అంచనాలకందని నష్టం

హుదూద్ తుపాను పెను బీభత్సం సృష్టించింది. తుపాను ధాటికి ఉత్తరాంధ్ర విలవిల్లాడుతోంది. పరిస్థితిని ముందస్తుగా అంచనా వేయడం వల్ల కొంతమేర ప్రాణ నష్టం తక్కువగా వున్నప్పటికీ, ఆస్తి నష్టం మాత్రం కని వినీ ఎరుగని…

హుదూద్ తుపాను పెను బీభత్సం సృష్టించింది. తుపాను ధాటికి ఉత్తరాంధ్ర విలవిల్లాడుతోంది. పరిస్థితిని ముందస్తుగా అంచనా వేయడం వల్ల కొంతమేర ప్రాణ నష్టం తక్కువగా వున్నప్పటికీ, ఆస్తి నష్టం మాత్రం కని వినీ ఎరుగని రీతిలో సంభవించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా విశాఖ జిల్లాలో ఆస్తి నష్టం అత్యంత భారీగా సంభవించింది.

విశాఖ ఎయిర్‌పోర్ట్‌ పాక్షికంగా ధ్వంసం కావడం పరిస్థితి తీవ్రతను చెప్పకనే చెబుతోంది. తుపాను హెచ్చరికల కేంద్రానికీ తుపాను తాకిడి ఎదురయ్యింది. రాడార్‌ వ్యవస్థ నిలిచిపోయింది. విశాఖ నౌకాశ్రయంలోనూ పలు నౌకలు దెబ్బతిన్నట్లు ఊహాగానాలు తెరపైకొచ్చాయి.  ఇంకా విశాఖలో అన్ని చోట్లకూ వెళ్ళగలిగే పరిస్థితులు లేకపోవడంతో నష్టం ఏ స్థాయిలో వుంటుందనేదానిపై ఖచ్చితమైన అంచనాల్లేవు.

ప్రస్తుతం బాధిత ప్రజానీకాన్ని ఆదుకునే ప్రయత్నంలో వున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఆంధ్రప్రదేశ్‌ని అన్ని విధాలా ఆదుకుంటామని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. మరోపక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, విశాఖకు బయల్దేరారు. విశాఖలో పరిస్థితిని రెండు మూడు రోజులపాటు అక్కడే వుండి సమీక్షించనున్నారాయన.