ఆప్‌ విజయం ఏపీపై ప్రభావం చూపుతుందా?

ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) దేశ రాజధాని ఢిల్లీలో అనూహ్యమైన ఘన విజయం సాధించడం దేశ ప్రజలను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలను మించి అపూర్వమైన విజయం సాధించడం ఆప్‌ నేతలను కూడా బిత్తరపోయేలా…

ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) దేశ రాజధాని ఢిల్లీలో అనూహ్యమైన ఘన విజయం సాధించడం దేశ ప్రజలను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలను మించి అపూర్వమైన విజయం సాధించడం ఆప్‌ నేతలను కూడా బిత్తరపోయేలా చేసింది.  ప్రజాస్వామ్యంలో  ఎంతటి ‘పవర్‌’ ఉందో ఆప్‌ విజయం స్పష్టం చేసింది. ‘మొక్కే కదా అని పీకిపారేస్తే పీక తెగుతుంది’ అనే డైలాగ్‌ మాదిరిగా ఆప్‌ విజయాన్ని భాజపా తక్కువ అంచనా వేస్తే భవిష్యత్తులో దాని చాప కిందికి నీరు రాక తప్పదు. ఆప్‌ ఇంతటి ఘన విజయం ఎలా సాధించింది? భాజపాలో ప్రధాని నరేంద్ర మోడీ ఛరిష్మా ఏమైపోయింది? అనే చర్చ ఇంకా కొంతకాలం సాగుతూనే ఉంటుంది. ఇక అసలు విషయానికొస్తే…ఢిల్లీలో ఆప్‌ ఘన విజయం లేదా భాజపా ఘోర పరాజయం ప్రభావం ఆంధ్రప్రదేశ్‌ మీద ఎంత వరకూ పడుతుందనేది ఇప్పుడు చర్చనీయాంశం కాకతప్పదు. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో వేళ్లూనేకునేందుకు భాజపా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఏమిటా ప్రయత్నాలు? ఇతర పార్టీల నుంచి నాయకులను భాజపాలోకి రప్పించడం. ఆంధ్రలో ఇది ఇన్నాళ్లూ జోరుగా సాగుతుండటంతో అక్కడ భాజపా`టీడీపీ స్నేహ వారధికి బీటలు పడటం ప్రారంభమైంది. ఈ రెండు పార్టీలు పైకి మిత్రపక్షాలుగా కనబడుతున్నా అనేక లుకలుకలున్నాయి. నరేంద్ర మోడీ నాయకత్వ పటిమకు, వాగ్ధాటికి, ఆయన విజన్‌కు, ఆయన రాజకీయ మెస్మరిజానికి అనేకమంది నాయకులు డంగైపోయారు. భాజపాతో ప్రేమలో పడిపోయారు. పోలోమంటూ కాషాయ పార్టీలోకి క్యూ కట్టారు. భాజపాలో చేరినవారిలో కాంగ్రెసు, టీడీపీ, వైకాపా నాయకులున్నారు. భాజపా వలసనలు ప్రోత్సహిస్తుండటం టీడీపీకి ఇబ్బందిగా మారింది.

భాజపా జోరు చూస్తుంటే వచ్చే ఎన్నికలనాటికి టీడీపీతో తెగదెంపులు చేసుకొని ఆంధ్రప్రదేశ్‌లో ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి రావాలనే ఆలోచన చేస్తోంది. అప్పుడప్పుడు రెండు పార్టీల నాయకులు సూటిపోటి మాటలు అనుకున్న సంఘటనలూ ఉన్నాయి. రెండుమూడు సందర్భాల్లో టీడీపీ మంత్రులు భాజపాపై నోరు జారడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు క్లాసులు కూడా పీకారు. భాజపా ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు హరిబాబు కూడా అవసరమైతే టీడీపీతో తెగదెంపులు చేసుకుంటామనే తరహాలో మాట్లాడారు. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్‌కు ఏ మాత్రం ఆర్థిక సాయం చేయకుండా, ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం నిలువునా ముంచడంతో చంద్రబాబు కూడా లోలోపల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ పక్క ప్రజలను ఆకట్టుకోవడానికి ఆయన భారీ హామీలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ను భూతల స్వర్గం చేస్తాననే విధంగా మాట్లాడుతున్నారు. సింగపూర్‌, జపాన్‌ వారిని పిలిపించి ప్రపంచంలోనే అత్యద్భుతమైన రాజధాని నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ‘ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు కూడా డబ్బులు లేవు’ అని చెప్పిన చంద్రబాబు ఉద్యోగులను సంతృప్తి పరిచేందుకు తెలంగాణతో సమానంగా 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిరది. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగుల ఆగ్రహం కారణంగా అధికారం కోల్పోయిన బాబు వారికి తన పట్ల వ్యతిరేకత పెరగకుండా చూసుకుంటున్నారు. ఇదిలా ఉంటే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సహా ఢిల్లీలోని మంత్రులంతా ఆంధ్రప్రదేశ్‌ విషయంలో మాటలు చెబుతూ కాలం గడుపుతున్నారు తప్ప పైసా విదిలించడంలేదు. ప్రత్యేక మోదా విషయంలో ఒక్కోరోజు ఒక్కోవిధంగా మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు భాజపా, దాని నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా అన్యాయం చేస్తున్నాయనే విషయం ప్రజలకు అర్థమైపోయింది.

రాష్ట్రానికి కనీసం పదేళ్లపాటు ప్రత్యేకహోదా ఇవ్వాలని ఆనాడు పార్లమెంటులో భాజపా తరపున గట్టిగా పోరాడిన వెంకయ్య నాయుడు ఇప్పుడు పిల్లిమొగ్గలు వేస్తుండటం  ప్రజల్లో అసహనం పెంచుతోంది. చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని ఏమీ అనలేక ఆ కోపాన్ని మంత్రులపై చూపిస్తున్నారు. నిధుల కోసం తానొక్కడినే ఢిల్లీకి తిరుగుతున్నానని, మంత్రులు ఏం పట్టనట్లుగా ఉంటున్నారని ఈమధ్య వారికి క్లాస్‌ తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేస్తున్నా భాజపా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవాలని కోరుకుంటున్నారని ఈమధ్య ఓ పత్రిక తన విశ్లేషణలో రాసింది. చివరకు అదే జరగడం ఆశ్చర్యకరంగా ఉంది. ఢిల్లీ ఎన్నికల్లో భాజపా ఘోర పరాజయం తరువాత ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీలోకి వలసలు కొనసాగుతాయా? అనేది ఇప్పుడు కీలక ప్రశ్న. ఈమధ్య వెంకయ్య నాయుడికి ప్రభు భక్తి ముదిరిపోయి ‘ఈ దేశాన్ని బాగుచేయడానికి దేవుడే మోడీని ప్రధానిగా పంపాడు’ అని వ్యాఖ్యానించారు. అలా దేవుడు పంపిన మోడీ వ్యక్తిగత ప్రతిష్ట ఢిల్లీ ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్నది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ తీవ్రంగా ప్రచారం చేశారు. వాస్తవానికి ఢిల్లీ ఎన్నికలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి స్థానిక ఎన్నికల కింద లెక్క. కాని మోడీ అలా భావించలేదు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ ప్రధాని స్వయంగా అందులోనూ తీవ్రంగా ప్రచారం చేయడం ఇదే ప్రథమం. అయిన్పటికీ ఫలితం శూన్యం. భాజపా రూ.50 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. 

భాజపా నాయకులు ఆప్‌ విజయాన్ని తేలిగ్గా తీసుకుంటున్నప్పటికీ దీని ప్రభావం దక్షిణాదిపై ప్రధానంగా తాను ఎదగాలనుకుంటున్న, మిత్ర పక్షమైన టీడీపీ అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణపై కూడా పడుతుంది. ఢిల్లీ ఊపుతో ఆప్‌ దక్షణాదిలో విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఢిల్లీ పక్కనే ఉన్న పంజాబ్‌లోనూ 2017లో జరిగే ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఆప్‌ ధీమాగా ఉంది. అక్కడా ఢిల్లీ ఫలితాలు పునరావృతమైతే ఆంధ్రప్రదేశ్‌లో భాజపా-టీడీపీ స్నేహానికి గట్టి విఘాతం కలుగుతంది. 

-ఎం.నాగేందర్‌

[email protected]