హైదరాబాదు పాతబస్తీలోని ముస్లిం బాలికలను అరబ్బులు ‘నిఖా’పేరుతో తమ దేశం తీసుకుని వెళ్లిపోయి అక్కడ అన్ని రకాలుగా దోపిడీ చేయడం గురించి చాలా ఏళ్లగా వింటున్నాం. ఆ అంశంపై కథలు వచ్చాయి, సినిమాలూ వచ్చాయి. అరబ్బులే కాదు, హరియాణా వాళ్లు కూడా ఇలాంటి ఘోరాలు చేస్తున్నారని వెలుగులోకి వచ్చింది. హరియాణాలో స్త్రీశిశువు పుట్టగానే చంపేసే దురాచారం వలన ఆడపిల్లల కొరత ఏర్పడింది. వెయ్యి మందిలో బతికి బట్టకట్టిన 907 మంది ఆడవాళ్లు తమకు నచ్చినవారిని భర్తలుగా ఎంచుకోగలుగుతున్నారు. పేదవారు, భూవసతి పెద్దగా లేనివారు, అవిటివారు, వయసు మీరినవాళ్లు – వీళ్లని పెళ్లాడేందుకు ఎవరూ ముందుకు రావటం లేదు. దాంతో వాళ్లు అసాం, బెంగాల్, బిహార్, ఝార్ఖండ్, ఒడిశా వంటి రాష్ట్రాలలోని నిరుపేద కుటుంబాలలోని మహిళలను తక్కువ ధరకు కొనుక్కుని తెచ్చుకుని ‘భార్య’లుగా వాడుకుంటున్నారు, కానీ భార్యగా సామాజిక స్థాయి కల్పించటం లేదు. పొలంలో కూలీగా, ఇంట్లో పనిమనిషిగా, పడకగదిలో సెక్స్ కోసం వాడుకుని కొన్నాళ్ల తర్వాత అమ్మేసి వచ్చినంత ధర రాబట్టుకుంటున్నారు. వాళ్ల వలన కలిగిన పిల్లలను తమతోనే వుంచేసుకుంటున్నారు. ఇలాంటి స్త్రీలను ‘పరో’ లేదా ‘మోల్కీ’ అంటారు. యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ వారి 2013 నాటి నివేదిక ప్రకారం వారు హరియాణా సర్వే చేసిన 10 వేల ఇళ్లల్లో 9 వేల ఇళ్లలో ఇలాంటి పరోలు వున్నారు. హరియాణాలో బాగా అభివృద్ధి చెందిన ఆధునిక నగరం గుడ్‌గావ్‌కు అతి దగ్గరలోనే మేవాట్ అనే వూరిలో ఎమ్పవర్ పీపుల్ అనే సామాజిక సంస్థ ఈ సమస్యపై తీవ్రంగా అధ్యయనం చేసి దీనిపై పోరాటం సలుపుతోంది. వారి అంచనాల ప్రకారం 2012-13లో మేవాట్‌కు తెచ్చిన పరోలలో 79% మంది ముస్లిములు. 17% మంది షెడ్యూల్ తెగల వారు. 4% మంది ఇతర దళితులు. ఈ మహిళలలో 56% మంది రెండు సార్లు అమ్ముడుపోయారు, 21% మంది మూడుసార్లు, 6% మంది అంతకంటె ఎక్కువగా చేతులు మారారు.
వీరి గాథలు విషాదభరితం. 12-21 సం॥ మధ్య వయసులో వుండగా సమీప బంధువులే వీళ్లని డబ్బుకోసం అమ్మేస్తున్నారు. 11 ఏళ్ల అసామీ అమ్మాయిని వాళ్ల మేనమామ ఢిల్లీలో ఎఱ్ఱకోట చూపిస్తాను రమ్మనమని ఢిల్లీ తీసుకుని వచ్చి 30 ఏళ్ల వాడికి అమ్మేశాడు. అప్పటికే అతనికి పాత భార్యల వలన ఆరుగురు పిల్లలున్నారు. ఈమెను చావగొట్టి పొలంలో పనిచేయించాడు. బలాత్కారం చేసి అనుభవించాడు, ఇంకో ఏడాది పోయిన తర్వాత అమ్మేశాడు. ఇప్పుడు ఆమె నాలుగో భర్తతో వుంది. 13 ఏళ్లగా అతని దగ్గరే వుంది. అతనికి నలుగురు పిల్లల్ని కంది. అందరివీ ఇంచుమించు ఇలాంటి గాథలే. ఎమ్పవర్ సర్వే ప్రకారం ఈ ‘భార్య’లలో 76% మందిని కుటుంబవ్యవహారాల్లో కలగజేసుకోనివ్వరు. 71% మందిని పండగల్లో, ఫంక్షన్లలో పాలు పంచుకోనివ్వరు. 0% మంది పేర్లు రేషన్ కార్డుల్లో, ఓటర్ల లిస్టులో కనబడవు. ఇక వాళ్లను భార్యలని ఎలా అంటాం? ఇలా చేతులు మారిన పరోలు కొంతకాలం పోయాక తమ స్వగ్రామాలలోని అమ్మాయిలను తీసుకుని వచ్చి పరోలుగా మార్చి డబ్బు సంపాదిస్తున్నారు. ఇలా కొనుక్కుంటున్న మగవాళ్లు ఏమీ సిగ్గుపడటం లేదు. ‘వీళ్లెవరికీ కొంపలో తిండి లేదు. మేం తిండి పెట్టి పోషిస్తున్నాం. చాలదా? అందుకోసం మా అవసరాలు తీర్చుకుంటున్నాం. తప్పేముంది?’ అని వాదిస్తున్నారు. మేవాట్‌లో పరోల సంత నడుస్తోంది. ఎవరికైనా కావాలంటే అక్కడివారికి చెపితే వాళ్లు పరరాష్ట్రాలు వెళ్లి కొనుక్కుని తెచ్చి కమిషన్ సంపాదిస్తున్నారు. మగవాడి మోజు బట్టి కన్య అందచందాల బట్టి 15-50 వేల రూ.ల దాకా ఎంతైనా ఇచ్చి కొంటారు. ఒక 66 ఏళ్ల వ్యక్తి బలహీనంగా వున్నాడు. అతను ఇద్దరు పరోలను తెచ్చుకుంటే వాళ్లిద్దరూ వదిలి వెళ్లిపోయారు. అప్పుడు ఓ ట్రక్ డ్రైవర్ ఓ 14 ఏళ్ల బంగ్లాదేశ్ అమ్మాయిని తెచ్చి అప్పచెప్పాడు. ఇతను ఖుష్. ‘ఆమెకు స్థానిక భాష రాదు కాబట్టి ఎక్కడికీ పారిపోలేదు. తిండి పెడుతున్నాను. పడి వుంటోంది’ అంటున్నాడు.
ఈ సంప్రదాయాన్ని స్థానిక రాజకీయనాయకులు కూడా ఖండించటం లేదు. ‘దశాబ్దాలుగా ఇది ఇక్కడి ఆచారం. మాకెవరూ ఫిర్యాదులు చేయడం లేదు’ అంటున్నాడు స్థానిక ఎమ్మేల్యే ట్రాన్స్‌పోర్టు మంత్రి అయిన అఫతాబ్ అహ్మద్. కానీ ఫిర్యాదులు చేసిన సందర్భాలూ వున్నాయి. ఢిల్లీలో పనిమనిషిగా పనిచేయడానికి అసాం నుండి వచ్చిన సకీనా అనే 16 ఏళ్ల అమ్మాయి మూడు నెలలు పోయాక తన సోదరుడికి ఫోన్ చేసింది – హరియాణాలోని పింగోడ్ గ్రామంలో వున్నాను వచ్చి రక్షించమని. అతను వచ్చి చూస్తే నలుగురు అన్నదమ్ములు ఆమెను ఉమ్మడి ‘భార్య’గా వాడుకుంటున్నారు. అతను సామాజిక సంస్థల సాయంతో చెల్లెల్ని రక్షించుకుని తీసుకుని వెళ్లాడు. స్త్రీ భ్రూణహత్యలు ఉత్తరభారతంలో పెరుగుతున్న కొద్దీ ఈ సమస్య విస్తరిస్తోంది. హరియాణా ముస్లిములు, జాట్లే కాదు యుపి, రాజస్థాన్, గుజరాత్‌లలోని అగ్రవర్ణాల వారూ వధువుల కొరత ఎదుర్కుంటున్నారు. కొందరు తెలివైనవారు మధ్యప్రదేశ్‌లోని నిమ్న జాతుల అమ్మాయిలను సేకరించి, వారికి బ్రాహ్మణ ఆచారవ్యవహారాల్లో, ఉచ్చారణలో తర్ఫీదు ఇప్పించి బ్రాహ్మణ అమ్మాయిలని చెప్పి ఉత్తర ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్‌లోని బ్రాహ్మణులకు, జైనులకు అమ్మేస్తున్నారట. వందేళ్ల క్రితం దాకా తెలుగునాట బ్రాహ్మణులలో పాలఘాట్ నుండి వధువులను తెచ్చుకునే ఆచారం వుండేది. అలా తెచ్చుకున్నవారిలో కొందరు కన్యలు కారని, బ్రాహ్మణులు కారనీ తెలిసి లబోదిబోమన్న సందర్భాల గురించి పానుగంటి వారి ‘‘సాక్షి’’ వ్యాసాల్లో కనబడుతుంది. ప్రకృతికి ఎదురీది, మానవధర్మాన్ని పాటించకపోతే ఇలాంటి అనర్థాలు ఎన్నో జరుగుతాయి.
ఎమ్బీయస్ ప్రసాద్