అల్లు అరవింద్ బాగానే వున్నారు..దగ్గుబాటి సురేష్ బాగానే వున్నారు. ఈ ఇద్దరు తెరవెనుక నుంచి తాళ్లు లాగారని వినికిడి..ఇప్పుడు తెరముందు దిల్ రాజు, ఠాగూర్ మధు వగైరా జనాలు మీడియాతో గిల్లి కజ్జాలు పెట్టుకున్నారు. హీరో దగ్గర అర్థరూపాయి రెమ్యూనిరేషన్ తగ్గించగలిగే దమ్ము, ధైర్యం లేవు. పిల్ల హీరోలకు సైతం నాలుగు కోట్లు ఇస్తున్నారు..పెద్ద హీరోలకు అత్యధికంగా 18 కోట్లు (శ్రీమంతుడు సినిమాకు మహేష్ పారితోషికం ఇంత అని టాక్) ఇస్తున్నారు.
వీటిల్లో ఒక్క కోటి తగ్గించుకున్నా, కాస్ట్ కటింగ్ పై ఇంత మల్ల గుల్లాలు పడనక్కరలేదు. స్వామిరారా సినిమాను రెండు మూడు కోట్లతో తీసారు. ఇప్పుడు అదే కథను అటుమార్చి ఇటు మార్చి నాగ చైతన్యతో 12 కోట్లతో తీసారు. ఇలా నిర్మాణంలో కాస్ట్ కటింగ్ అన్నది చాతకాక, చేయలేక, కేవలం సినిమాకు 50 లక్షల నుంచి కోటి రూపాయలతో పనైపోయే పబ్లిసిటీపై ముందు కత్తి ఎత్తారు. సరే మీ పని మీది..మా పని మాది అని మీడియా తన దారిన తాను పోవడంతో ఇప్పుడు దిల్ రాజు బాగానే వున్నాడు..మిగిలిన నిర్మాతలు లబోదిబో అంటున్నారు.
నిన్నటి నిన్న నాగార్జున లాంటి పెద్ద హీరో, నిర్మాత, ఈ పది పధ్నాలుగు మంది నిర్ణయాలతో నాకు సంబంధం లేదు అనేసాడు.
ఇప్పుడు ఏకంగా కౌన్సిల్ దిగి వచ్చి, వాళ్ల నిర్ణయాలతో మాకు సంబంధం లేదు అంది. చిత్రమేమిటంటే, సాక్షాత్తూ ఈ కౌన్సిల్ అధ్యక్షుడు బూరుగు పల్లి శివరామకృష్ణ కూడా ఆ పధ్నాలుగు మందిలో కీలకపాత్ర పోషించారు. మరి ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలోని కౌన్సిల్ ఈ ప్రకటన ఇచ్చింది. దీన్ని బట్టి ఏమనుకోవాలి?
చివరకు మిగిలేది దిల్ రాజు ఒక్కరేలా కనిపిస్తోంది. తెరవెనుక వున్న వారు సేఫ్. ఆఖరికి దిల్ రాజు బలి.
ఇన్నాళ్లు తమకున్న పబ్లిసిటీ మొహమాటంతో మీడియా సినిమాల కన్నాలు కప్పిపుచ్చింది. రివ్యూలు మొదటి రోజు వేయడం మానింది. ఇప్పుడు అవన్నీ జరుగుతున్నాయి. ఇప్పటి వరకు కనీసం మూడు రోజులన్నా సినిమాలకు కలెక్షన్లు వుండేవి. ఇప్పుడు సినిమా విడుదలైన మూడు గంటలకు చానెళ్లలో, మర్నాడు ఉదయానికి పేపర్లలో ఆ సినిమా సత్తాను జనం ముందు పెడుతున్నారు.
దీంతో జనం రెండు వందలు మిగులు అని ఇంట్లో కూర్చుంటున్నారు. కొండ నాలికకు మందేస్తే, ఉన్న నాలిక ఊడిందని, యాభై లక్షల పబ్లిసిటీ బడ్జెట్ కోసం చూసుకుంటే, మొత్తానికే మోసం వస్తోంది. అందువల్ల ఇక ఈ వ్యవహారాన్ని ఇంతటితో ముగిస్తారు. ముందుండి భుజనాకి ఎత్తుకున్న దిల్ రాజు బలి అవుతారు.