వీణా-వాణి.. పరిచయం అక్కర్లేని పేర్లు ఇవి తెలుగువారికి. అరుదుగా జన్మించే ‘అవిభాజ్య కవలలు’ వైద్య శాస్త్రానికి సవాల్ విసురుతుంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి కేసులు వెలుగు చూస్తూనే వున్నాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో కూడా కొన్ని కేసులు నమోదయ్యాయి. వాటిల్లో చాలా కేసుల్ని ‘విభజన’తో నేర్పుగా డాక్టర్లు పరిష్కరించగలిగారు. అయితే వీణా-వాణిలను వేరు చేయడం మాత్రం కుదరడంలేదు.
గతంలో గుంటూరు జిల్లాలో పేరొందిన వైద్యుడు నాయుడమ్మ, వీణా-వాణిలను వేరు చేసేందుకు ప్రయత్నించారు. అప్పట్లోనే వీణా-వాణిలను వేరు చేసి వుంటే, ఖర్చు లక్షల్లోనే అయి వుండేది. ఆరు లక్షల్లో పనైపోతుంది.. అని నాయుడమ్మ ‘హస్తవాసి’ గురించి తెలిసినవారు అన్నారు. ఇలాంటి కేసుల్ని డీల్ చేసి, విజయవంతంగా అవిభక్త కవలలకి జన్మనిచ్చిన ట్రాక్ రికార్డ్ ఆయన సొంతం.
ప్రస్తుతం వీణా-వాణిల వయసు పదకొండేళ్ళు. ఇప్పటికీ వీరిద్దర్నీ వేరు చేయలేదు. ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయినా, వీణా-వాణిలకు మాత్రం మోక్షం రావడంలేదు. ‘మేమిద్దరం ఇలానే వుంటాం..’ అని వీణా-వాణి చెప్పేంతదాకా వచ్చింది పరిస్థితి. వయసు పెరుగుతున్నకొద్దీ విభజించడం కష్టమవుతుందని నాయుడమ్మ సహా పలువురు వైద్యులు గతంలోనే చెప్పారు.
ముంబై బ్రీచ్‌కాండీ ఆసుపత్రిని కూడా సంప్రదించారు గత పాలకులు వీణా-వాణిలను వేరు చేయడానికోసం. అప్పట్లో ఆ ఖర్చు అంచనా ఆరు కోట్లు. ఇప్పుడు లండన్ నుంచి వైద్యులొస్తున్నారు.. వారు చెబుతున్న ఖర్చు అంచనా పాతిక నుంచి యాభై కోట్లు అట. ఇంకో పది కోట్లు అటూ ఇటూ వేసుకోవాల్సిందే. ఏడాదిపాటు దఫదఫాలుగా శస్త్ర చికిత్సలు నిర్వహించాల్సి వుంటుందట. ఇప్పటికైనా వీణా-వాణి క్షేమంగా వేరు పడితే అంతకన్నా కావాల్సిందేముందనే భావన అందరిలోనూ వ్యక్తమవుతుంది. కానీ, అది సాధ్యమేనా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.