మధ్యాహ్నం 12 గం||లు. హోం శాఖలో యాక్టింగ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా వున్న గోపాల్ దాస్ తన ఆఫీసు నుంచి కొద్ది దూరంలో వున్న పార్లమెంటు హౌస్‌కి వెళ్లి కాంగ్రెసు జనరల్ సెక్రటరీ పికె శంకరాచార్య ఆఫీసుకి వెళ్లాడు. ఆ సమయానికి ఆయన భోజనం చేస్తున్నాడని సెక్రటరీ చెప్పాడు. అయినా పట్టించుకోకుండా దాస్ గదిలోకి వెళ్లిపోయాడు. అర్జంటు మేటర్ అని సంజాయిషీ చెప్పుకున్నాడు. ఫర్వాలేదులే కూర్చో అన్నాడు పికె. నిజానికి యిద్దరికీ ఒకరంటే మరొకరికి గౌరవం లేదు. పికె 30 సంవత్సరాల క్రితం కాంగ్రెసు పార్టీలో చేరి గాంధీ అనుచరుడిగా పేరు తెచ్చుకుని కష్టపడి పైకి వచ్చాడు. రాజకీయాల్లో రాటు తేలాడు. మిత్రులను ఎలా ఆదుకోవాలో, శత్రువులను ఎలా అణచాలో కక్షుణ్ణంగా తెలుసు. కాంగ్రెసు ఎంపీలలో చాలామంది అతని మనుష్యులే, కాబినెట్ మంత్రుల్లో ఎక్కువమంది అతని మనుష్యులే. వాస్తవానికి ప్రధాని కావలసినవాడు, కానీ కాలేదు. ప్రధాని నియమించిన యీ దాస్ అంటే అతనికి యిష్టం లేదు. పదవి చేపడుతూనే దాస్ తను సిఫార్సు చేసిన 10 మంది ఉన్నతాధికారులను తీసేశాడు. ఇక అప్పణ్నుంచి తన శాయశక్తులా దాస్‌పై ప్రధానికి వారంవారం ఫిర్యాదు చేస్తూనే వున్నాడు. కానీ ప్రధాని పట్టించుకోవడం లేదు. అది అతనికి గుర్రుగా వుంది.
ఒక పోలీసు అధికారిగా తను వెళ్లి చెపితే మహాత్మా గాంధీ వినడని, అనుచరుల చేత చెప్పిస్తే మంచిదని దాస్ యితని వద్దకు వచ్చాడు. కానీ పికెకి గాంధీపై చికాగ్గా వుంది. స్వాతంత్య్రం రానంతకాలం బ్రిటిషువాళ్లని యిబ్బంది పెట్టాడు సరే, యిప్పుడు తమని యిరకాటంలో పెడుతున్నాడు. కాంగ్రెసు పార్టీ రద్దు చేసేయాలట! కాంగ్రెసు వారంతా అధికారానికి అలవాటు పడిపోయారట. 'ఏమిటి బాపూ, యిలాటి సలహాలు పబ్లిగ్గా చెప్పవచ్చా?' అని వేడుకుంటే 'నేను ఒక సామాన్య పౌరుణ్ని, నాకు తోచినది ఏదో చెప్తున్నా' అంటాడు. ఆయన సామాన్యుడా? ఆయన ఏం మాట్లాడినా మర్నాడు పేపర్లో హెడ్‌లైన్స్‌గా వస్తుంది. ప్రభుత్వాలను శాసించగలడు. తన శక్తి తెలిసి కూడా అమాయకంగా మాట్లాడతాడు. అన్నీ ఆచరణకు సాధ్యం కాని తిక్క ఐడియాలు, వెళ్లి వివరించబోతే ఆదర్శాలు వల్లిస్తాడు, మొండిగా వాదిస్తాడు. పార్టీ నడపడం ఎంత కష్టమో, ఎన్నిచోట్ల, ఎంతమందితో రాజీ పడవలసి వస్తుందో ఆయనకేం తెలుసు? పార్టీని యీ స్థాయికి తెచ్చాక రద్దు చేసేసి యింట్లో కూర్చోవాలా? తను, తన అనుచరులు మాత్రం జైళ్లకు వెళ్లలేదా? కష్టపడలేదా? ఫలం అనుభవించే సమయానికి వచ్చేసరికి యీయన నీతులు వల్లిస్తున్నాడు. ఇవాళ పొద్దున్నే నిశ్చయించుకున్నాడు – గాంధీగారిని పట్టించుకోకుండా ఆయన మానాన్న ఆయన్ని వదిలేసి, తన దారిన తను వెళ్లడమే ఉత్తమోత్తమం అని. మాటిమాటికీ వెళితే ప్రజల దృష్టిలో ఆయన మరింత హీరో అవుతున్నాడు, పార్టీ విలన్ అవుతోంది.
దాస్ వచ్చీరాగానే మొదలెట్టాడు – గాంధీజీపై యీరోజు యింకో హత్యాప్రయత్నం జరగబోతోంది, ఆయనకు చెప్పి యివాళ్టి సమావేశం రద్దు చేయించాలి, ఆయనకు అదనపు రక్షణ కల్పించాలి, దానికి ఆయనను సమ్మతింపచేయాలి అంటూ. 'కితంసారి జరిగినది తమాషా చూశాం కదా, ఎవరో కుర్రకుంకలు ఏదో చేయబోతే దానికి మనం కంగారు పడడం దేనికి?' అని తేలిగ్గా తీసుకున్నాడు పికె. అప్పుడు దాసు వివరించాడు – 'మా కస్టడీలో వున్న పహ్వా నోరు విప్పి చాలా సంగతులు చెప్పాడు. వాళ్ల బృందం మొదటి ప్రయత్నం విఫలమైతే ఏం చేయాలో ముందే అనుకున్నారట. ఒక్క వారం పాటు స్తబ్దుగా వుండి, తర్వాత వచ్చే మంచి రోజున మళ్లీ ప్రయత్నించాలి అనుకున్నారు. అది 20 న అయింది కాబట్టి 27 తర్వాత వచ్చే మంచి రోజు ఏది అని అనేకమంది జ్యోతిష్కులను అడిగాం, వారిలో ఎక్కువమంది 30వ తారీకు అన్నారు. ఈ రోజు ఎటాక్ చేస్తారని మాకు గట్టి నమ్మకం.' పికె యిబ్బందిగా కదిలాడు. వెళ్లి చెప్పినా ఆ మూర్ఖపు ముసలాయన వినడు. పైగా మర్నాడు పేపర్లో 'పాలనా వ్యవహారాలపై గాంధీ సలహా తీసుకున్న పికె' అని హెడ్‌లైన్స్ వచ్చేస్తుంది. కానీ దాస్ చూస్తూంటే కదిలేట్లు లేడు. ఇక తప్పదురా అనుకుని అతన్ని తీసుకుని గుప్తా భవన్‌కు బయలుదేరాడు.
xxxxxxxxxxxxxxxxxxxx
నాథూ టాక్సీ కన్నాట్ సర్కిల్‌కు చేరేసరికి మిట్టమధ్యాహ్నమైంది. దిగి బజార్లో అటూయిటూ పచార్లు చేశాడు. ఒక రెస్టారెంటుకి వెళ్లి కాఫీ ఆర్డరిచ్చాడు. కాఫీ తాగుతూంటే ''నాథూరామ్ గోడ్సే!'' అనే పిలుపు వినబడింది. నాథూ ఒక్కసారి వణికాడు. మారుపేరు పెట్టుకుని తిరుగుతున్న తనను అసలుపేరుతో పిలిచేవాడు పోలీసే అయి వుంటాడన్న భయంతో తలతిప్పలేదు. కానీ అతనే వచ్చి భుజం తట్టి పక్కనే కుర్చీలో కూలబడ్డాడు. అతను నాథూకు పూనా కాలేజిలో క్లాస్‌మేట్- బల్‌దేవ్. పక్కనే వున్న ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తూ టీకోసం బయటకు వచ్చాడు. తన స్నేహితుడికి నాథూని పరిచయం చేశాడు. పత్రికా సంపాదకుడనీ, రాడికల్ హిందూ భావాలున్నవాడనీ..! తన చరిత్ర యిలా బట్టబయలు కావడం నాథూ భరించలేకపోయాడు. కానీ బల్‌దేవ్ నోరు మూతపడటం లేదు. ఢిల్లీ వచ్చి తనింటికి రాకపోవడమేం అంటాడు, పద ఆఫీసుకి వెళదాం అంటాడు. అతన్ని విదిలించుకోవడానికి నాథూ చాలా ప్రయత్నమే చేయాల్సి వచ్చింది.
మళ్లీసారి వచ్చినపుడు కలుస్తానని చెప్పి గబగబా బయటపడి వేగంగా నడుస్తూ వుంటే ఓ చుంచుమొహం మనిషి వెంటపడ్డాడు. అతన్ని వదిలించుకోవాలని ఒక గార్డెన్‌లోకి వెళ్లి పొద చాటున నిలబడితే అక్కడా ప్రత్యక్షమయ్యాడు. 'నేను మీ బృందంలో వాడినే. కాటక్ పంపించాడు. ఈ ప్రాంతమంతా పోలీసులు తెగ తిరుగుతున్నారు. మీరు పొరపాటున యిక్కడకు వస్తే మిమ్మల్ని హెచ్చరించి యిక్కణ్నుంచి తప్పించి తన దగ్గరకు తీసుకుని రమ్మనమని కాటక్ నన్ను పంపించారు. మీరెలా వుంటారో తెలియక కొట్టుమిట్టు లాడుతున్నాను. మీ స్నేహితుడు పిలవడంతో ఫలానా అని తెలిసింది. పదండి పోదాం' అన్నాడు రహస్యంగా.
''నువ్వెవరో నాకు తెలియదు. నువ్వు నన్ను వదిలిపెట్టకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తాను.'' అన్నాడు నాథూ కోపంగా.
''మీరు చేయనక్కరలేదు. వాళ్లు యిప్పటికే మనల్ని గమనిస్తున్నారు. పదండి పోదాం'' అన్నాడు చుంచుమొహం.
అతన్ని వదిలించుకోవడానికి నాథూ గబగబా నడిచి పక్కనే వున్న సినిమా హాల్లోకి దూరాడు. చిన్న క్లాసులో అయితే ఎక్కువమంది వుంటారని, ఆ టిక్కెట్టు కొన్నాడు. హాల్లో లైట్లు అప్పుడే ఆరాయి. ఎడ్వర్టయిజ్‌మెంట్లు చూపిస్తున్నారు. అటూ యిటూ చూశాడు. అతని పక్కన ఒక మహిళ వుంది. అనవసరంగా కల్పించుకుని మాట్లాడుతోంది. అమె ఏ తరహా మనిషో నాథూకి అర్థమైంది. అటు చూస్తే నలుగురు మనుష్యులు హాల్లో అందరి మొహాలకేసి పరకాయించి చూస్తున్నారు. వాళ్లు తన వరసకు వచ్చేలోపునే లేస్తే మంచిది. ఏదైనా తిందాం పద అంటూ ఆమెను వెంటపెట్టుకుని బయటకు వచ్చాడు. వెతికే మనుషులు యీ 'దంపతుల'ను బయటకు పోనిచ్చారు. సైకిల్ స్టాండులో ఆమె సైకిలు వుంది, యిల్లు దగ్గరే అంది. అయితే పద అన్నాడు. ఆమెను ఎక్కించుకుని బయలుదేరబోతూ వుంటే చుంచుమొహం మళ్లీ అడ్డుపడింది. 'నా మాట వినండి' అంటూ. మళ్లీ నా దగ్గరకి వస్తే మర్యాద దక్కదు అని హెచ్చరించి నాథూ సైకిల్ గట్టిగా తొక్కాడు. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2015)