బాబోయ్‌ భూకంపం.. వణుకుతున్న ప్రపంచం.!

భూకంపాలు కొత్తేమీ కాదు. కానీ పెను భూకంపం ఎక్కడ సంభవించినా ఆ భయం ప్రపంచమంతా క్షణాల్లో పాకేస్తుంది. గడచిన వందేళ్ళలో తీసుకుంటే, ఎన్నో తీవ్ర భూకంపాలు తీరని నష్టం కలిగించాయి.. కలిగిస్తూనే వున్నాయి. తాజాగా…

భూకంపాలు కొత్తేమీ కాదు. కానీ పెను భూకంపం ఎక్కడ సంభవించినా ఆ భయం ప్రపంచమంతా క్షణాల్లో పాకేస్తుంది. గడచిన వందేళ్ళలో తీసుకుంటే, ఎన్నో తీవ్ర భూకంపాలు తీరని నష్టం కలిగించాయి.. కలిగిస్తూనే వున్నాయి. తాజాగా నేపాల్‌లో సంభవించిన భూకంపంతో ఒక్కసారిగా ప్రపంచం ఉలిక్కిపడింది. ప్రపంచంలో ఎక్కడ తీవ్ర భూకంపాలు వచ్చే అవకాశం వుంది.? అన్నదానిపై శాస్త్రవేత్తలు గతంలో వెల్లడించిన విషయాలతోపాటు, తాజాగా వెల్లడవుతున్న విషయాలు భూమ్మీద ఏ దేశంలోనూ, ఏ నగరంలోనూ ప్రజలు ప్రశాంతంగా నిద్రపోలేని పరిస్థితుల్ని కల్పిస్తున్నాయి.

భూమి పొరల్లో నిత్యం సర్దుబాట్లు జరుగుతుంటాయి. ఒక్కోసారి చాలా చాలా చిన్నగా, ఒక్కోసారి ఓ మోస్తరుగా, ఒక్కోసారి ఎక్కువగా, చాలా అరుదుగా మాత్రమే అత్యంత తీవ్రంగా భూమి పొరల్లో జరిగే సర్దుబాట్లతో భూకంపాలు వస్తుంటాయి. భూకంప తీవ్రతను పాయింట్లలో లెక్కేస్తారు. సెస్మోగ్రాఫ్‌ మీద 6 పాయింట్ల పైబడి తీవ్రత నమోదైతే ఇక నష్టం తప్పదు. 6 పాయింట్ల లోబడి తీవ్రతతో కూడిన భూకంపాలతో పెద్దగా నష్టం వుండదు. నేపాల్‌ భూకంపం తీవ్రత 7.9 కాగా చైనా ఈ భూకంప తీవ్రతను 8.1గా పేర్కొంటోంది.

మరోపక్క, భారతదేశంలోని చాలా నగరాలు భూకంపం దెబ్బకు విలవిల్లాడే అవకాశం లేకపోలేదంటూ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. నిర్మాణాల్ని వీలైనంత పకడ్బందీగా, సాధారణ భూకంపాల్ని తట్టుకునేలా నిర్మించుకోవడం తప్ప భూకంపాల నుంచి తప్పించుకునేందుకు వేరే మార్గం లేదని శాస్త్రవేత్తలు తేల్చేశారు. ఈ విషయంలో జపాన్‌ ప్రపంచలోని వివిధ దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తోంది. జపాన్‌ భూకంపాల దేశం. అందుకే అక్కడి నిర్మాణాలు భూకంపాలను కాస్త తట్టుకోగలిగేవిగా వుంటాయి.

ఇదిలా వుంటే, తాజాగా శాస్త్రవేత్తలు అమెరికాలోని కాలిఫోర్నియా పై ఫోకస్‌ పెట్టారు. సరిగ్గా 30 ఏళ్ళ లోపు ఎప్పుడైనా అతి తీవ్ర భూకంపం కాలిఫోర్నియాని  అతలాకుతలం చేసేస్తుందట. పసిఫిక్‌, ఉత్తర అమెరికా ప్లేట్లు కలుసుకునే ప్రాంతం కావడం, ఇక్కడి భూ పొరల్లో తీవ్రమైన ఒత్తిడి నెలకొంటుండడం చూస్తుంటే, అతి త్వరలో 8 తీవ్రత గల భూకంపం రావడం ఖాయమని శాస్త్రవేత్తలు తాజాగా హెచ్చరించారు. వాస్తవానికి ఇది ఈనాటి హెచ్చరిక కాదు. తాజాగా మరోమారు శాస్త్రవేత్తలు హెచ్చరించారంతే.

భూకంపాలు సముద్రంలో వస్తే సునామీ తీర ప్రాంతాల్ని ముంచెత్తేస్తుంది. సమత్రా, జపాన్‌ భూకంపాలు ఇందుకు నిదర్శనం. భూమి మాత్రమే వున్న చోట వస్తే, ఆ ప్రమాదం మరోలా వుంటుంది. అదే అగ్ని పర్వతాలున్న చోట్ల వస్తే అదీ భయానకమే. దేనికదే ఒకదాన్ని మించిన విలయం ఇంకోటి సృష్టిస్తుంది. భూకంపాలు నివారించలేనివి. అయితే, భూమిలో సహజ వనరులను తవ్వేడం వల్లనో, ఇతరత్రా పనులతోనో భూమాత గుండెకి చిల్లు పెడ్తోంటే, అది అదనపు బలంగా మారుతోంది భూకంపాలకి.

ప్రతి క్షణం భూమ్మీద ఎక్కడో ఓ చోట ఏదో ఒక తీవ్రతతో ప్రకంపనలు అయితే వస్తుంటాయి. తీవ్ర భూకంపం వచ్చినప్పుడు శాస్త్రవేత్తలు చేసే హెచ్చరికల భయం ప్రపంచాన్నే వణికించేస్తుంటుంది. ఆ తర్వాత షరామామూలే. నేపాల్‌ భూకంపం తర్వాత అయినా కట్టడాల నిర్మాణం విషయంలో, పర్యావరణాన్ని పాడుచేస్తున్న విషయంలో ప్రతి ఒక్కరూ ఆచి తూచి వ్యవహరిస్తే.. భూకంపాల్ని నివారించలేకపోయినా, భూకంపాల కారణంగా వచ్చే నష్టాన్ని కాస్త తగ్గించగలం.