పవన్ కల్యాణ్ ను మెగా హీరోలు ఎంతమంది ఇమిటేట్ చేశారో చెప్పలేం కానీ, హీరో నితిన్ మాత్రం ఓ రేంజ్ లో ఫాలో అయిపోతుంటాడు. దాదాపు తన ప్రతి సినిమాలో పవన్ కల్యాణ్ మేనరిజమ్స్ చూపిస్తుంటాడు. పవన్ సినిమాలో పాటను కూడా రీమిక్స్ చేసిన ఈ హీరో, ఎందుకిదంతా అని అడిగితే డై-హార్డ్ ఫ్యాన్ అని సమాధానం చెబుతాడు.
ఇప్పుడు మరోసారి పవన్ లా కనిపించే ప్రయత్నం చేశాడు నితిన్. ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్ సినిమా నుంచి కొత్త స్టిల్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో తమ్ముడు సినిమాలోని పవన్ కల్యాణ్ గెటప్ ను కాపీ కొట్టాడు నితిన్. అక్కడితో ఆగకుండా, మెడలో ఎర్ర కండువా కూడా వేసుకున్నాడు.
నితిన్ కు పవన్ అంటే ఇష్టం అనే సంగతి అందరికీ తెలుసు. అయితే ఆ ఇష్టాన్ని ఇలా తన ప్రతి సినిమాలో చూపించడం ఎంత వరకు కరెక్ట్ అనేది అతడే ఓసారి చెక్ చేసుకుంటే మంచిది. తన ఇష్టాన్ని చూపించడంతో పాటు, పవన్ ఫ్యాన్స్ ను తన సినిమాల వైపు ఆకర్షించడం కూడా నితిన్ ఎజెండాలో ఓ భాగం అనుకోవాలేమో.
ఇంతకీ ఈ పోస్టర్ ఇప్పుడెందుకు రిలీజ్ చేశారంటే.. 30వ తేదీన ఎక్స్ ట్రార్డినరీ మేన్ సినిమా టీజర్ రిలీజ్ చేస్తున్నారు. ఆ విషయాన్ని చెప్పడం కోసం, పవన్ లా కనిపించే నితిన్ పోస్టర్ ను విడుదల చేశారు. కేవలం గెటప్ కే పరిమితమా లేక ఈ సినిమాలో పవన్ సాంగ్ ఏదైనా రీమిక్స్ చేశారా అనేది తేలాల్సి ఉంది.