ముక్కుపచ్చలారని బాలికలకు పెళ్లిళ్లు చేస్తున్న రాష్ట్రాలలో దక్షిణాది రాష్ట్రాలే ముందున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) వెల్లడించిన వివరాల ప్రకారం… బాల్యవివాహాలు భారతదేశంలో జరుగుతూనే ఉన్నాయి. వీటిలో గత ఏడాది అధికారుల దృష్టికి వచ్చి, కేసులు నమోదు అయిన వాటి సంఖ్యే 280. అంటే దాదాపు నెలకు 20 నుంచి 25 వరకూ వెలుగు చూస్తున్నాయి. బయట పడుతున్నవే ఇన్నుంటే… కేసుల నమోదు వరకూ వెళ్లనివి దీనికి ఎన్ని రెట్లు ఉంటాయో… మరోవైపు ఈ తరహా బాల్య వివాహాలకు దక్షిణ భారతదేశమే కేరాఫ్‌గా నిలిచిందని కూడా ఎన్‌సిఆర్‌బి నివేదిక తేల్చింది.
బాల్య వివాహాల నిషేధ చట్టం కింద నమోదవుతున్న కేసుల్లో ఓ మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న తమిళనాడు రాష్ట్రం 47 కేసులతో ఫస్ట్ ప్లేస్‌లో నిలవగా, 44 కేసులతో కర్ణాటక రెండో స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ ఆ తర్వాతి స్థానాల్లో వచ్చాయి. మొత్తం మీద ఈ రాష్ట్రాలన్నీ కలిపి 139 కేసులతో దక్షిణాదిని బాల్య వివాహాలకు చిరునామాగా మార్చాయి.
మరో మహిళా ముఖ్యమంత్రి ఉన్న వెస్ట్ బెంగాల్లో సైతం 37 కేసులు వెలుగు చూశాయి. గత ఏడాదే వెలుగు చూసిన యునిసెఫ్ నివేదిక సైతం 18 ఏళ్ల లోపు బాలికల వివాహాల సంఖ్యలో భారత్‌లో 33శాతం ఉందని తేల్చింది. ఈ నివేదిక తర్వాతైనా మహిళాభివృధ్ది గురించి ఊదరగొట్టే నాయకులు కనీసం బాలికా వివాహాలు సైతం ఆపలేకపోతున్నామనే వాస్తవాన్ని గుర్తించాలి.