నందమూరి ముద్ర పడకుండా ఇది ఇంకో కుట్రనా?

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తాము పోటీ చేయబోయేది లేదని తేల్చి చెప్పేసింది. సాక్షాత్తు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, స్వయంగా రాజమండ్రి కి వెళ్లి, అక్కడి సెంట్రల్ జైలులోని చంద్రబాబు నాయుడుతో…

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తాము పోటీ చేయబోయేది లేదని తేల్చి చెప్పేసింది. సాక్షాత్తు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, స్వయంగా రాజమండ్రి కి వెళ్లి, అక్కడి సెంట్రల్ జైలులోని చంద్రబాబు నాయుడుతో ములాఖత్ అయి.. మొత్తానికి తుది నిర్ణయాన్ని తెలుసుకొని తిరిగి భాగ్యనగరానికి చేరుకున్నారు. తమ పార్టీ పోటీ చేయబోవడం లేదని వెల్లడించారు. ఈ మాట పార్టీ సమావేశంలో ప్రకటించినప్పుడు.. చాలామంది నాయకులు వ్యతిరేకించారని.. పోటీ చేసేలా చంద్రబాబును ఒప్పించాలని కోరారని, ఆమేరకు తీర్మానం చేశారని కూడా వార్తలు వచ్చాయి. అయితే అదంతా జరిగే పని కాకపోవచ్చు.

నిజానికి, తెలంగాణ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోతే.. మొట్టమొదటిగా బాధపడేది కాసాని జ్ఞానేశ్వర్ మాత్రమే. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్తిస్థాయిలో శవాసనం వేసిన తర్వాత.. కాసాని జ్ఞానేశ్వర్ సారథిగా పగ్గాలు తీసుకున్నారు. అప్పటినుంచి అంతో ఇంతో పార్టీ తరఫున కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. చంద్రబాబుతో ఖమ్మంలో ఒక బహిరంగ సభ కూడా నిర్వహించారు.

తన సొంత డబ్బును భారీగా ఖర్చు పెడుతున్నారని కూడా వినికిడి. అయితే మరిన్ని కోట్లకు కోట్లు ఖర్చుపెట్టి అయినా సరే.. తనతో పాటు తన కొడుకును కూడా ఎమ్మెల్యేగా చేసుకోవాలని ఆయన కల అని పలువురు చెబుతుంటారు. 

ఇప్పుడు చంద్రబాబు నిర్ణయంతో మొదటగా ఇబ్బంది పడేది ఆయనే. ఈ ఎన్నికలలో అసలు పోటీ చేయకుండా ఊరుకుంటే కనుక.. వచ్చే ఎన్నికల నాటికి అసలు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉంటుందా లేదా అనేది కూడా సందేహమే.

చంద్రబాబు నాయుడు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు అనే విషయంలో రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఒక వాదన ఏమిటంటే.. నందమూరి బాలకృష్ణ ముద్ర ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీ మీద పడకుండా ఉండడానికి చంద్రబాబు ప్లాన్ అని అంటున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత  తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో నందమూరి బాలకృష్ణ సమావేశం నిర్వహించారు. 

మొత్తం అన్ని స్థానాలలో పోటీకి దిగకుండా..  బలం ఉన్నచోట్ల మాత్రమే పోటీ చేయాలని ఆయన దిశా నిర్దేశం చేశారు. తాను స్వయంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని కూడా అన్నారు.

తన అరెస్టు తరువాత.. ఏపీలో ఒక్కరోజు పార్టీలో నందమూరి బాలకృష్ణ కీలకంగా వ్యవహరించినందుకే జరుగుతున్న చంద్రబాబు.. కనీసం తెలంగాణ పార్టీలో కూడా ఆయన వేలు పెట్టడాన్ని సహించలేకపోతున్నారు అనే వాదన వినిపిస్తోంది. పార్టీ నాశనం అయిపోయినా పరవాలేదు గానీ  నందమూరి కుటుంబం చేతుల్లోకి వెళ్ళకూడదు అని వ్యూహంతోనే.. ఈ ఎన్నికలలో బరిలోకి దిగవద్దని చంద్రబాబు ఆదేశించినట్లుగా పలువురు అంచనా వేస్తున్నారు.