ఒక ముఖ్యమంత్రితో ముఖాముఖీ

నమస్తే సార్  Advertisement నమస్తే.. ఏ చానల్  నుంచి వచ్చారు? ఒకటేంటి సార్ అన్ని చానల్సూ నావే. అన్నీనా? నాకర్ధం కాలే. అంటే నేను మామూలు మనిషిని సార్- అంటే ఆం ఆద్మీ నన్నమాట.…

నమస్తే సార్ 

నమస్తే.. ఏ చానల్  నుంచి వచ్చారు?

ఒకటేంటి సార్ అన్ని చానల్సూ నావే.

అన్నీనా? నాకర్ధం కాలే.

అంటే నేను మామూలు మనిషిని సార్- అంటే ఆం ఆద్మీ నన్నమాట.

సెక్రటరీ.. ఇలాంటి ఆమాద్మీకి నన్ను ఇంటర్వ్యూ చేసేందుకు అనుమతి ఎందుకిచ్చావ్? వెంటనే బయటకు గెంటేసెయ్.

ఇప్పుడు గెంటటం కష్టం సార్.. ఈ వ్యవహారం అంతా  ఫేస్బుక్‌లో కోచ్చేస్తుంది. అదీగాక ఒకటే క్వస్చెన్ అడుగుతానంటున్నాడు.

అలాగా.. సరే సరే చెప్పండి.. ఏం కావాలి మీకు?

ఒకటే ఒక్క క్వస్చెన్ సార్. రైతుల ఆత్మ హత్యలు జరగకుండా మీరేం చర్యలు తీసుకుంటున్నారు?

రాష్ర్టంలో అన్ని సంస్థలకూ, అన్ని భవనాలకూ, అన్ని రోడ్లకూ, అన్ని నదులకూ, అన్ని ఉద్యానవనాలకూ, అన్ని ఆస్పత్రులకూ, అన్నివిమానాశ్రయాలకూ, అన్ని బాస్ స్టేషన్లకూ, అన్ని రైల్వే స్టేషన్లకూ నేను పెట్ట బోయే అన్ని సంక్షేమ కార్యక్రమాలకూ, రాబోయే అన్ని సైక్లోన్లకూ, అన్ని భూకంపాలకూ, అన్ని వరదలకూ కూడా  ఎన్టీఆర్ పేరు పెడుతున్నా.
నా కర్ధం కాలేదు సార్. నేనడిగింది రైతుల ఆత్మహత్య లెలా ఆపుతారు ? అని.

అదా.. వెరీ ఈజీ బాబూ. మా రాజదానిని సింగపూర్ తరహాలో నిర్మిస్తున్నా. 

సార్..  నేనడుగుతోంది రైతుల ఆత్మ హత్యల నివారణకు ఏం చర్యలు తీసుకో బోతున్నారని?

అదే చెప్తున్నా బాబూ.. ఆ చర్యల్లో భాగంగానే హుస్సేన్సాగర్‌కి రెండింతలు పెద్దదిగా ఉండే సరస్సుని రాజధానికి మధ్యలో నిర్మిస్తున్నా.

సార్ నేనడిగే ప్రశ్న మీరు అర్ధం చేసుకోవటం లేదు.

కాదు బాబూ.. నువ్వే సమస్యను అర్ధం చేసు కోవటంలేదు. మా రాజధానికి నందమూరి తారకరామారావ్ నగరం అని పేరు పెడుతున్నాం.

అదేమిటి సార్.. అమరావతి అని పేరు పెడతామని అన్నారుగా?

ఏం సెక్రటరీ.. నిజమేనా? అలా అన్నానా?

అవున్సార్.. మొన్నకరోజు పరధ్యానంలో ఉండి ఆ పేరు అనౌన్స్ చేసారు.

ఐతే ఓకే.. తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ నగరంగా పేరు మార్చేయవచ్చులే. ఆ! మీ ప్రశ్నకు సమాధానం దొరికిందాబాబూ?

ఎక్కడ దొరికిన్దిసార్.. రైతుల ఆత్మహత్యలు ఎలా నివారించ బోతున్నారు?

అదే బాబూ.. జూన్‌లో మెట్రో రైల్ స్టార్ట్ చేస్తున్నా.

అబ్బా.. నేనడిగేది.

తెలుసు.. త్వరలోనే షాంఘై నగరం టైప్‌లో ఇండస్ట్రియల్ సిటీ డెవలప్ చేస్తున్నా.

సార్.. నా ప్రశ్నకు కరెక్ట్‌గా సమాధానం చెప్పటం లేదు. అసలు పదవిలో కొచ్చాక ఒక్క డెసిషన్ కూడా తీసు కోలేదు. అందుకే కాబోలు  మొన్న టైమ్స్ పేపర్లో ఫలానా ముఖ్యమంత్రి అదివరకటిలాగా ఫాస్ట్‌గా ఏమీ చేయలేక పోతున్నాడు అని రాసారు సార్.

ఆమాట రాంగ్.. అదివరకు ఫాస్ట్ గా డెసిషన్ తీసుకుని హైటెక్ సిటీ కట్టించి నన్ను నమ్ముకున్న రియల్ ఎస్టేటోళ్ళందరికీ కోట్లు సంపాదించుకునే అవకాశం ఇచ్చాను. ఇప్పుడుకూడా రాజధాని వంకతో రెండు పంటలు పండే ఫర్ టైల్ భూములన్నీ బలవంతంగా లాగేసుకుని రియల్ ఎస్టేట్ వాళ్ళకు సాయం చేస్తున్నాను. అంతేకాదు.. అప్పట్లో హైదరాబాద్‌లో ప్రప్రధంగా  ప్రభుత్వ భూములన్నీ ప్రైవేటోళ్ళకు ధారాదత్తం చేసిన ఘనత నాదే! నన్ను ఫాలో అయ్యే రాజశేఖర రెడ్డి నన్ను వెయ్యింతలు మించిపోయి మొత్తం హైదరాబాద్‌ని అమ్మేశాడు. ఇప్పుడు కూడా నేను అదే పద్దతిలో తమిళనాడు యోగా గురువుకి 400 ఎకరాలు అమ్మేస్తున్నాను. అదిగాక ఇంకో 1000 ఎకరాలు కూడా…

సార్.. నా ప్రశ్న కొంచెం అర్ధం చేసుకోండి సార్.. నేనడిగేది రైతుల ఆత్మహత్యలను ఎలా ఎదుర్కోవాలనుకున్టున్నారు?

అరే.. నీకేం తెలివుందా లేదా? నేను చేస్తున్నవన్నీ రైతు ఆత్మ హత్యలు ఆపడానికే గదా? నీలాంటి డల్ హెడ్స్‌కి ఎలా అర్ధమౌతుందా సంగతి?

ఏంటిసార్? మీరు చేసేవన్నీ రైతుల ఆత్మహత్యలు ఆపడానికేనా.. మీ మాటలు కొంచెం వివరంగా చెప్తారా సార్.

అదేనయ్యా.. రైతుల భూము లన్నీ లాక్కుని రాజధాని కడుతున్నా కదా.. అలాగే వేల ఎకరాలు యోగా గురూలకీ, ఇండస్ట్రీల పేరుతో రియల్‌ఎస్టేట్ దందాలు చేసే వాళ్ళకీ, దిక్కు మాలిన యూనివర్సిటీలకీ ధారాదత్తం చేసేస్తున్నా కదా! ఆ భూములన్నీ పోతే ఇంకా రైతు లెక్కడ ఉంటారయ్యా? మరి రైతులే  లేనప్పుడు ఇంకా ఆత్మహత్యలు ఎక్కడున్టాయ్? ఆ విధంగా రైతుల ఆత్మహత్యలకు ఆనకట్ట వేసి ముందుకు పోతాం.. రైతుల్ని కూడా మనతో ముందుకు తీసుకుపోదాం. రామ రాజ్యమూ.. రైతుల్లేని రాజ్యమూ అని పాడుకుందాం. దేశానికి అన్నపూర్ణగా ఉన్న రాష్ట్రాన్ని.. పూర్ణ కరువు రాష్ర్టంగా పేరు మార్చేద్దాం. ఇప్పుడర్ధమయిందా? 

ఆహా! ఎంత గొప్ప తెలివి సార్ మీది? దేశంలో ఎవడికీ రాని గొప్ప అయిడియా మీకు వచ్చిందంటే మీరు చాలా గ్రేట్ సార్. మీ రొక్క సారి లేచి నుంచుంటే మీ కాళ్ళు మొక్కుతా సార్! నేనే  కాదు.. నన్నడిగితే మొత్తం తెలుగు ప్రజలంతా మీ కాళ్ళు మొక్కాలి సార్.

సెక్రటరీ.. ఈ కాళ్ళు మొక్కే వాళ్ళతో చెప్పు! అలా మొక్కిన్చుకునే ఆయన ఇప్పుడు లేడు అని.

యర్రంశెట్టి సాయి