టీమిండియా చెత్త ‘ప్రాక్టీస్‌’.!

క్రికెట్‌లో పసికూనలుగా పిలవబడే జట్లు ఒక్కోసారి బలమైన జట్లను మట్టి కరిపిస్తుంటాయి. అందుకనే, ఏ మ్యాచ్‌నీ ఏ టీమ్‌ కూడా లైట్‌ తీసుకునే పరిస్థితి వుండదు. వరల్డ్‌ కప్‌ పోటీల విషయంలో ఇంకా జాగ్రత్తగా…

క్రికెట్‌లో పసికూనలుగా పిలవబడే జట్లు ఒక్కోసారి బలమైన జట్లను మట్టి కరిపిస్తుంటాయి. అందుకనే, ఏ మ్యాచ్‌నీ ఏ టీమ్‌ కూడా లైట్‌ తీసుకునే పరిస్థితి వుండదు. వరల్డ్‌ కప్‌ పోటీల విషయంలో ఇంకా జాగ్రత్తగా వుంటుంది ఏ జట్టు అయినాసరే. ప్రాక్టీస్‌ మ్యాచ్‌ కదా.. అని లైట్‌ తీసుకుంటే, ఆ నిర్లక్ష్యం రెగ్యులర్‌ మ్యాచ్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది.

ఇక, అసలు విషయానికొస్తే పసికూన ఆఫ్ఘనిస్తాన్‌పై టీమిండియా విజయం సాధించింది. మామూలుగా అయితే టీమిండియా విజయాన్ని ఘనవిజయంగా పేర్కొనాలి. కానీ, 50 ఓవర్లలో ఆఫ్ఘనిస్తాన్‌ని ఆలౌట్‌ చేయలేకపోయారు భారత బౌలర్లు. 50 ఓవర్లలో ఆప్ఘనిస్తాన్‌ 8 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. అంతకు ముందు బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 364 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ భారీ సెంచరీ నమోదు చేశాడు. రైనా, రెహానే దుమ్మురేపారు.

భారీ టార్గెట్‌ని ప్రత్యర్థి ముందు వుంచడంలో సఫలమైన టీమిండియా, బౌలింగ్‌లో మాత్రం మునుపటి చెత్త ఫామ్‌నే కొనసాగించింది. ఆఫ్ఘనిస్తాన్‌ లాంటి పసి కూననే ఆలౌట్‌ చేయలేకపోయిన టీమిండియా బౌలర్లు, రెగ్యులర్‌ మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, శ్రీలంక వంటి హేమా హేమీ జట్లతో తలపడిత పరిస్థితి ఎలా వుంటుందో ఊహించుకోవడమే కష్టం.

రోహిత్‌ శర్మ హిట్టయితే.. కోహ్లీ ఫామ్‌లోకొస్తే.. రైనా సరిగ్గా ఆడితే.. ఇలా అంచనాలు వేసుకోవడం తప్ప, టీమిండియా వరల్డ్‌కప్‌లో సమిష్టిగా సక్సెస్‌ అవుతుందనే ధీమా భారత క్రికెట్‌ అభిమానుల్లో కలగడంలేదు. ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో టీమిండియా గెలిచినా, ఈ మ్యాచ్‌ తర్వాత భారత క్రికెట్‌ అభిమానుల్లో ధీమా కలగలేదు సరికదా, మరింత భయం పెరిగింది.