గిరిజనంలో వ్యవసాయంలో కొత్త పద్ధతుల పట్ల అవగాహన కల్పిస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తూ ఎందరికో స్పూర్తిగా నిలిచిన మహిళా రైతుకు వైఎస్సార్ అచీవ్ మెంట్ అవార్డు లభించింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాంగి వినీత అనే మహిళా రైతును ఈ అవార్డు వరించింది.
వ్యవసాయంలో సేంద్రీయ విధానాలను పాటించడంతో పాటు, రైతు సాధికార సంస్థ సహాయంతో వివిధ కషాయాల తయారీ వంటివి ఆమె సాధించిన విజయాలుగా ఉన్నాయి. అంతే కాదు, వాటిని రైతులకు పంపిణీ చేయడం, అలాగే పంట మార్పిడి విధానాన్ని కచ్చితంగా పాటిస్తూ ఏడాది పొడవునా వ్యవసాయ ఉత్పత్తుల సాగును ఎలా చేయాలో తాను చేస్తూ అందరికీ ఆదర్శంగా ఉంటూ శిక్షణ ఇవ్వడం ద్వారా ఈ మహిళా రైతు మన్యంలో వెలుగులు నింపుతున్నారు.
రైతులకు సేంద్రీయ వ్యవసాయ విధానాలపై అవగాహనను ఆమె విస్తృతంగా కల్పిస్తున్నారు. ప్రస్తుతం అంతా వ్యవసాయంలో ఎరువులు కల్తీ పంటలతో ఆరోగ్యాలు చెడిపోతున్న నేపధ్యంలో సేంద్రీయ వ్యవసాయమే ఎప్పటికీ ఉత్తమమని వినీత నినదిస్తున్నారు.
మారు మూల మన్యంలో ఆమె అమలు చేస్తున్న విధనాలు ఇపుడు ఏపీ వ్యాప్తం అయ్యాయి. అందరి చేత శభాష్ అనిపిస్తున్నాయి. అందువల్లనే ఆమెను రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం సత్కరించాలని నిర్ణయించారు. ఇది మన్యం కే కాదు, మహిళా రైతులకే స్పూర్తి అని అంటున్నారు.