విటుల‌కు త‌ప్పిన కేసుల స‌మ‌స్య‌!

తాజా హైకోర్టు తీర్పుతో వ్య‌భిచార గృహానికి వెళ్లే విటుడికి కేసుల స‌మ‌స్య త‌ప్పింది. పోలీసుల దాడిలో ప‌ట్టుబ‌డుతామ‌నే భ‌యం అక్క‌ర్లేదు. ప‌రువు పోతుంద‌నే చింత అస‌లే అక్క‌ర్లేదు. ఒకే ఒక్క తీర్పు విటుడికి కొండంత…

తాజా హైకోర్టు తీర్పుతో వ్య‌భిచార గృహానికి వెళ్లే విటుడికి కేసుల స‌మ‌స్య త‌ప్పింది. పోలీసుల దాడిలో ప‌ట్టుబ‌డుతామ‌నే భ‌యం అక్క‌ర్లేదు. ప‌రువు పోతుంద‌నే చింత అస‌లే అక్క‌ర్లేదు. ఒకే ఒక్క తీర్పు విటుడికి కొండంత రిలీఫ్ ఇచ్చింది. వ్య‌భిచార గృహాల‌పై పోలీసుల దాడిలో విటులు ప‌ట్టుబ‌డ్డార‌నే వార్త‌ల‌ను త‌ర‌చూ వింటుంటాం. ఇక‌పై విటుల‌ను క‌స్ట‌మ‌ర్‌గా చూడాలే త‌ప్ప‌, నేర‌స్తుడిగా కాద‌ని హైకోర్టు తేల్చి చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఈ తీర్పును న్యాయ‌మూర్తి డి.ర‌మేశ్ ఇచ్చారు.

గుంటూరుకు చెందిన ఓ వ్య‌క్తిపై 2020లో న‌మోదైన కేసు అదే జిల్లాకు చెందిన మొద‌టి త‌ర‌గ‌తి జ్యుడిషియ‌ల్ మెజిస్ట్రేట్ కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ కేసు ర‌ద్దు చేయాలంటూ స‌ద‌రు వ్య‌క్తి హైకోర్టును ఆశ్ర‌యించాడు. కేసు విచార‌ణ‌లో భాగంగా పిటిష‌న‌ర్ త‌ర‌పు న్యాయ‌వాది వాదిస్తూ…వ్య‌భిచార గృహంపై దాడి స‌మ‌యంలో అక్క‌డ పిటిష‌న‌ర్ క‌స్ట‌మ‌ర్‌గా ఉన్న‌ట్టు పోలీసులు ఆరోపిస్తున్నార‌న్నారు.  

వ్య‌భిచార గృహాన్ని నిర్వ‌హించేవారు, ఇంటిని వ్య‌భిచార గృహం కోసం ఇచ్చే వారిపై కేసు పెట్టి విచారించొచ్చ‌ని, సొమ్ము చెల్లించి విటుడిగా వెళ్లిన వ్య‌క్తిని వారిని విచారించడానికి వీల్లేద‌ని చ‌ట్ట నిబంధ‌న‌లు చెబుతున్నాయ‌ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వ్య‌భిచార గృహానికి వెళ్లిన క‌స్ట‌మ‌ర్‌పై న‌మోదైన కేసును ఇదే కోర్టు గ‌తంలో కొట్టేసింద‌ని గుర్తు చేశారు. 

అద‌న‌పు పీపీ వాద‌న‌లు వినిపిస్తూ పిటిష‌న‌ర్ కేవ‌లం కస్ట‌మ‌ర్ మాత్ర‌మేన‌ని తెలిపారు. ఈ వ్య‌వ‌హారంపై గ‌తంలో హైకోర్టు తీర్పు ఇచ్చింద‌న్నారు. దీంతో న్యాయ‌మూర్తి డి.ర‌మేశ్‌ వాద‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని పిటిష‌న‌ర్‌పై కేసు ర‌ద్దు చేస్తూ తీర్పు చెప్పారు. 

విటుల‌పై కేసులు, విచార‌ణ జ‌ర‌ప‌కూడ‌ద‌ని న్యాయ‌మూర్తి తెలిపారు. గ‌తంలో ఇచ్చిన తీర్పును బ‌ల‌ప‌రిచేలా అలాంటి స్వ‌భావం క‌లిగిన కేసులో తీర్పు ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.