ఉత్తరాంధ్రా జిల్లాలలోనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాలలో సింహాచలం వరాహ నరసింహ స్వామి వారి ఆలయానికి ఎంతో ఖ్యాతి ఉంది. సింహాద్రి అప్పన్నకు ఏడాదికి ఒకసారి చందనోత్సవం జరుగుతుంది. దాంతో భక్తులకు స్వామి నిజరూప దర్శనం చూసే భాగ్యం లభిస్తుంది.
కన్నుల వేడుకగా సాగే ఈ పండుగ కోసం భక్తులు అంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తారు. అయితే కరోనా కారణంగా 2020, 2021లలో స్వామి వారి చందనోత్సవం ఏకాంతానికే పరిమితం అయింది. ఈసారి అలాంటి ఆటంకాలు లేనందువల్ల వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
దాంతో భక్తులు పెద్ద ఎత్తున పొట్టెత్తారు. ఒక్క ఏపీ నుంచే కాదు, ఒడిషా నుంచి కూడా భక్తజనం తరలివచ్చారు. దాంతో స్వామిని దర్శించుకునే వారి సంఖ్య ఈ ఏడు రెండు లక్షలకు పైదాటిపోతోంది అన్న అంచనాలు ఉన్నాయి. ఇక టికెట్ల రూపంలోనే కేవలం ఒక్క రోజులోనే రెండున్నర కోట్ల రూపాయల ఆదాయం ఆలయానికి వస్తుందని అంచనా వేస్తున్నారు.
ఇక టీడీపీ జమానా తరువాత మళ్ళీ ఆలయన వంశపారంపర్య ధర్మకర్త హోదాలో పూసపాటి అశోక్ గజపతి రాజు స్వామిని దర్శించుకుని తొలిపూజ నిర్వహించడం కూడా విశేషం. అప్పన్న దర్శనం కోసం ఈసారి ఇరవై వేల మంది దాకా వీఐపీలే క్యూ కడుతున్నారు అంటే కూడా భక్తుల తాకిడి ఎలా ఉందో అర్ధం చేసుకోవాల్సిందే.
ఇదిలా ఉండగా స్వామి నిజరూప దర్శనం ఒక్క రోజుకే పరిమితం చేయకుండా కనీసం వారం రోజుల పాటు అయినా నిర్వహిస్తే సామాన్య భక్తులందరికీ న్యాయం జరుగుతుందని సూచనలు వస్తున్నాయి. మరి ఆలయ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.