దశాబ్దాల చరిత్ర వున్న నేపాల్లోని ఖాట్మండులోగల భీమ్సేన్ టవర్ (ధారాహర) తీవ్ర భూకంపం ధాటికి ఆనవాళ్ళు కూడా లేకుండా కుప్పకూలిపోయింది. ఎప్పుడో 1824లో భీమ్సేన్ ఈ టవర్ని తొలుత నిర్మించారు. అయితే 1934లో వచ్చిన భూకంపం ధాటికి ఆ టవర్ కుప్పకూలింది. మళ్ళీ టవర్ని నిర్మించారు.. 80 ఏళ్ళకు తాజాగా సంభవించిన భూకంపం దెబ్బకి భీమ్సేన్ టవర్ కూలిపోయింది.
మిలిటరీ అవసరాల కోసం ఈ టవర్ని నిర్మించారు. వాచ్ టవర్గా మిలిటరీ ఈ టవర్ని ఒకప్పుడు వినియోగించుకునేది. కాలక్రమంలో భీమ్సేన్ టవర్ చారిత్రక కట్టడంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. నేపాల్ ఎవరు వెళ్ళినా, భీమ్సేన్ టవర్ని చూసి, అక్కడ ఫొటోలు తీసుకుని రావాల్సిందే. అంతటి చారిత్రక ప్రాధాన్యత వున్న పర్యాటక కట్టడం భీమ్సేన్ టవర్.
భీమ్ సేన్ టవర్ శిఖరాగ్రాన హిందువులు పూజించే శివుడి విగ్రహం వుంటుంది. మొఘల్, యూరోపియన్ శైలిలో భీమ్సేన్ టవర్ నిర్మితమైంది. భూకంపం సంభవించిన సమయంలో ఈ టవర్ దగ్గరే 50 మంది వరకూ పర్యాటకులు వున్నట్లు తెలుస్తోంది. వాళ్ళంతా సజీవ సమాధి అయిపోయారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శిధిలాల్ని తొలగించడం మొదలైతేనేగానీ, పరిస్థితి ఏమిటన్నది ఎవరికీ తెలియదు.