ఇంగ్లండ్ నుంచి వచ్చిన ‘‘ప్రియురాలు పిలిచింది’’

హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలను తయారు చేసుకొనే దర్శకులు ఇండియాలో కోకొల్లలుగా ఉన్నారు. హిందీ, తమిళ, తెలుగు ఇండస్ట్రీలేవీ అలాంటి స్ఫూర్తులకు కాపీలకు మినహాయింపు కాదు. కొందరు ఎలాంటి మొహమాటాలకూ పోకుండా…

హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలను తయారు చేసుకొనే దర్శకులు ఇండియాలో కోకొల్లలుగా ఉన్నారు. హిందీ, తమిళ, తెలుగు ఇండస్ట్రీలేవీ అలాంటి స్ఫూర్తులకు కాపీలకు మినహాయింపు కాదు. కొందరు ఎలాంటి మొహమాటాలకూ పోకుండా సినిమాలను కాపీ కొట్టేస్తే.. మరికొందరు మసిపూసి మారేడు కాయ చేస్తారు. ఇంకొందరు తెలివి మీరిన వారు హాలీవుడ్ నుంచి ఇంకా లోతులకు వెళ్లి కొరియన్ సినిమాలను, స్పానిష్ సబ్జెక్టులను కూడా ఎత్తుకొచ్చి ఇక్కడ సినిమాలను చుట్టేస్తూ ఉంటారు. ఇలాంటి వారి కన్నా తెలివి మీరిన వారు కొందరున్నారు. వీరు ఆంగ్ల సాహిత్యంలోకి వెళ్లి కథలను తెచ్చుకొన్నారు. అందమైన సాహిత్యాన్ని అందమైన సినిమాలుగా మలిచిన వారు వీరు. అలాంటి వారిలో ఒకరు రాజీవ్ మీనన్. ఆయన మలిచిన సినిమా ‘‘ప్రియురాలు పిలిచింది’’

1811 నాటి కథ అది. ఒక జమీందారి కుటుంబం నుంచి వచ్చి కష్టాలను ఎదుర్కొంటూ మగ్గురు అమ్మాయిలతో లండన్ హహానగరంలో ఒక మహిళ సాగించిన ప్రయాణం. వారీ జీవితాలు ఒక ఒడ్డుకు చేరే కథనం. ‘‘ఏ లేడీ’’ అనే పేరుతో ప్రఖ్యాత ఆంగ్ల రచయిత జాన్ అస్టిన్ రచించిన నవల ‘‘సెన్స్ అండ్ సెన్సిబులిటీ’’ ప్రపంచ సాహిత్యంలో ఈ నవలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అద్భుతమైన డ్రామాతో.. సాగే ఈ నవల వందల సంత్సరాలు గడుస్తున్నా పాఠకుల ఆదరణను అయితే ఏనాడూ కోల్పోలేదు. కొత్తతరం పాఠకులకు ఈ నవల సుపరిచితం అయినదే.

యుక్తవయసుకు వచ్చి.. ప్రేమ, పెళ్లిళ్ల మీద గాలి మళ్లిన అమ్మాయిలు. ఒక అమ్మాయికేమో బాధ్యతగా చూసుకొనే మొగుడొస్తే చాలు అనే ఆలోచన. మరో అమ్మాయికి అందమైన కలలు. రాకుమారుడి లాంటి మొగుడు రావాలి. అందమైన కవిత్వం చెప్పాలి. ఉరుములు.. మేఘాలు అన్నీ కావాలి! వీళ్ల జీవితాల్లోకి అనుకోకుండా వచ్చే ఒక అవిటి సైనికుడు.. ఒక డ్రామా డైరెక్టర్.. ఒక వ్యాపారవేత్త. ఇంతలో తండ్రిలేని ఆ కుటుంబాన్ని చుట్టుముట్టే కష్టాలు. జీవితాల్లోని పలు మలుపులు. చివరకు కథ సుఖాంతం. జాన్ అస్టిన్  రచనలోని ఈ మూల కథను యథాతథంగా తీసుకొని.. రెండువందల సంవత్సరాల తర్వాతి పరిస్థితుల మధ్య.. కథను తమిళ కుటుంబ నేపథ్యంగా మార్చి అద్భుతమైన ట్రీట్ మెంట్‌తో సినిమాను రూపొందించాడు రాజీవ్ మీనన్.

ఈ విషయంలో ఆయనకు రచయిత ‘‘సుజాత’’ సహకారం ఉంది. తమిళంలో ప్రసిద్ధ రచయిత, నవల కారుడు అయిన రంగరాజన్ ‘‘సుజాత’’గా ఫేమస్. దర్శకుడు మణిరత్నం వంటి వారికి సుజాత చాలా ఇష్టుడు. తమ సినిమాలకు కథా చర్చల్లో సుజాత లేకుండా మణి, రాజీవ్ మీనన్ వంటి వాళ్లు ముందుకెళ్లే వారు కాదు. కొంతకాలం క్రితం సుజాత మరణించారు. 

2000 సంవత్సరంలో ‘‘కండుకోండయన్ కొండుకోండయన్’’ పేరుతో ‘‘సెన్స్ అండ్ సెన్సిబులిటీ’’ నవలను సినిమాగా మార్చారు. భారీ తారగణం.. మమ్ముట్టి, అజిత్ కుమార్, ఐశ్వర్యరాయ్, టబు, అబ్బాస్… సంగీతం ఏఆర్ రెహమాన్. సినిమాటో గ్రఫీ రవి కే చంద్రన్. ఇలా పేరున్న టీమ్‌తో ఈ సినిమా పట్టాలెక్కెంది.

మొదట ఈ సినిమా ఐశ్వర్యరాయ్ పాత్రకు సౌందర్యను అనుకొన్నారు. అయితే ఆమె బిజీగా ఉండటంతో చివరకు ఆ అవకాశం ఐశ్వర్యరాయ్‌కు దక్కింది. దక్షిణాదిలో ఐష్ కు ఇదొక మెమో!  భారీ బడ్జెట్ తోనే రూపొందించిన ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచింది. మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా నిలిచింది. 

ప్రత్యేకించి టబు.. అజిత్ కుమార్‌ల మధ్య ప్రేమ సన్నివేశాలు ఏ మనసును అయినా హత్తుకొంటాయి. ఇక ఇలాంటి ఎక్కడా బోర్ అనిపించని.. ఆకట్టుకొనే డ్రామా ఆవిష్కృతం అయ్యే సినిమాలు చాలా అరుదుగా ఉంటాయి. బహుశా ఆ గొప్పదనం ‘‘సెన్స్‌అండ్ సెన్సిబుల్’’ నవలదే కావొచ్చు. దాన్ని సినిమాగా మరుస్తూ క్యారీ చేసిన రచయిత, దర్శకులకు కూడా కొంత వాటాను ఇవ్వొచ్చు. 

ఈ సినిమా తమిళ వెర్షన్ అబ్బాస్ పాత్రకు విక్రమ్ డబ్బింగ్ చెప్పాడు. అప్పటికి ఇంకా నటుడిగానిలదొక్కుకొనే ప్రయత్నాల్లో ఉన్న విక్రమ్ ఇలా అనేక మంది హీరోలకు డబ్బింగ్ చెప్పేవాడు. మ్యూజిక్ పరంగా ఈ సినిమా ఒక సంచలనం. ఇప్పటికీ ఈ సినిమా పాటలు ఏమూలో వినిపిస్తూనే ఉంటాయి. ఈ సినిమాతో శంకర్ మహదేవన్‌కు ఉత్తమగాయకుడిగా జాతీయ అవార్డు కూడా దక్కింది. 

ఇంకా విశేషాలు ఏమిటంటే.. జాన్ అస్టిన్ నవల ‘‘సెన్స్ అండ్ సెన్సిబులిటీ’’ని ఆధారంగా చేసుకొని వచ్చిన సినిమా ఇది ఒకటి మాత్రమే కాదు! హాలీవుడ్ లోనే ఈ నవలను ఆధారంగా చేసుకొని మూడునాలుగు సినిమాలు వచ్చాయి. టీవీ సీరియల్‌గా కూడా రూపొందించారు ఆ కథాంశాన్ని. ‘ప్రియురాలు పిలిచింది’ సినిమాను ఇదే తారగణంలో ఇంగ్లిష్‌లో కూడా రూపొందించారు. దానికి స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేశారు. ఈ రొమాంటిక్ డ్రామాను స్ఫూర్తిగా హిందీలో కూడా కొన్ని సినిమాలు వచ్చాయి. నవలలోని కొన్ని ఎపిసోడ్ లనే కాపీ కొట్టిన వారున్నారు. ఈ కథను యథాతథంగా వాడేసుకొంటూ హిందీలో టీవీ సీరియల్స్ కూడా రూపొందాయి!

ఇలా ఎంతమంది ఎలా వాడుకొన్నా.. ఎలా చూపించినా.. ఆ నవలలో ఆకట్టుకొనేంత విషయం ఉంది. ఏ మనిషిని అయినా సున్నితంగా స్పృశించగల సృజన ‘‘సెన్స్ అండ్ సెన్సిబులిటీ’’