభుత్వం వెంటనే మేలుకుని, అక్కడికి రవాణా సౌకర్యాలు మెరుగుపరచి, వారి ఆర్థిక వ్యవస్థను మెరుగు పరిస్తే ఆటోమెటిక్‌గా ఆందోళన చల్లబడుతుంది. కేవలం శాంతిభద్రతల సమస్యగానే చూస్తే ఎప్పటికీ పరిష్కారం దొరకదు. తమిళుల విషయంలో రాజకీయ సంస్కరణలు కూడా చేపడతానని రాజపక్స హామీ ఇచ్చివున్నాడు. ఆర్థికంగా మెరుగు పరిచిన తర్వాతనే ఆ సంస్కరణలు అమలు చేయవచ్చు. ముందుగానే మొదలుపెడితే వేర్పాటువాదులు, కలిసి వుండడం వలన లాభం ఏముంది, విడిపోదాం అని దుర్బోధలు చేయవచ్చు. కలిసి వుండడం వలన జరిగే మేలు అనుభవంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి మాటలు ప్రజలు పట్టించుకోరు. మన ప్రభుత్వం కూడా గిరిజన ప్రాంతాల్లో ఇలాంటి విధానాలనే అమలు చేస్తే మావోయిస్టు సమస్యను అదుపులోకి తీసుకుని రావచ్చును.
ఎమ్బీయస్ ప్రసాద్