జగన్ జనాల్ని బాదేస్తున్నారని చెప్పడం చంద్రబాబు ఉద్దేశం, అన్ని రకాలుగా ప్రజల్ని జగన్ ఇబ్బంది పెడుతున్నారని చెప్పడం కోసం బాదుడే బాదుడు అనే టైటిల్ తో నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
ఇప్పటికే జిల్లాల్లో ఈ టైటిల్ తో టీడీపీ నాయకులు రోడ్డెక్కారు. రేపట్నుంచి శ్రీకాకుళం జిల్లా నుంచి చంద్రబాబు స్వయంగా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అంతా బాగుంది కానీ, బాదుడే బాదుడు అనే టైటిల్ తో చంద్రబాబు జనాల్లోకి వెళ్తే, ప్రజలు మరోలా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది.
బాబు హయాంలో జరిగిన అరాచక పాలనను బాదుడే బాదుడు అనే స్లోగన్ తో జగన్ గతంలో ఎండగట్టారు. వాటిని జనాలు మరోసారి గుర్తుచేసుకునే అవకాశం ఉంది. తాము అధికారంలోకి వస్తే మరోసారి బాదుడు తప్పదని చంద్రబాబు, ప్రజలకు హెచ్చరిస్తున్నట్టుంది ఈ టైటిల్.
జనాల్ని బాదారు.. జనం తిరిగి బాదారు..
గతంలో చంద్రబాబు జమానాలో కరెంటు బిల్లులు, ఆర్టీసీ చార్జీలు పెరగలేదా..? అస్సలు రేట్లు ఏమాత్రం పెంచలేదా..? అంత బాగా పాలన జరిగి ఉంటే.. ప్రజలు ఆ రేంజ్ లో తిరగబడేవారా. 2014 నుంచి 2019 వరకు బాదిపడేశారు కాబట్టే.. ఎన్నికల్లో ప్రజలు బదులు తీర్చుకున్నారు. ఆ బాదుడికి ఈ బాదుడు చెల్లు. ఇప్పుడు మళ్లీ బాదుదంటూ జనంలోకి వస్తే చంద్రబాబు మొహం ఎవరైనా చూస్తారా..?
ఏపీలోనే కాదు.. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి. రవాణా రేట్లు పెరగడంతో మిగతా నిత్యావసరాలకు కూడా రెక్కలొచ్చాయి. కరెంటు చార్జీలు పక్క రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఏపీలోనే తక్కువ. ఆర్టీసీ చార్జీలు తెలంగాణ కంటే ఏపీలోనే తక్కువ. మరి ఈ బాదుడే బాదుడు స్లోగన్ ఎందుకు..? ప్రజలకి ఆర్థిక సాయం చేస్తున్నందుకా..? కరోనా కష్టకాలంలో కూడా ఏ ఒక్క కుటుంబం కూడా నష్టపోకుండా చేసినందుకా..?
నవ్వులపాలవకపోతే చాలు..
చంద్రబాబు జనంలోకి రావాలనుకుంటున్నారు సరే, కానీ బాదుడే బాదుడంటూ ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేయాలనుకోవడం మాత్రం పెద్ద జోక్ అనుకోవాల్సిందే. నవరత్నాలు ఉన్నంతకాలం జగన్ గురించి జనానికి చెడుగా చెప్పాలంటే కుదరని పరిస్థితి.
ఎవరూ నమ్మేలా లేరు, కనీసం చంద్రబాబు చెబుతున్న మాటల్ని ఆలకించే స్థితిలో కూడా లేరు. మొత్తానికి ఈ బాదుడే బాదుడు టీడీపీకి రివర్స్ లో తగులుతుందనేది పబ్లిక్ టాక్..