ఎమ్బీయస్‌ : ఢిల్లీలో బిజెపిపై మూకుమ్మడి దాడి

ఇటీవలి కాలంలో ఏ అసెంబ్లీ ఎన్నికలకూ రానంత మీడియా హైప్‌ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చింది. పార్లమెంటు ఎన్నికల తర్వాత ప్రతీ చోటా ఏదో ఒక స్థాయిలో గెలుస్తూ వచ్చిన బిజెపికి ఢిల్లీలో ఎదురుదెబ్బ…

ఇటీవలి కాలంలో ఏ అసెంబ్లీ ఎన్నికలకూ రానంత మీడియా హైప్‌ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చింది. పార్లమెంటు ఎన్నికల తర్వాత ప్రతీ చోటా ఏదో ఒక స్థాయిలో గెలుస్తూ వచ్చిన బిజెపికి ఢిల్లీలో ఎదురుదెబ్బ తగులుతుందన్న సూచన రావడంతో అందరికీ ఉత్సుకత పెరిగింది. మోదీ-అమిత్‌ వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని కాబినెట్‌ మంత్రులందరినీ రంగంలోకి దింపడంతో ఇప్పటిదాకా అఫెన్సివ్‌ వున్న బిజెపి ఢిల్లీకి వచ్చేసరికి డిఫెన్సివ్‌లో పడినట్లు, అరవింద్‌ సిఎం కాకుండా చూడడానికి యావచ్ఛక్తిని వుపయోగిస్తున్నట్లు తోస్తోంది. పార్లమెంటు ఎన్నికలలో మొత్తం తన చుట్టూ తిప్పుకున్న మోదీ సైతం యిప్పడు అరవింద్‌ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడడంతో యీ ఎన్నికలు అరవింద్‌ కేంద్రంగా నడుస్తున్నాయి. బిజెపికి మద్దతుగా నిలిచిన మీడియా యిప్పుడు ఆప్‌కు సానుభూతి చూపుతున్నట్లు కూడా అనిపిస్తోంది. సర్వే ఫలితాలు కూడా యిష్టం వచ్చినట్లు వస్తున్నాయి. మొన్నటిదాకా ఆప్‌ది పై చేయి అన్నారు. గత రెండు, మూడు రోజులుగా బిజెపి పుంజుకుంది అంటున్నారు. ఈ సర్వేల శాంపుల్స్‌ బేస్‌ ఎంతో సరిగ్గా చెప్పరు. ఢిల్లీ మినీ ఇండియా లాటిది. పంజాబ్‌, హరియాణాల నుండి వచ్చినవారు దశాబ్దాలుగా వున్నారు. పంజాబీలు మధ్యతరగతి వర్గాలుగా, ధనికవర్గాలుగా సెంట్రల్‌ ఢిల్లీలో పాతుకుపోతే హరియాణా గ్రామీణులు ఔటర్‌ ఢిల్లీలో, అర్బనైజేషన్‌ ఛాయలు సోకని 20 నియోజకవర్గాల్లో నిర్ణయాత్మకంగా వున్నారు. ఢిల్లీకి పక్కనే వున్న యుపి నుంచే కాదు, బిహార్‌ నుంచి కూడా చాలామంది వచ్చి ఢిల్లీ శివార్లను ముంచెత్తారు. బెంగాలీలు శతాబ్దాలుగా స్థిరపడ్డారు. ఉన్నతోద్యోగాల కోసం వచ్చిన తమిళులు,  మలయాళీలు కూడా తరాలుగా వున్నారు. తర్వాతి స్థానం తెలుగువారిది, ఆ తర్వాత కన్నడిగులది. దక్షిణాది వారు జనాభాలో 10% వుంటారని అంచనా. వీరందరి ఓటింగు సరళిని తమ సొంత రాష్ట్రాల రాజకీయాలు ప్రభావితం చేసే అవకాశం చాలా వుంది. మోదీ రథానికి అడ్డుకట్ట కట్టగల మొనగాడు అవతరించాడన్న ఆశతో వివిధ రాష్ట్రాలలో బలంగా వున్న ప్రాంతీయ పార్టీలు – లెఫ్ట్‌, జనతా దళ్‌ యు నుంచి శరద్‌ యాదవ్‌, లేటెస్టుగా మమతా బెనర్జీ – ఆప్‌కు మద్దతు ప్రకటించాయి. వీరి ప్రభావం ఆయా భాషావర్గాలపై తప్పక వుంటుంది. మరి సర్వే శాంపుల్‌లో ఏయే వర్గాలను తీసుకుంటున్నారో తెలియకుండా దేన్నీ నమ్మలేం. 

ఒకటి మాత్రం కచ్చితం. కాంగ్రెసును ఆదరిస్తూ వచ్చిన దళిత, మైనారిటీ, నిమ్న వర్గాలు గత ఎసెంబ్లీ ఎన్నికల నుంచే ఆప్‌వైపు మళ్లాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో  8 సీట్లు మాత్రమే గెలుచుకుంది. పార్లమెంటు ఎన్నికలు వచ్చేసరికి వీటిలో 5 సిగ్మెంట్లలో ఆప్‌కు కాంగ్రెస్‌ కంటె ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఈసారి ఎనిమిదైనా నిలబెట్టుకోవాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని చెపుతున్నారు కానీ, అజయ్‌ మేకన్‌ తన నియోజకవర్గం వదిలిపెట్టి ప్రణబ్‌ కూతురు శర్మిష్టా ముఖర్జీని గ్రేటర్‌ కైలాష్‌ నుంచి గెలిపించే పనిలో పడ్డాడు. బిజెపిని బలహీనపరచడానికి కాంగ్రెసు తన ఓటర్లను ఆప్‌వైపు మళ్లించవచ్చనే అందరూ నమ్ముతున్నా, కాంగ్రెసు అంత పని చేయకూడదని బిజెపి ఆశిస్తోంది.  ఢిల్లీలో ఎప్పణ్నుంచో పాతుకుపోయిన బిజెపికి 34% కోర్‌ ఓటు బ్యాంక్‌ వుంది. ఒక్కోప్పుడు 36% వరకు వెళ్లింది, శాతం మాట ఎలా వున్నా  ప్రత్యర్థుల బలాబలాల బట్టి 1998 నుంచి 2013 మధ్య సీట్ల సంఖ్య 15 నుంచి 31 వరకు మారుతూ వచ్చింది. ఆప్‌ ప్రవేశంతో బియస్పీ ఓటు, కాంగ్రెసు ఓటు కూడా దానికి మళ్లాయి. ఇప్పుడు ఆప్‌ ఏకైక ప్రతిపక్షంగా అవతరిస్తే ముఖాముఖీ పోటీలో యీ 36% ఓట్లు చాలతాయో లేదో తెలియదు. అల్పాదాయ, దళిత, మైనారిటీ ఓట్లు కాంగ్రెస్‌, ఆప్‌ల మధ్య చీలిపోతేనే బిజెపి గెలుస్తుంది. అందుకే కాంగ్రెసుకు కాస్త బలమున్న 19 నియోజకవర్గాలలో తమ పార్టీ నుంచి కొత్త అభ్యర్థులను, ప్రజలకు పెద్దగా పరిచయం లేనివారిని నిలబెట్టారట.  దళితుల మద్దతు కోసం కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కృష్ణ తీర్థ్‌ను బిజెపి చేర్చుకుంది. దళితులు, మైనారిటీలు కలహించిన త్రిలోకపురి నియోజకవర్గంలో అల్లర్లకు కారణభూతుడని అందరూ చెప్పుకునే బిజెపి నాయకుడు సునీల్‌ కుమార్‌ చనిపోతే అతని భార్యను బిజెపి అభ్యర్థిగా నిలబెట్టింది. 

మురికివాడలు ఆప్‌కు పట్టుగొమ్మలుగా వున్నాయని తెలిసిన బిజెపి ఎన్నికల ముందు మాత్రమే గుడిసెల క్రమబద్ధీకరణ ప్రకటన వెలువరించింది. దాన్ని మోదీ  తన ఉపన్యాసాల్లో పదేపదే ప్రస్తావిస్తున్నాడు. నిజానికి బిజెపి చేతిలోనే ఢిల్లీ 7 నెలలుగా వుంది. అన్నాళ్లుగా యీ దిశగా ఏమీ చేయలేదు. ఈ ఒక్కటే కాదు, అరవింద్‌ తగ్గించిన విద్యుత్‌, వాటర్‌ చార్జీలు అతను దిగిపోగానే లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పెంచేశాడు. బిజెపి అధికారంలోకి వచ్చాక మళ్లీ తగ్గించలేదు. మురికివాడల పరిస్థితి మెరుగుపర్చలేదు. అందువలన వాళ్లంతా  బిజెపిని నమ్మదలచుకోలేదు. అరవింద్‌ అయితేనే తమ కష్టాలను పట్టించుకుంటాడని వారి నమ్మకం. కిరణ్‌ బేదీ అంటే మధ్యతరగతి వర్గాలలో వున్న ఆరాధన, అభిమానం అల్పాదాయ వర్గాలలో కానరాదు. వాళ్లకి పోలీసులంటే ప్రేమ వుండదు, భయం తప్ప! వారంతా గంపగుత్తగా ఆప్‌కు వేస్తారనుకోకపోయినా అధికాంశం ప్రజలు వేస్తారనే అనుకోవచ్చు. మధ్యతరగతి కూడా ఢిల్లీలో చాలా ముఖ్యమైన సిగ్మెంటు. వారికి ఒకప్పుడు అరవింద్‌ చాలా యిష్టుడు. మోదీ ప్రధానిగా, అరవింద్‌ ముఖ్యమంత్రిగా వుంటే చాలు ఢిల్లీ రూపురేఖలే మారిపోతాయి అనుకునేవారు. అందుకే అసెంబ్లీ ఎన్నికలలో ఆప్‌ను ఆదరించారు. కానీ అరవింద్‌ పరిపాలనను గత్తరబిత్తర చేయడం, పార్లమెంటు ఎన్నికలలో దేశమంతా పోటీ చేసి పరాజయం పొందడం, అనవసరంగా మోదీతో కాశీలో తలపడడం – వీటివలన అరవింద్‌పై మోజు తగ్గింది. అందుకే పార్లమెంటు ఎన్నికలలో బిజెపికి 60 అసెంబ్లీ సిగ్మెంట్లలో ఆధిక్యత లభించింది. కాంగ్రెసుపై ఏహ్యతతో మోదీని ప్రధాని చేయాలన్న పట్టుదల వారిని కదిలించింది. ఇప్పుడు ఆ వూపు లేదు. . కిరణ్‌ బేదీ పట్ల మోజున్న మాట వాస్తవమే కానీ అరవింద్‌ను ఓడించి తీరాలన్నంత కోపమూ లేదు. పైగా ఢిల్లీకి రాష్ట్ర స్థాయి కల్పించకపోవడం కూడా వాళ్లకు నచ్చలేదు. కాంగ్రెసు ఎప్పుడూ ఆ పని తలపెట్టలేదు. మేం అధికారంలోకి వస్తే క్షణాల్లో చేస్తాం అని చెపుతూ వచ్చిన బిజెపి మాట తప్పింది. ఢిల్లీలో తాము కాకుండా ఆప్‌ గెలిస్తే వాళ్లకు ప్రాధాన్యత యివ్వాల్సి వస్తుందన్న లెక్కతోనే యిలా చేసిందని వాళ్లకు తెలుసు. ఇలాటి కారణాలతో వాళ్లు అటూ బిజెపికి, యిటు ఆప్‌కు వేయకుండా యింట్లోనే కూర్చుంటే బిజెపికి నష్టమే. 

ఇప్పుడున్న ధోరణులు గమనిస్తూ వుంటే మధ్యతరగతి కదిలివస్తే బిజెపికి ఎక్కువ సీట్లు, రాకపోతే ఆప్‌కు ఎక్కువ సీట్లు. ఈ సంగతి తెలిసి ఓటర్లను బూతులకు తరలించేందుకు అమిత్‌ షా ఒక్కో నియోజకవర్గానికి 3 నుంచి 5 వేల మంది కార్యకర్తల చొప్పున 2-3 లక్షలమందిని యితర రాష్ట్రాల నుంచి ఢిల్లీకి తెచ్చాడట. రూలు ప్రకారం వీళ్లు ఓటింగు రోజుకి 48 గంటల ముందు వూరు విడిచి వెళ్లిపోవాలట. రూల్సు తెగ మాట్లాడే ఆప్‌ కార్యకర్తలు వీరిపై నిఘా వేసి వుంచారట. బూతుకు నలుగురు కార్యకర్తల చొప్పున 9128 బూతులకు దాదాపు 35 వేల మంది కార్యకర్తలు తమకున్నారని, బయటినుంచి వచ్చిన బిజెపి కార్యకర్తలు తిరిగి వెళ్లకపోతే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తామని ఆప్‌ వాళ్లు చెప్తున్నారు. ఎన్నికల రోజున ఓటింగు శాతం చూశాక పార్టీల బలాబలాల గురించి స్పష్టత రావచ్చు. 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2015)

[email protected]