అంచనాలకు అందని విషాదమిది.!

నేపాల్‌లో తీవ్ర భూకంపం మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. ఇది అంచనాలకు అందని పెను విషాదం. మృతుల సంఖ్య వెయ్యి దాటింది. శిధిలాల్ని ఇంకా తొలగించడానికి వీలు పడని పరిస్థితి. దాంతో మృతుల…

నేపాల్‌లో తీవ్ర భూకంపం మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. ఇది అంచనాలకు అందని పెను విషాదం. మృతుల సంఖ్య వెయ్యి దాటింది. శిధిలాల్ని ఇంకా తొలగించడానికి వీలు పడని పరిస్థితి. దాంతో మృతుల సంఖ్య ఎంత వుంటుందన్నదానిపై ఊహించడానికే మనసొప్పడంలేదు సహాయక బృందాలకి.

80 ఏళ్ళ క్రితం వచ్చిన భూకంపంలానే ఈసారి కూడా పెను భూకంపం రావడంతో నేపాల్‌ నిలువునా వణికిపోయింది. నేపాల్‌ మాత్రమే కాదు, భారత్‌లోనూ, ఆ మాటకొస్తే బంగ్లాదేశ్‌లోనూ భూకంపం కారణంగా మరణాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. నేపాల్‌ తర్వాత ఈ భూకంపం భారత్‌పైనే తీవ్ర ప్రభావం చూపింది. భారత్‌లో భూకంపం కారణంగా వంద మందికి పైగా మృతి చెంది వుంటారన్నది ఓ అంచనా. ఉత్తరాఖండ్‌, పశ్చిమబెంగాల్‌, బీహార్‌ ప్రధానంగా భూకంపం ధాటికి దెబ్బతిన్న రాష్ట్రాలు భారతదేశంలో.

ఇక, నేపాల్‌లో పరిస్థితి విషయానికొస్తే ఎటు చూసినా బాధితుల ఆర్తనాదాలు, శవాల దిబ్బలే కనిపిస్తున్నాయి. ఎవరికి సహాయం అందించాలో, ఎవర్ని వెతకాలో తెలియని పరిస్థితి అక్కడ సహాయక కార్యక్రమాలు నిర్వహిస్తున్నవారిది. భారతదేశం ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాల్ని నేపాల్‌కి పంపింది. ఇంకా అవసరమైతే ఎంతమందినైనా సహాయం కోసం పంపిస్తామని భారత్‌, నేపాల్‌ ప్రభుత్వానికి హామీ ఇచ్చింది.

సీ`130జె, సి`17 గ్లోబ్‌ మాస్టర్‌, పలు హెలికాప్టర్లను నేపాల్‌కి పంపిన భారత్‌, నేపాల్‌కి మానసికంగా వెన్నుదన్నుగా నిలవడం గమనార్హం. మరోపక్క, భారతదేశంలో భూకంపం కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు ముమ్మరం చేశారు. ప్రాణ నష్టంపై భిన్న కథనాలు వస్తున్నా, రేపటికి భారతదేశంలో జరిగిన ప్రాణ నష్టంపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే అవకాశముంది. ఇంకోపక్క భూ ప్రకంపనలకు తోడు పుకార్లు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.