వరల్డ్‌ కప్‌: ‘పాక్‌ గండం’ గట్టెక్కాలి.!

మామూలుగా అయితే టెన్షన్స్‌ లేవు.. పాకిస్తాన్‌పై టీమిండియా వరల్డ్‌కప్‌లో గెలవడం నల్లేరు మీద నడకే. కానీ, టీమిండియా ప్రస్తుత ఫామ్‌ చూస్తోంటే, భారత క్రికెట్‌ అభిమానులకే కాసిన్ని అనుమానాలు కలుగుతున్నాయి. గత వరల్డ్‌కప్‌ హీరోగా…

మామూలుగా అయితే టెన్షన్స్‌ లేవు.. పాకిస్తాన్‌పై టీమిండియా వరల్డ్‌కప్‌లో గెలవడం నల్లేరు మీద నడకే. కానీ, టీమిండియా ప్రస్తుత ఫామ్‌ చూస్తోంటే, భారత క్రికెట్‌ అభిమానులకే కాసిన్ని అనుమానాలు కలుగుతున్నాయి. గత వరల్డ్‌కప్‌ హీరోగా బరిలోకి దిగుతోన్న టీమిండియా, వరల్డ్‌కప్‌లో తొలుత తలపడేది దాయాది పాకిస్తాన్‌తోనే.

ఇప్పటిదాకా ఎప్పుడూ పాకిస్తాన్‌, భారత్‌పై వరల్డ్‌కప్‌ పోటీల్లో విజయం సాధించింది లేదు. అది ట్వంటీ ట్వంటీ అయినా, వన్డే అయినా.. వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌పై ఎప్పుడూ పైచేయి భారత్‌దే. ట్వంటీ ట్వంటీ వరల్డ్‌కప్‌లో మాత్రం, పరుగుల పరంగా పాకిస్తాన్‌, భారత్‌తో సరిసమానంగా నిలిచింది. డ్రా అయిన మ్యాచ్‌లో ఎక్స్‌ట్రా ఓవర్‌ ఫలితం డిసైడ్‌ అయ్యింది. ఆ ఎక్స్‌ట్రా ఓవర్‌ టీమిండియాకి కలిసొచ్చిందనుకోండి.. అది వేరే విషయం.

పాకిస్తాన్‌ మానసికంగా, టీమిండియాతో పోరు అంటే కాస్తంత ఇబ్బంది పడ్తుందన్నది నిర్వివాదాంశం. వరల్డ్‌కప్‌ ఫైనల్‌కి మించి, భారత్‌ – పాకిస్తాన్‌ తలపడే మ్యాచ్‌ పట్ల ఆసక్తి నెలకొంటుందంటే, ఈ రెండు దేశాల మధ్య క్రికెట్‌ ఏ రేంజ్‌లో టెన్షన్‌ని క్రియేట్‌ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈసారీ గతంలోలానే పాకిస్తాన్‌పై భారత్‌ విజయం సాధించగలుగుతుందా.? అంటే మెజార్టీ క్రికెట్‌ అభిమానులు ‘ఔను’ అనే అంటున్నారు. కొందరిలో మాత్రం కొన్ని అనుమానాలున్నాయి.

ఆస్ట్రేలియాతో టెస్ట్‌ సిరీస్‌ కోల్పోవడం, ఆ తర్వాత ముక్కోణపు సిరీస్‌లో ఘోర వైఫల్యం.. ఇవన్నీ భారత క్రికెట్‌ అభిమానుల అనుమానాలకు కారణం. వరల్డ్‌కప్‌ ఫీవర్‌ వేరు.. ఆ జోరు వేరు.. అయినాసరే, పాకిస్తాన్‌తో గండం ఎప్పుడూ పొంచే వుంటుంది మైదానంలో. గండం గట్టెక్కడం భారత్‌కి కొత్తేమీ కాదుగానీ, ఈసారి అభిమానుల్లో వున్న అనుమానాల నేపథ్యంలో తొలి మ్యాచ్‌తోనే టీమిండియా భరోసా నింపితే అంతకన్నా కావాల్సిందేముంది.?