సనిక్కాయలు విత్తి ఆశగా ఆకాశం వైపు ఎదురుచుస్తావే గాని, చీము పట్టిన గుండె గాయం, వెన్నుపోటు గుర్తించవెమబ్బీ? ఓ అక్కా ఈ సిత్రం చూసినావా? ..శ్రీ బాగ్ ఒడంబడిక అన్నారే? భాష ప్రయుక్త రాష్ట్రమన్నారే? మనమంతా ఒకటే అన్నారే? మనలని మనమే పాలిచుకొందామని నమ్మ బలికినారె?కందవోలు రాజధాని అని అర చేతిలో వైకుంతం చూపినా, విశాల హృదయం తో త్యాగం చేసి నీ భవిష్యత్తు కి సమాధులు కడుతున్నారని తెలుసుకోలేకపోతివన్నా? నికర జలాలు ఇవ్వకపోయినా, మిగులు జలాలు ఇవ్వమని దోసిళ్ళు పడితే అరకొర నిధులు, అడుగడుగు ఆటంకాలు, అవమానాలే! రాగి సంగటి, జొన్న రొట్టె తిన్నా నీ మనసు అనంతసాగరామాప్ప! మనమంతా ఒకటే, ఒక బాష అయితే రాయలసీమ బ్రతుకు చిత్రం తీరు ఎందుకు మారలేదు?. బ్రతుకు బండి లో ఓడిపోయిన నేతన్న, మగ్గానికే ఉరి వేసుకొంటే పాషాణ హృదయాలు కరిగావేమన్నా? లక్ష రూపాయల నష్ట పరిహారం తో నీకు విలువ కడుతున్నరన్నా! ఇది నీకు కనపడదేమన్నా?
కరాళ కరువు తాండవం నిత్య బ్రతుకు దరువు ఈ రాళ్ల సీమ లో, ఈ అభాగ్యుడిని ఆదుకోడానికి నిత్య సిరి సంపదలతో తులతూగుతున్న తిరుపతి వెంకన్నకు మనసోప్పదేమీ? అన్నమాచార్యుని కీర్తలను ఆస్వాదించుతావే గాని ఆదుకొవెమీ? కాలహస్తీశ్వరా కరుణ చూపవేమీ? కన్నప్ప మీద చూపిన కరుణ మా మీద ఒక కణిక చూపయ్యా! కదిరి నరసింహుడు కరువు రక్కసి మీద ఉగ్ర రూపం చూపడేమీ? శ్రీశైల మల్లన్నా నీకు ఈ దరిద్రం కనపదేమన్నా? ఆది బిక్షువైన నీవు బూడిద పూసుకొని స్మశానం లో కరువుతో కలిసి తాన్డవమాడటం సమంజసమా! మహానంది నందీశ్వరా, లేపాక్షి బసవన్నా లేచి రావేమన్నా? కరువుని కసి తీర తోక్కవేమిరా? కాలజ్ఞానం భోదించిన బ్రహ్మం గారు ఈ అకాలం గురించి ప్రస్తావిన్చాలేదే?ఈ అనాథలను పట్టించుకొనే దేవుడెవ్వడు? ఈ రాతి దేవుళ్ళ కళ్ళు తెరిపించే మనమనిషి ఎవ్వరు?
కళల కాణాచి నా రాయలసీమ! తెలుగు భువన విజయం, సాంస్కృతిక వారసత్వం ఈ ప్రాంత వాసుల సొంతం. తెలుగు భాష వైతాళికులు అష్ట దిగ్గజాలతో తులతూగి రతనాలను రాసులుగా పోసి అమ్మిన రాయలు ఏలిన ప్రాంతం. జొన్న కూడు తినే శ్రీనాథుడు రాయలసీమ వరి అన్నం రుచి చూసి మైమరిచిపోయి రచించిన తెలుగు ఆణిముత్యాలు మన సౌభాత్రుత్వానికి ప్రతీక! మొల్ల రామాయణం మొలకేసింది ఈ ప్రాంతం లోనే..వేమన ఆలోచన రేకిత్హేంది ఇక్కడే … మునెయ్య జానపదాలు రాయల సీమ జీవన శైలికి సాక్షి భూతాలు! కోలాటాలు – భజన బృందాలు -గొరవయ్యలు నృత్యాలు -నందికోళ్ళు -అన్నమయ్య కీర్తనలు – బుర్ర కథలు -కుంచెల నృత్యాలు – చెక్క భజనలు- పండరి భజనలు – తప్పెట గంతులు – బైలాటలు – యక్ష గానాలు -ఆసాది కుంటోళ్ళు – పిచ్చికుంట్ల కథలు – బీరప్ప డోళ్ళు – జడ కోలాటాలు -గొబ్బి నృత్యాలు- తిరగడ జక్కిళ్ళు -నామాలసింగళ్ళ -జ్యోతి నృత్యాలు-కోతుల్ని ఆడించేవాళ్లు- పులి వేషాలు -గంగిరెద్దులు – కళ్డి ఆటలు- కర్ర సాములు- పగటి వేషాలు -ఉరుములాటలు ఇక్కడే!
ప్రకృతి వివక్ష, ఏలికల సవతి తల్లి పోషణ ఇక్కడ నిత్య కృత్యం . నిజాము వద్దన్నాడు, ఇంగ్లిషు వారికి ఆశువుగా దత్తత ఇచ్చి మా జీవితాలను ఆడుకొనే వికృత క్రీడా ఆరంభమయ్యింది. పాలెగాళ్ళు పంచె కట్టి రక్త పాతం సృష్టించి, ముఠా కక్షలకు తెరలేపి సమాజాన్ని అజమాయిషీ చేసిన వైనం మన పాలిట మరణ శాసనం! రాళ్ల సీమగా ఎందుకు రూపాంతరం చెందిది? ఈ సంస్కృతి మీద దాడి ఎందుకు జరుగుతోంది? ఈ నిత్య దారిద్ర్యానికి అంతు లేదా? ఈ ప్రజలంటే అసహ్యమెందుకు, వీరి యాస మీద అపహాస్యమెందుకు? ఈ దాహార్తి తీర్చాలని ఏడు దశాబ్దాల చాలవా? వీరికి నీరు ఇవ్వలేమా? లేకపోతే ఎందుకు కలిసి వుండాలి? లక్షల కోట్ల రంగుల హరివిల్లు రాజధాని మీకే, హై కోర్టు మీకే? IT అయినా IIT అయిన అన్ని మీకే అయితే మేమెందుకు? ఇప్పటికి సవతి పిల్లలమేనా? ఊళ్లకు ఊళ్ళు వలసపోయి కువైట్, బెంగుళూరు, హైదరాబాద్ కి వెళ్లి అక్కడి ప్రజలకు ఊడిగం చెయ్యల్సిన్దేనా? మాకంటూ నీళ్ళు, పరిశ్రమలు వద్దా?
మాకు జరుగుతున్న అన్యాయాన్ని గ్రహించలేని అజ్ఞానం లో నిద్రాణమై వుంది రాయలసీమ సమాజం. సంఘటితం కాలేని పౌర సమాజం తప్పతడుగులనుంచి స్వంత కాళ్ళమీద నిలబడాలి. ఉపాధ్యాయులు, రైతులు , కార్మికులు, లాయర్లు మొత్తం సమాజం జాగృతమవ్వాలి.. ఓ పాలేగాల్లెరా! తప్పుకోండి.. కోటి రెడ్డి , తరిమెల నాగిరెడ్డి లు చూపిన దారి చూడండి … అన్ని కులాల భాగస్వామ్యం, నాయకత్వం లో రాయలసీమ ముందుకు సాగాలి…. మనకెందుకులే అనుకుటే మన బ్రతుకేంతో రాబోవు తరం బ్రతుకు ఇంతే .. మేల్కోండి, మేలుకోలపండి .. సమయం ఆసన్నమైంది
రంగ ఓంకారం