కేసీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ను మరో ఎంజీఆర్ తో పోల్చారు. ఎంజీఆర్ మరణించిన తర్వాత ఆయన స్థాపించిన పార్టీ ముక్కలైంది. తలో పార్టీ పెట్టుకున్నారు. అదే విధంగా వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయిన తర్వాత టీఆర్ఎస్ కూడా అలా ముక్కచెక్కలవుతుందన్నారు రేవంత్ రెడ్డి.
టీఆర్ఎస్ లో ఇప్పటికే చాలా వర్గాలున్నాయని, ఆ పార్టీ ఓడిపోతే ఒక్కో వర్గం ఒక్కో దిక్కు చూసుకుంటుందన్నారు. నిజంగానే టీఆర్ఎస్ లో అన్ని వర్గాలున్నాయా?
టీఆర్ఎస్ లో అసంతృప్తులు ఉంటారే కానీ, వర్గాలు ఉండవు అనేది ఇప్పటి వరకూ అందరికీ తెలిసొచ్చిన సత్యం. నాటి ఆలె నరేంద్ర దగ్గర్నుంచి, ఆ తర్వాత విజయశాంతి, నిన్న మొన్నటి ఈటల రాజేందర్ వరకు.. అందరూ కేసీఆర్ తో విభేదించిన వారే. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి అంటూ నిలబడింది మాత్రం కేసీఆరే.
ఇప్పటికీ టీఆర్ఎస్ లో కేసీఆర్ పాలన, ఆయన కుటుంబ పెత్తనం నచ్చనివారు ఉంటారేమో కానీ ఎక్కడా బయటపడరు. బయటపడితే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు.
కేసీఆర్ తర్వాత పరిస్థితి ఏంటి..?
గెలిచిన వాడు చెప్పాలి, ఓడినవాడు వినాలి. ఈ ఫార్ములా ప్రకారం కేసీఆర్ కి తిరుగులేదు. పొరపాటున మెజార్టీ తగ్గినా, ఒకవేళ ఓడిపోయినా అప్పుడు టీఆర్ఎస్ లో తిరుగుబాటు తప్పదు. తెలంగాణ ఏర్పాటైన కొత్తలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలు అధికార పార్టీ టీఆర్ఎస్ వైపు చూశారో.. 2023 ఎన్నికల్లో ఏమాత్రం తేడా జరిగినా.. టీఆర్ఎస్ కి కూడా అదే గతిపడుతుందనడంలో అనుమానం లేదు.
అప్పుడు ప్రజాభీష్టం మేరకు, ప్రజోపయోగం కోసం పార్టీ మారామన్నవారు ఇప్పుడు కూడా అదే మాటపై నిలబడ్డామని ఎమ్మెల్యేలు, నేతలు చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇటీవల తప్పనిసరి పరిస్థితుల్లో మేనల్లుడు హరీష్ రావుకి అవకాశాలిస్తున్నారు కేసీఆర్. ఈటల నిష్క్రమణ తర్వాతే హరీష్ కి పార్టీలో మళ్లీ మంచి రోజులొచ్చాయనే సంగతి అందరికీ తెలిసిందే.
అంతకంటే ముందు కేసీఆర్ కు, హరీష్ ఎదురెళ్తారనే ప్రచారం బాగా జరిగింది. తర్వాత ఆ ప్రచారాన్ని హరీష్ ఖండించారు, అది వేరే విషయం. ఆ ప్రచారమే నిజమైతే పరిస్థితేంటి? ఇప్పుడు హరీష్ జై కేసీఆర్ అన్నారు సరే.. 2023 ఫలితాల తర్వాత ఎంతమంది అలా జై కొడతారనేది ఆలోచించాల్సిన అంశం.
ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకున్న తర్వాత.. స్వయంగా ఎన్టీఆరే ప్రజల ముందుకొచ్చి పార్టీ నాది అన్నా కూడా ఫలితం లేకపోయింది. అన్న టీడీపీ, ఎన్టీఆర్ టీడీపీ.. ఇలా రకరకాల బ్రాంచ్ లు పెట్టుకున్నా కూడా అంతిమంగా టీడీపీకే జనం మద్దతిచ్చారు.
తమిళనాడులో ఎంజీఆర్ తర్వాత అన్నాడీఎంకేపై పెత్తనం కోసం చాలామంది ప్రయత్నించినా అంతిమంగా జయలలితే విజయం సాధించారు.
తెలంగాణలో పరిస్థితి అంతదూరం వస్తుందని అనుకోలేం. కేసీఆర్ మాట జవదాటేవారు ఎవరూ లేరు, ఉన్నా వారిని ముందుగానే గుర్తించి బయటకు పంపేస్తుంటారు. సో.. వినయ విధేయ రాములే టీఆర్ఎస్ లో ఉంటారు. 2023లో టీఆర్ఎస్ కి ఎదురు దెబ్బ తగిలితే మాత్రం.. రేవంత్ రెడ్డి జోస్యాన్ని కొట్టిపారేయలేం.