తీవ్రాతి తీవ్రమైన, క్రూరాతి క్రూరమైన నేరాలకు పాల్పడ్డవారిని ‘బాలురు’ అన్న కారణంగా విడిచిపెట్టడం ఎంతవరకు సబబు.? అన్న చర్చ చాలాకాలంగా జరుగుతోంది. 18 ఏళ్ళ కన్నా తక్కువ వయసున్నవారే అయినా, క్రూరమైన నేరాలకు పాల్పడ్డవారిని నర రూప రాక్షసుల్లానే భావించి, వారికి కఠిన శిక్షలు విధించాలన్న వాదన ఈనాటిది కాదు.
మొన్నటికి మొన్న.. అంటే దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన గ్యాంగ్ రేప్ ఘటన అనంతరం బాలనేరస్తుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అప్పటినుంచీ ఇప్పటిదాకా చర్చ అయితే జరుగుతోంది తప్ప, బాల నేరస్తులు.. అన్న పదానికి కొత్త డెఫినిషన్ మాత్రం పుట్టుకు రాలేదు. ఎట్టకేలకు తాజాగా కేంద్రం, బాల నేరస్తుల వయసుని 18 ఏళ్ళ నుంచి 16 ఏళ్ళకు తగ్గించింది. అంటే, తీవ్ర నేరాలకు పాల్పడ్డవారి వయసు 16 ఏళ్ళ పైబడి వుంటే, వారికి సాధారణ పెద్దలకు విధించే శిక్షలనే విధిస్తారన్నమాట.
దేశంలో నేరాల్ని అదుపు చేయడానికి తగిన చట్టాలు లేక కాదు. నేరస్తుల్లో భయం కలిగించే రీతిలో శిక్షలూ లేక కాదు. కానీ, చట్టాలూ, శిక్షలూ సరైన సమయంలో సరైన విధంగా పనిచేయకపోవడంతోనే వస్తోంది సమస్య అంతా. పలుకుబడి వుంటే ఒకలా, పలుకుబడి లేకపోతే ఇంకోలా కేసులు తీరు వుంటోంది. ఓ యాక్సిడెంట్ కేసునే తీసుకుంటే, ఏళ్ళ తరబడి సాగదీయబడుతుందది.. అక్కడ నిందితుడు పలుకుబడి వున్న వ్యక్తి కావడంతో. మరో కేసులో నేరానికి తగిన శిక్ష వెంటనే పడుతుంది. ఇక్కడ నిందితుడు పలుకుబడి లేని వ్యక్తి అయి వుంటాడు ఖచ్చితంగా. నేరాలకు తగిన శిక్షలు వుంటేనే, అవి కూడా తగిన సమయంలో విధింపబడితేనే చట్టం పట్ల, వ్యవస్థ పట్ల సామాన్యుల్లో గౌరవం, భయం వుంటాయి. అది లేనప్పుడు ఏం చేసినా ఉపయోగం వుండదు.
బాల నేరస్తుల విషయానికొస్తే, సమాజంలోకి చాలా చెడు పోకడలు పుట్టుకొస్తున్నాయి. వాటిని అరికట్టకుండా, బాల నేరస్తుల వయసు తగ్గించేసి, పాలకులు చేతులు దులిపేసుకుంటే దాని వల్ల ఉపయోగమే వుండదు. మన దేశంలో అశ్లీల చిత్రాలపై నిషేధం వుంది. కానీ, అవి యధేచ్ఛగా దేశంలో హల్చల్ చేస్తుంటాయి. నిషేధం చిత్రీకరణ పైనా, వాటిని ప్రచారంలోకి తీసుకురావడంపైన మాత్రమే అంటే ఇదెంత చిత్ర విచిత్రమైన అంశమో అర్థం చేసుకోవచ్చు.
ఇక, మీడియాలో నేరాలు ఘోరాలకు సంబంధించిన కథనాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వీటి ప్రభావమూ ఎంతోకొంత యువతపై కన్పిస్తోంది. నీలి చిత్రాలు చూస్తే రేప్‌లు చేసేస్తారా.? క్రైమ్ కథనాల్ని చూసి మర్డర్లు చేసేస్తారా.? అని వితండవాదం చేయడం వల్ల ఉపయోగం లేదు. సామాజిక బాధ్యతతో ప్రతి ఒక్కరూ వ్యవహరించినప్పుడే, సమాజంలో ‘చెడు’ని తరిమెయ్యగలం.
ప్రస్తుతానికైతే బాల నేరస్తుల వయసుని 18 నుంచి 16కి తగ్గించడం శుభ పరిణామమే. అదే సమయంలో, సమాజంలో పెరిగిపోతున్న ‘చెడు’ని అరికట్టడానికి పాలకులు చిత్తశుద్ధితో వ్యవహరించాల్సి వుంది. ఎక్కడ ఏది అనవసరం.? ఏది సమాజంపై దుష్ప్రభావం చూపుతోంది.? అన్న అంశాల్ని పాలకులు పరిగణనలోకి తీసుకుంటే.. చట్టం, న్యాయం, శిక్ష.. అందరికీ సమానంగా వర్తిస్తే.. వ్యవస్థ బాగుపడ్తుంది. ఎనీ డౌట్స్.?