ఒక్క హిట్టు చాలు. జాతకచక్రం తిరిగిపోవడానికి. మాస్ తో దర్శకుడిగా మారిన కొరియోగ్రాఫర్ కి అలాంటి హిట్లు దక్కాయి. అయితే రెబల్ ఫ్లాప్ తో దెబ్బకు మనోడి దిమ్మ తిరిగిపోయింది. గంగ సినిమాని రెండేళ్ల నుంచీ తీస్తూనే ఉన్నాడు. చివరికి అది హిట్టయ్యింది. తమిళనాట మరో చంద్రముఖిగా గుర్తింపు తెచ్చుకొంది. శంకర్‌లాంటి దర్శకులు కూడా లారెన్స్ ని మెచ్చుకొన్నారు.
ఇప్పుడు లారెన్స్ సూపర్ స్టార్ రజనీకాంత్ దృష్టిలో పడ్డాట. గంగని ప్రత్యేకంగా తిలకించిన రజనీ లారెన్స్‌కి పొగడ్తలతో ముంచెత్తాడని తెలుస్తోంది. ఇదే అనువుగా భావించిన ఈ డాన్స్ మాస్టర్ ''మీతో ఓ సినిమా చేయాలన్నది నా కల'' అని చెప్పాడట. దాంతో రజనీకూడా కరిగిపోయి.. ''కథ సిద్ధం చేయ్'' అని పచ్చజెండా ఊపాడని తమిళ సినీ వర్గాలు చెప్పుకొంటున్నాయి.
రజనీ – లారెన్స్ కాంబో పై రకరకాల కథనాలు తమిళ మీడియా ప్రసారం చేస్తోంది. ఓ సినిమా హిట్టయితే… అదే అదునుగా ఇలాంటి వార్తలూ హల్ చల్ చేస్తుంటాయి. రజనీ – లారెన్స్ కాంబో నిజమైనా, కాకపోయినా రజనీ దృష్టిలో లారెన్స్ పడ్డాడన్నది మాత్రం వాస్తవం. ఇది చాలదూ… లారెన్స్ కెరీర్ గ్రాఫ్ మారడానికి.