అసలు అంత సినిమా వుందా?

చిరంజీవి 150వ సినిమా. దాదాపు ఏడాది కాలంగా వార్తల్లో వుంటూ వస్తోంది. చిరంజీవి కథ కోసం వేటాడుతున్నారని, దొరకడం లేదని, ఎవరు చెబితే వారే డైరక్టర్ అని, ఇలా ఎన్ని కబుర్లో. ఆఖరికి పూరి…

చిరంజీవి 150వ సినిమా. దాదాపు ఏడాది కాలంగా వార్తల్లో వుంటూ వస్తోంది. చిరంజీవి కథ కోసం వేటాడుతున్నారని, దొరకడం లేదని, ఎవరు చెబితే వారే డైరక్టర్ అని, ఇలా ఎన్ని కబుర్లో. ఆఖరికి పూరి జగన్నాధ్ దర్శకుడిగా ఫైనల్ అయ్యారని, కేరళ వెళ్లి చిరు స్లిమ్ అయ్యారని ఇలా ఒకటి కాదు. సవాలక్ష గ్యాసిప్ లు. ఇప్పుడు తాజా గ్యాసిప్ చిరుపక్కన శ్రీదేవి హీరోయిన్ గా ఫిక్స్ అయ్యారని. 

సరే అదెంత వరకు నిజం అన్నది పక్కన పెడితే, అసలు చిరు 150 సినిమా వుంటుందా? అన్నదే పెద్ద అనుమానం. చిరంజీవి అంటే అభిమానం లక్షలాది మందికి వుండొచ్చు. కానీ ఇప్పుడు ఆయన డ్యాన్స్ లు, ఫైట్లు చేస్తే చూస్తారా? చూడగలరా? అనవసరంగా వున్న అభిమానం వున్నవాళ్లు ఆ డ్యాన్సులు, ఫైట్లు చూసి, ఒకప్పటి జోష్ గుర్తు తెచ్చుకుని ఇబ్బంది పడే ప్రమాదం వుంది. 

ఇవన్నీ ఆలోచించి చిరంజీవి సోలో సినిమా కాకుండా రామ్ చరణ్ తో కలిసి సినిమా చేస్తే ఎలా వుంటుంది అన్న ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. దీని వల్ల సినిమాకు అదనపు మైలేజీ కూడా వస్తుంది. అప్పుడు రామ్ చరణ్ యువ అభిమానులకు, తాను తన అభిమానులను అలరించవచ్చు. ఏదో తనకు ఓ పాట కాస్త క్లాస్ గా, ఓ ఫైట్ చేసాను అన్నట్లుగా వుంటే సరిపోతుంది. పైగా డిగ్నిఫైడ్ గా కూడా వుంటుంది. 

ఇప్పుడు ఇలాంటి కథ కోసం కూడ ఆలోచన చేస్తున్నారని వినికిడి. అలాంటి కథ దొరకాలి..అప్పటి వరకు శ్రీదేవి హీరోయిన్ లాంటి గ్యాసిప్ లు పుడుతూనే వుంటాయి.

కానీ అసలు సిసలైన గ్యాసిప్ ఇంకొటి బయటకు వచ్చింది. పూరి-బివిఎస్ రవి కాంబినేషన్ లో కథ సెట్ అయిపోయిందని, చిరు సోలో హీరో అని, అన్ని వ్యవహారాలు గప్ చుప్ గా జరిగిపోతున్నాయని, ఈ వైనాలు బయటకు అణుమాత్రం పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారని. 

ఇంతకు ఏది నిజమో?