టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి నిజ స్వరూపాన్ని ప్రాక్టికల్‌గా చూపేందుకే జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకుందనే చర్చకు తెరలేచింది. ఏపీలో టీడీపీతో సంబంధం లేకుండా మూడో ప్రత్యామ్నాయంగా కలిసి వెళ్దామన్న బీజేపీ పెద్దల మాటల్ని జనసేనాని ఖాతరు చేయలేదు. బీజేపీతో చెప్పాపెట్టుకుండా టీడీపీతో పొత్తుపై పవన్‌కల్యాణ్ ప్రకటన చేశారు. పవన్‌కల్యాణ్ వైఖరిపై బీజేపీ ఆగ్రహంగా ఉన్నప్పటికీ, తగిన సమయంలో బాబు నిజ స్వరూపాన్ని చూపి, నిర్ణయాన్ని ఆయన విచక్షణకే వదిలేయాలని బీజేపీ భావిస్తోందన్న చర్చ జరుగుతోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. 32 స్థానాల్లో పోటీ చేయాలని జనసేన నిర్ణయం కూడా తీసుకుంది. అయితే బీజేపీతో పొత్తులో భాగంగా కేవలం 11 స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది. జనసేనకు బీజేపీ 11 సీట్లు కేటాయించినట్టు ప్రచారం జరుగుతోంది. ఇది ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు.
గ్రేటర్ హైదరాబాద్‌లో సీమాంధ్రులు ఎక్కువగా ఉన్న కూకట్‌పల్లి, మల్కాజ్‌గిరి, శేర్‌లింగంపల్లి, నాంపల్లితో పాటు ఇతర జిల్లాల్లోని తాండూర్, కోదాడ, నాగర్‌కర్నూల్, ఖమ్మం, వైరా, కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాలను జనసేనకు కేటాయించినట్టు తెలిసింది. ముఖ్యంగా టీడీపీ అనుకూల ఓటు బ్యాంక్, చంద్రబాబు సామాజిక వర్గం బలంగా ఉన్న ప్రాంతాల్లోనే జనసేనకు సీట్లను బీజేపీ వ్యూహాత్మకంగా కేటాయించిందని చర్చకు తెరలేచింది.
ఇక్కడ జనసేనకు టీడీపీ శ్రేణులు ఓట్లు వేయకపోతే ఆ ప్రభావం తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై పడుతుందని బీజేపీ ఆశిస్తోంది. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం కాంగ్రెస్‌కు అండగా నిలిచేందుకు నిర్ణయించుకుంది. జనసేన బరిలో ఉండడంతో ఆ పార్టీకి చంద్రబాబు, లోకేశ్ ఎంత వరకు మద్దతు పలుకుతారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇక్కడ జనసేనకు మద్దతు ఇవ్వకపోతే, దీన్ని చూపి, రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఓట్ల బదిలీ అవుతుందని ఎలా అనుకుంటారనే ప్రశ్నతో పవన్‌ను బీజేపీ ఇరకాటంలో నెట్టేందుకు సిద్ధంగా వుంది.
ఏపీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే తెలంగాణలో పవన్‌తో బీజేపీ వ్యూహాత్మకంగా పొత్తు కుదుర్చుకుందనే చర్చ నడుస్తోంది. తెలంగాణలో జనసేనకు చంద్రబాబు సామాజిక వర్గం ఓట్లు వేయకపోతే మాత్రం, ఏపీలో కాపులు అదే పని చేస్తారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ ఎన్నికల్లో జనసేన పోటీ చేయడం ముమ్మాటికీ ఆత్మహత్యా సదృశ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.